logo

కల సాకారమయ్యేలా.. భరోసానిచ్చేలా..

ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు.

Updated : 29 Apr 2024 06:27 IST

ములుగు అటవీ కళాశాలలో యువతకు ప్రత్యేక శిక్షణ

తేనెటీగల పెంపకంపై..

న్యూస్‌టుడే, ములుగు: ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు. ఇలాంటి వారికి చేయూత అందించేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. మరెక్కడా లేని విధంగా తొలిసారిగా చదువు మధ్యలో నిలిపివేసిన విద్యార్థుల కలలను సాకారం చేయాలన్న లక్ష్యంతో శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. ఇందుకు ములుగు అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం వేదికగా మారింది.

ఆరు నెలలు.. రూ.10 వేల భృతి

శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఆయా అంశాల్లో మెలకువలన్నీ నేర్పిస్తారు. శిక్షణ పూర్తయ్యాక అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం నుంచి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. ఆరు నెలల కోర్సులో మూడు నెలల పాటు బోధన, మిగిలిన నెలల్లో క్షేత్రస్థాయి తర్ఫీదు ఉంటుంది. ప్రతి నెలా రూ.10 వేల చొప్పున గౌరవ భృతి ఇస్తున్నారు.

ఇప్పటికే రైతులకు విడతల వారీగా..

ఆయా అంశాల్లో శిక్షణ గతేడాదిలో ప్రారంభించారు. ముందుగా రైతులకు విడతల వారీగా మెలకువలు నేర్పించారు. పలువురు స్వయంఉపాధి సైతం పొందుతున్నారు. ఏడాది నుంచి మధ్యలో చదువు మానేసిన విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇందుకు రాష్ట్రం నుంచి యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రస్తుత పది మందికే అవకాశం కల్పించారు. మిగిలిన వారికి మరోసారి అవకాశం కల్పించనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

మధ్యలో విద్యాభ్యాసం ఆపేసిన యువతకు ఇదో సదవకాశం. అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం తరఫున శిక్షణలు ఇచ్చి ధ్రువపత్రాలు అందిస్తాం. తద్వారా బ్యాంకుల్లో సైతం రుణం పొందవచ్చు. స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది.

ప్రొఫెసర్‌ ఎం.మమత, కార్యక్రమ సమన్వయకర్త

భరోసా కల్పించింది  ధనుంజయ్‌

నేను ఆరు నెలల పాటు శిక్షణ పొందాను. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. నేను స్వయంగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టాను. ప్రస్తుతం ఉపాధి పొందుతూ మరి కొందరికి వీటి గురించి వివరిస్తున్నాను. ఇక్కడ నేర్చుకున్నవి ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ కార్యక్రమం నాకు ఎంతో భరోసా కలిగించింది.

మూడు అంశాల్లో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్ర కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సహకారంతో అటవీ కళాశాలలో ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పది నుంచి డిగ్రీ వరకు చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. వీరిలో నుంచి కొందరిని ఎంపిక చేసి వారికి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.

  • వర్మీకంపోస్ట్‌ ఎరువుల తయారీ.. సేంద్రియ సాగులో వర్మికంపోస్ట్‌ కీలకం. దీని తయారీని నేర్పిస్తున్నారు. ఏయే పదార్థాలు ఎంత మోతాదులో కలపాలి, పంటలకు ఎలా ఉపయోగడతుంది, ఎలా, ఎక్కడ విక్రయించాలని తదితర అశాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీని వల్ల విద్యార్థులకు ఉపాధి లభించడంతో పాటు సొంతంగా సేంద్రియ సాగుకు వినియోగించుకోవచ్చు.
  • తేనెటీగల పెంపకం.. మార్కెట్‌లో తేనెకు ఎల్లప్పుడూ విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. డిమాండ్‌ కు తగ్గట్టుగా ఉత్పత్తి లేదు. ఈ తరుణంలో తేనెటీగల పెంపకంతో కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆదాయాన్ని పొందే తీరుతో పాటు తేనె ఎక్కడ విక్రయించాలి, తదితర అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు.
  • నర్సరీలు.. ఇటీవల కాలంలో నర్సరీలకు డిమాండ్‌ పెరిగింది. ఇందుకు తగ్గట్టుగా ప్రత్యేకంగా నర్సరీల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. నర్సరీల ఏర్పాటు తీరు, మొక్కల పెంపకం, తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని