logo

విత్తనోత్పత్తికి అనుకూలం.. ప్రోత్సహించాల్సిన అవసరం

వ్యవసాయంలో కీలకమైన విత్తనాలను కర్షకులు సేకరించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడి భూముల్లో విత్తితే చివరికి పంట ఎదుగుతుందో లేదోననే అనుమానం.

Published : 23 Apr 2024 01:43 IST

కంది మొక్కలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్త

న్యూస్‌టుడే, గజ్వేల్‌: వ్యవసాయంలో కీలకమైన విత్తనాలను కర్షకులు సేకరించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడి భూముల్లో విత్తితే చివరికి పంట ఎదుగుతుందో లేదోననే అనుమానం. ఇందుకు పరిష్కారంగా స్థానికంగానే విత్తనోత్పత్తి చేపట్టాలని.. అందుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. విత్తనోత్పత్తిపై రైతులు ఆశలు పెంచుకుంటున్నారు. మూడేళ్ల కిందట జిల్లాలో విత్తన సాగు ప్రక్రియ నిలిచింది. దాదాపు 3 లక్షల మంది రైతులు ఏటా రెండు సీజన్‌లలో 7 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. మేలైన విత్తనాలను సమకూర్చటం ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్‌గా మారిపోయింది. గత ప్రభుత్వం పలు గ్రామాలను ఎంపిక చేసి వరి, మొక్కజొన్న, కంది, శనగ ఇతర విత్తనాల ఉత్పత్తికి సాగు చేయించింది.

కందికి రాష్ట్రవ్యాప్త గిరాకీ

జిల్లాలో పండించిన కంది విత్తనాలకు అప్పట్లో రాష్ట్ర వ్యాప్త డిమాండు ఏర్పడింది. స్థానికంగా వాడుకోవడమే కాకుండా విపణిలోనూ విక్రయించి అన్నదాతలు లాభాలు పొందారు. ఉత్పత్తి చేసిన రైతులకు ప్రభుత్వం 50 శాతం రాయితీపై మూల విత్తనం అందించేది. పంట కాలం పాటు పర్యవేక్షణ, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేవారు. కర్షకులు పండించిన వాటిని బ్రాండెడ్‌గా విక్రయించే ప్రక్రియ కొనసాగకపోవడంతో అనిశ్చితి ఏర్పడింది. విత్తనాల కోసం డీలర్ల వద్దకు రైతులు వెళుతున్నారు. లాభాలున్నా ఈ ప్రక్రియను ముందుకు నడిపించలేదన్న ఆరోపణలున్నాయి. కొత్త ప్రభుత్వం చొరవ చూపితే విత్తనోత్పత్తికి పూర్వవైభవం సంతరించుకునే అవకాశం ఉంది. ఏటా జిల్లాలో వీటి కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. నల్ల, ఎర్ర, సాధారణ సారవంతమైన భూములున్న జిల్లా... విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉంది. ప్రభుత్వం చొరవ చూపి లాభాలు ఒనగూరేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

పరిశోధన స్థానం సహకారం

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: నారాయణరావుపేట మండల ఇబ్రహీంపూర్‌ గ్రామ రైతులు వరి విత్తనోత్పత్తికి పంట సాగు చేపట్టి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామానికి చెందిన ఏడుగురు చేపడుతున్నారు. సిద్దిపేట గ్రామీణ మండలం తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానానికి పంటను విక్రయిస్తున్నారు. 2019 నుంచి 21 ఎకరాల్లో వేస్తున్నారు. పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రైతులకు కావాల్సిన బ్రీడర్‌ విత్తనాలను కిలో రూ.72 చొప్పున అందజేస్తున్నారు. పరిశోధన స్థానం నిర్వాహకులు క్వింటాలుకు దొడ్డు రకానివి రూ.2900, సన్న రకానివి రూ.3000 చొప్పున కొంటున్నారు. కేఎన్‌ఎం118, జేజీఎల్‌24423, కేఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 6381, తెలంగాణ సోనా వరి రకాలను సాగు చేస్తున్నారు. సాధారణ వరి పంటతో పోల్చితే ఎకరాకు రూ.15 వేల అదనపు ఆదాయం సమకూరుతోందని రైతులు చెప్పారు. ప్రస్తుతం యాసంగిలో ఆరు ఎకరాల్లో విత్తనాల కోసం వరి వేశానని ఇబ్రహీంపూర్‌ రైతు నాగేశ్‌రెడ్డి చెప్పారు. యాసంగిలో సుమారు 32 క్వింటాళ్లు.. వానాకాలంలో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని