logo

విజ్ఞాన నేస్తం.. మార్గదర్శనం

పుస్తకం.. సమస్త విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. మనిషిని మనీషిగా మార్చేందుకు బాటలు వేస్తుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అంటూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు.

Updated : 23 Apr 2024 06:18 IST

ఎన్నికల్లో గెలిచే నేత మంచి పుస్తకంగా వెలుగొందాలి

న్యూస్‌టుడే, సిద్దిపేట: పుస్తకం.. సమస్త విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. మనిషిని మనీషిగా మార్చేందుకు బాటలు వేస్తుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అంటూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే నేత మంచి పుస్తకం మాదిరి ఉండాలని ఓటర్లు కాంక్షిస్తున్నారు. వెలకట్టలేని విజ్ఞాన నేస్తంగా.. మారాలని విన్నవిస్తున్నారు. గొప్ప వ్యక్తిత్వాన్ని పంచే వీచికలా.. సమాజానికి ఉపయోగపడాలని కాంక్షిస్తున్నారు. నేడు ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’ సందర్భంగా ఓటర్ల ఆకాంక్షలు ఇలా..

మంచి నేస్తం.. విజ్ఞాన భాండాగారం

ఒక మంచి పుస్తకం.. వందమంది మిత్రులతో సమానం. ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం.. అని డా. ఏపీజే అబ్దుల్‌ కలాం పేర్కొన్నారు. బరిలో గెలిచే నేత ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలిచే నేస్తంగా మారాలి. ఆ నమ్మకం ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు పరిష్కార మార్గాలు తెలిసి ఉండాలి. స్నేహపూర్వక వాతావరణంలో సేవలు అందించాలి. ప్రస్తుత తరుణంలో నేతలకు సాంకేతిక పరమైన విజ్ఞానం అవశ్యం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. శాస్త్రీయ భావాలను అలవర్చుకొని ప్రజలను చైతన్యవంతులను చేయాలి.

స్ఫూర్తిగా నిలవాలి..

గొప్ప పుస్తకాల్లో గొప్ప వ్యక్తులు మనతో మాట్లాడతారని పెద్దలు చెబుతుంటారు. అత్యంత విలువైన వారి ఆలోచనలను అందిస్తారని విద్యావేత్తలు అంటారు. అంతటి గొప్పతనం పాలనలో ప్రస్ఫుటం కావాలి. పుస్తకం మాదిరి.. ప్రజాప్రతినిధి మార్గదర్శిగా ఉండాలి. తమ పార్లమెంట్‌ పరిధిలో ఉద్యోగం, ఉపాధి, ఉన్నతికి బాటలు వేయాలి. నిరుద్యోగిత, ఉపాధి లేమి, ఇతర సమస్యలకు పుల్‌స్టాప్‌ పెట్టాలి. ప్రాంత పరిధిలో సుదీర్ఘంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించి.. ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలి. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మార్గదర్శనం చేయాలి. కష్టనష్టాల్లో అండగా నిలవాలి. వ్యక్తిని.. సమున్నత శక్తిగా నిలబెట్టే ఆయుధమే పుస్తకం. నాయకుడు.. ఆ స్థాయికి ఎదగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

తెరిచిన పుస్తకం..

పారదర్శకతను చాటుకునే క్రమంలో తెరిచిన పుస్తకంతో పోలుస్తుంటారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచే నేత ఆ స్థాయిలో ఉండాలన్నది ఓటర్ల అభిమతం. ప్రలోభాలకు గురిచేయకుండా నిజాయతీగా సమాజానికి ఏం చేస్తామని చెబుతూ ఓట్లను అభ్యర్థించాలి. ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్న నమ్మకం కలిగించాలి. నలుగురికి స్ఫూర్తిగా నిలవాలి. ‘పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుందని’ నాడు మహాత్మా గాంధీ సూచించారు. ప్రస్తుత నేతలు.. మంచి ఆలోచనా సరళి, దూరదృష్టి కలిగి ఉండాలి. ఇతరులకు ప్రేరణగా నిలిచినప్పుడే ఇది సాధ్యం. ఓటర్లను ఓట్లు అభ్యర్థించే ముందు ప్రదర్శించే వినమ్రత గెలుపొందిన తరువాత ఐదేళ్ల పాటు కొనసాగించాలి. తన, పర భేదం లేకుండా సేవలు అందించాలి.

జ్ఞాన నేత్రంగా మారి.. అభివృద్ధి చేసే..

గొప్ప వారిగా ఎదిగిన ఎంతో మంది పుస్తకాల ద్వారా జ్ఞానం సముపార్జించినవారే. ప్రత్యేకించి ఏదో ఒక పుస్తకం జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తుంది. నిండైన వ్యక్తిత్వాన్ని పెంచుకునేందుకు.. జీవితాన్ని మార్చుకునేందుకు దోహదపడుతుంది. లోక్‌సభకు ఎన్నికయ్యే నేతలు ప్రజలకు జ్ఞాన నేత్రంగా మారాలి. ఎన్నికైన తరువాత తమ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రజల సంక్షేమానికి బాటలు వేయాలి. మంచి, చెడు తారతమ్యం తెలుసుకొని చెప్పాలి. పఠనంతో సమస్త విజ్ఞానం లభిస్తుంది. ఎన్నికైన తరువాత నేతలు.. వెనుకబడిన వర్గాలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే క్రతువు చేపట్టాలి. తమ బాధ్యతగా అక్షరాస్యతశాతాన్ని పెంచాలి. చదువరులను ప్రోత్సహించాలి. విజ్ఞానవంతుల ద్వారా సమాజంలో చక్కటి మార్పు సాధ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని