logo

చితికిపోతున్న.. చిరు వ్యాపారులు

జిల్లాలోని పురపాలికల్లో వీధి వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణం ప్రతిపాదనల దశ దాటడం లేదు. మెదక్‌లో నిర్మాణం చేపట్టినా ప్రారంభించకుండా అలాగే వదిలేశారు.

Updated : 23 Apr 2024 06:20 IST

పురపాలికల్లో నోచుకోని షెడ్ల నిర్మాణం

నర్సాపూర్‌లో రోడ్లపైనే కూరగాయల వ్యాపారాలు

న్యూస్‌టుడే, నర్సాపూర్‌, మెదక్‌ టౌన్‌, రామాయంపేట, తూప్రాన్‌: జిల్లాలోని పురపాలికల్లో వీధి వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణం ప్రతిపాదనల దశ దాటడం లేదు. మెదక్‌లో నిర్మాణం చేపట్టినా ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. నర్సాపూర్‌, రామాయంపేట పురపాలికల్లో ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. తూప్రాన్‌లో సమీకృత మార్కెట్‌ ఉందనే సాకుతో వీధి వ్యాపారులకు షెడ్లకు ప్రతిపాదించలేదు. దీంతో ప్రధాన రోడ్లపైనే ప్రమాదకర పరిస్థితుల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో వీరిని గుర్తించి రుణాలు పంపిణీ చేసినా షెడ్ల నిర్మాణం చేపట్టడంలో విఫలమవుతోంది. వీధి వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘న్యూస్‌టుడే’ పరిశీలనాత్మక కథనం...

ప్రమాదకర పరిస్థితుల్లో..

జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలైన మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌లలో ప్రధాన రోడ్ల వెంట చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఎండ, వాన, చలికి ఇబ్బందులు పడుతూ వ్యాపారాల్ని కొనసాగిస్తున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకం(పీఎం స్వనిధి) ద్వారా చేయూత అందించింది. మెప్మా ఆధ్వర్యంలో వీరిని గుర్తించి మూడు విడతల్లో రుణాలను పంపిణీ చేసింది. రోడ్ల పక్కన షెడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే నేటికీ అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రుణాలు మంజూరు చేయించిన మెప్మా ఆర్పీలు ఆ తర్వాత ఇటువైపు చూడటం లేదు. షెడ్ల నిర్మాణానికి కౌన్సిల్‌ సమావేశాల్లో తీర్మానాలు చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. కనీసం స్థలాలు సైతం గుర్తించలేదు.

అద్దెల భారంతో..

ప్రధాన రోడ్లపైన చిరు వ్యాపారాలు సాగిస్తున్న వారు తైబజార్‌, అద్దెల భారంతో సతమతమవుతున్నారు. రోడ్లపక్కన తోపుడు బండ్లపై, పాదబాటలపై వ్యాపారాలు చేసుకుంటున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రధాన రోడ్లపై  చిన్నచిన్న దుకాణం అద్దెకు తీసుకోవాలంటే లక్షల్లో అడ్వాన్స్‌లు, వేలల్లో అద్దెలు ఉన్నాయి. అప్పులు చేసి దుకాణాలు అద్దెకు తీసుకొని వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారాలు సరిగా సాగక ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి....

  • మెదక్‌ పురపాలికలో పట్టణ ప్రగతి నిధులు రూ.35లక్షలతో ప్రధాన రోడ్డు పక్కన 25 షెడ్ల నిర్మాణం పూర్తిచేసి ఏడాది అవుతున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇందుకు మెప్మా నుంచి 3.75లక్షలు కేటాయించారు. ఫ్లోరింగ్‌ టైల్స్‌ వేసి, విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తే షెడ్లు వినియోగంలోకి వస్తాయి.
  • నర్సాపూర్‌లో మెదక్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన అటవీ శాఖ కార్యాలయం సమీపంలోని పాదబాటపై తాత్కాలిక షెడ్ల నిర్మాణానికి రెండేళ్ల క్రితం ప్రతిపాదించారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేస్తుండటంతో ఏదైనా వాహనం అదుపుతప్పితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
  • రామాయంపేటలో అనువైన స్థలం లభించడం లేదని ప్రతిపాదనలకే పరిమితం చేశారు.
  • తూప్రాన్‌ పురపాలికలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని ఖాళీ స్థలంలో షెడ్ల నిర్మాణానికి గతంలో పురపాలిక సాధారణ సమావేశంలో ప్రతిపాదించినా అది ఆచరణకు నోచుకోలేదు.

తగిన చర్యలు తీసుకుంటాం:

జైత్‌రాంనాయక్‌, కమిషనర్‌

వీధి వ్యాపారులకు షెడ్ల నిర్మాణం విషయంలో పురపాలిక కౌన్సిల్‌ సమావేశంలో చర్చించి తగిన చర్యలు తీసుకుంటాం. గతంలో ప్రతిపాదనలు పంపిన విషయం వాస్తవమే. ఇందుకు సంబంధించిన అనుమతులు ఎన్నికలు ముగిశాక సాధారణ సమావేశం జరిపి తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని