logo

తాగేదెలా?

జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Updated : 29 Apr 2024 06:24 IST

మంచినీటి ట్యాంకుల శుభ్రతపై నిర్లక్ష్యం

చెర్యాల్‌లో నాచు ఇలా..

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌ (ఇస్మాయిల్‌ఖాన్‌పేట), సదాశివపేట, కంది (ఇంద్రకరణ్‌), జోగిపేట, హత్నూర, కోహీర్‌: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలి. స్థానిక పథకాల నీరు, భగీరథ తాగునీటిని ఒకే ట్యాంకులోకి ఎక్కించి.. ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా మూడుసార్లు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను శుభ్రం చేయాల్సి ఉండగా.. జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు.

అమలుకు నోచని నిబంధనలు

జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం అమలులో భాగంగా 1,655 తాగునీటి ట్యాంకులు నిర్మించారు. వాటి ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా 1, 11, 21 తేదీల్లో ట్యాంకులను శుభ్రం చేయాలనే నిబంధన ఎక్కడా అమలు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మిషన్‌ భగీరథ నీటిని, అవే ట్యాంకుల ద్వారా స్థానిక బోర్ల నీటిని సరఫరా చేస్తున్నా.. క్లోరినేషన్‌ను విస్మరిస్తున్నారు. ఉపరితల, మినీ భాండాగారాలు నాచు పట్టి కనిపిస్తున్నా.. వాటిని శుభ్రం చేయడం లేదు. కొన్ని చోట్ల శిథిలమైన ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

అధికారులు ఏమంటున్నారంటే..

జిల్లాలో మంచి నీటి ట్యాంకులను నిర్దేశిత తేదీల్లో శుభ్రం చేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని మిషన్‌ భగీరథ ఈఈ ఎస్‌.కె.పాషా, జిల్లా పంచాయతీ శాఖ అధికారి సాయిబాబా పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, నిబంధనలు పాటించాలని సూచించారు.

క్షేత్ర స్థాయి పరిస్థితి

  • సంగారెడ్డి మండలం నాగాపూర్‌, కొత్లాపూర్‌, కల్పగూర్‌, అంగడిపేట, ఇర్గిపల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, తాళ్లపల్లి, ఫసల్‌వాది, కుల్పగూర్‌, మహ్మద్‌ షాపూర్‌ తండా, గుడి తండా తదితర గ్రామాల్లో మంచినీటి ట్యాంకుల పరిశుభ్రతను పట్టించుకోవడం లేదు. పరిసరాలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. సదాశివపేట మండలం మద్దికుంట, నందికంది, ఇశ్రితాబాద్‌, చందాపూర్‌, ఆత్మకూర్‌, పొట్టిపల్లి, పెద్దాపూర్‌, నిజాంపూర్‌, వెంకటాపూర్‌ తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.  
  • హత్నూర గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ఇనుప చువ్వలు తేలాయి.
  • కంది మండలంలోని కవలంపేట, బేగంపేట, చెర్యాల్‌, చెర్లగూడెం తదితర గ్రామాల్లో నెలలో మూడు సార్లు ట్యాంకులు శుభ్రం చేయాలనే నిబంధన అమలు చేయడం లేదు.
  • అందోలు మండలం పోతిరెడ్డిపల్లి తండాలో ట్యాంకు శిథిలావస్థకు చేరింది. జోగిపేటలోని ప్రభు మందిరం ఆలయం పక్కనున్న నీటి ట్యాంకుల్లో గతంలో కోతులు పడి మృతి చెందాయి. ఆ తర్వాత కూడా రక్షణ చర్యలు తీసుకోవడం లేదు.
  • కోహీర్‌ మండలం మాచిరెడ్డిపల్లి, పిచేర్యాగడి, గుర్జువాడ తదితర గ్రామాల్లో మినీ ట్యాంకులు నాచు పట్టి దర్శనమిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని