logo

మహిళా వాణి.. వినిపించదేమి..!

మెదక్‌ లోక్‌సభ పురుడు పోసుకొని 72 ఏళ్లయింది. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలే ఎంపీలుగా ఎన్నికవడం గమనార్హం. తాజా ఎన్నికల్లోనూ 54 మంది బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థులు శూన్యం.. కీలకమైన చట్టసభల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలుదక్కకపోవడం గమనార్హం.

Published : 29 Apr 2024 01:45 IST

మెదక్‌ లోక్‌సభ పురుడు పోసుకొని 72 ఏళ్లయింది. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలే ఎంపీలుగా ఎన్నికవడం గమనార్హం. తాజా ఎన్నికల్లోనూ 54 మంది బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థులు శూన్యం.. కీలకమైన చట్టసభల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలుదక్కకపోవడం గమనార్హం. పురుషులతో పోలిస్తే మగువలకు నామమాత్రంగా అవకాశాలు దక్కుతున్నాయి. జహీరాబాద్‌ స్థానానికి 26 మంది పోటీ చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా కొనసాగుతున్న చేవెళ్ల నుంచి 47 మంది బరిలో ఉన్నారు. ఈ రెండు చోట్ల మహిళా అభ్యర్థులు లేకపోవడం గమనార్హం.

న్యూస్‌టుడే, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి అర్బన్‌, వికారాబాద్‌: ఆకాశంలో సగం.. అవకాశాల్లో సమం.. అనేది మహిళా సాధికారత నినాదం. మహిళలు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ దూసుకెళ్తున్నారు. విద్య, ఉద్యోగాలు, ఉపాధి ఇలా ఏదైనా అన్నింటా రాణిస్తుండటం విశేషం. ఏ ఎన్నికలైనా వీరే కీలకం. నాయకులు సైతం మహిళలే మా తొలి ప్రాధాన్యం అంటూ వల్లె వేస్తూనే ఉంటారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఇప్పటి వరకు ముగ్గురే ఎంపీలుగా విజయాలు అందుకున్నారు. జహీరాబాద్‌ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ లేరు.

క్షేత్రస్థాయిలో..

జనాభాలో, ఓటర్లుగా సత్తా చాటినా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం అంతంతే ఉంటోంది. స్త్రీ శక్తికి గణంకాలు దర్పణంగా నిలుస్తుండగా, అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తున్నారు. కీలకమైన శాసనసభ, లోక్‌సభలో మాత్రం వీరి ప్రాతినిధ్యం అంతంతే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో అవకాశం లభిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్‌ నుంచి గెలిచిన సునీతారెడ్డి ఒక్కరే ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎంతో మంది సర్పంచి పీఠాన్ని అధిరోహించారు. ఇటీవల పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం ఎంపీపీలు మాత్రం పదవుల్లో కొనసాగుతున్నారు. అన్ని జిల్లాల్లో 50 శాతం మంది ఎంపీపీలు ఉన్నారు. మెదక్‌ నియోజకవర్గ పరిధిలో మహిళలు 23781 మంది ఎక్కువగా ఉన్నారు. జహీరాబాద్‌ పరిధిలో 5,207, చేవెళ్ల పరిధిలోని వికారాబాద్‌ జిల్లాలో 12,209 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

అవకాశం అంతంతే..

  • స్థానిక సంస్థల పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ల అమలుతో మగువలకు ప్రజాప్రతినిధి కావడానికి విస్తృత అవకాశాలు అందివచ్చాయి. అయితే వీరిలో సింహభాగం మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే.
  • కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చట్టసభల్లో పోటీ చేసే అవకాశం లభిస్తోంది. ఇందులోనూ స్వల్ప శాతం మందికి ఎమ్మెల్యే, ఎంపీగా అవకాశం దక్కుతోంది. అత్యధికంగా పురుషులే అవకాశాలను దక్కించుకుంటున్నారు.
  • ఉన్నత విద్యావంతులు కోకొల్లలుగా ఉన్నా రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి వారిలో తక్కువగా ఉండటం మరో కారణం. ఒకవేళ వచ్చినా సమకాలీన రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు.

మెదక్‌ నుంచి..:

  • 1967 ఎన్నికల్లో సంగం లక్ష్మిబాయి (కాంగ్రెస్‌) బరిలో నిలిచి విజయం సాధించారు. 1971 వరకు పదవిలో ఉన్నారు.
  • 1980లో మెదక్‌ నుంచి పోటీ చేసిన ఇందిరాగాంధీ గెలుపొంది ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 1984లో హత్యకు గురయ్యే వరకు ఆమె ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు.
  • 2009లో భారాస (అప్పటి తెరాస) నుంచి విజయశాంతి పోటీ చేసి   గెలుపొందారు. 2014 వరకు    పదవిలో ఉన్నారు.

ఇద్దరు.. హ్యాట్రిక్‌ వీరులు

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట: మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇద్దరు ఎంపీలు నాలుగు పర్యాయాలు పదవిలో కొనసాగారు. వరుసగా మూడు పర్యాయాలు గెలుపొంది హ్యాట్రిక్‌ అందుకున్నారు. 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన 17 ఎన్నికల్లో ఎనిమిది పర్యాయాలు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే విజయాలు సాధించారు. 1957లో జరిగిన ఎన్నికల్లో వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు ఎంపీగా గెలిచారు. 1962లో ఓడిపోగా, 1967, 1971, 1977లలో జరిగిన ఎన్నికల్లో విజయాలు అందుకున్నారు. మల్లికార్జున్‌ 1980లో గెలుపొందగా, 1984లో ఓడిపోయారు. 1989, 1991, 1996లో వరుసగా ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.

హోరెత్తిస్తే కేసులే

న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ, మిరుదొడ్డి: ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తాయి. ప్రచార రథాలకు మైకులను ఏర్పాటు చేసి.. మాకే ఓటు వేయాలంటూ ఊదరగొడతారు. సౌండ్‌బాక్సులను ఏర్పాటు చేసి ప్రచారం సాగిస్తుంటారు. ఇలా ఊదరగొట్టడం ఎదుటివారికి ఇబ్బందే. ఈ విషయంలో ఎన్నికల సంఘం పలు నిబంధనలు విధించింది. ఎంతమేర వినియోగించాలో సూచించింది. పర్యావరణ చట్టానికి అనుగుణంగా వీటిని రూపొందించింది. వీటిని పాటించకపోతే అధికారులు చర్యలు తీసుకోవడం ఖాయం. ప్రచారం నిర్వహించేవారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కేసులను ఎదుర్కోక తప్పదు.

నిబంధనలు ఇలా..: నివాస ప్రాంతాల్లో 45-55 డెసిబుల్స్‌ మాత్రమే వాడాలి.ః వైద్యశాలలు, విద్యాలయాల సమీపంలో 40-50 డెసిబుల్స్‌ వినియోగించాలి.ః వ్యాపార ప్రాంతాల్లో 55-65, పారిశ్రామిక ప్రాంతాల్లో 70-55 డెసిబుల్స్‌ వాడుకోవచ్చు.

పోలింగ్‌ కేంద్రం ఎక్కడో తెలుసుకునేలా..

న్యూస్‌టుడే, పాపన్నపేట: లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ సమయం సమీపిస్తోంది. అధికారులు ఓటర్లకు పోలింగ్‌ చీటీలు పంపిణీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతులు సమకూర్చేలా చర్యలు చేపట్టారు. ఇదే క్రమంలో ఓటు హక్కు ఉన్న వారు తమ ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉందో తెలుసుకునేందుకు ఇబ్బంది లేకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ.. పోలింగ్‌ కేంద్రాల వారీగా సమగ్ర అంశాలను అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌సైట్‌లో అన్ని అంశాలను పొందుపర్చింది.  ఓటర్లు  www.ceotelangana.nic.in  వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి అందులో ఎలక్టోరల్‌ రోల్స్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసుకుంటే అన్ని పోలింగ్‌ కేంద్రాల వివరాలు కనిపిస్తాయి. ఓటర్లు తమకు కావాల్సిన గ్రామం, పోలింగ్‌ కేంద్రంపై క్లిక్‌ చేస్తే గూగుల్‌ మ్యాప్‌, చిత్రాలు కనిపిస్తాయి. ఆ కేంద్రం పరిధిలో పురుషులు, మహిళలు ఎంత మంది ఉన్నారనే వివరాలు కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది. 

ఒక్కసారే అవకాశం

న్యూస్‌టుడే, చేగుంట: మెదక్‌ పార్లమెంటు స్థానం నుంచి పీడీఎఫ్‌, టీపీఎస్‌, భారతీయ జనతా పార్టీలకు ఒకే సారి అవకాశం వచ్చింది. 1952 ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి జయసూర్య ఎంపీగా గెలుపొందారు. 1971 ఎన్నికల్లో టీపీఎఫ్‌ తరపున పోటీ చేసిన మల్లికార్జున్‌ విజయం సాధించారు. 1999లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆలేె నరేంద్ర ఎంపీగా విజయాన్ని అందుకున్నారు. ఇలా ఆయా పార్టీల వారు మెదక్‌ ఓటర్లు ఒక్కో సారి మాత్రమే అవకాశం కల్పిండం గమనార్హం. కాగా 2004 ఎన్నికల్లో ఆలే నరేంద్ర తెరాస నుంచి పోటీ చేసి విజయం సాధించడం విశేషం. ఇక కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెరాసలకు ఎక్కువ సార్లు ఎంపీగా గెలుపొందే అవకాశం వచ్చింది.

ఒక నియోజకవర్గం.. ఇద్దరు ఎంపీలు

1961 వరకు ద్విసభ్య విధానం

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం: గతంలో లోక్‌సభ నియోజకవర్గం ఒకటే అయినా ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించేవారు. ఇలాంటి వాటిని ద్విసభ్య నియోజకవర్గంగా పిలిచేవారు. బ్రిటీష్‌ వారి కాలంలో ప్రవేశపెట్టిన ఈ విధానం స్వాతంత్య్రం తర్వాత కూడా మన దేశంలో కొన్నాళ్లు కొనసాగింది. ఈ విధానం ప్రకారం ఒక లోక్‌సభ సెగ్మెంట్‌కు ఇద్దరు సభ్యులు ఎన్నికయ్యేవారు. అందులో ఒకరు జనరల్‌ వర్గం, మరొకరు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉండేవారు. ఈ వ్యవస్థ రద్దయ్యే వరకు మన రాష్ట్రంలో 4 ద్విసభ్య నియోజకవర్గాలు కొనసాగాయి. అందులో కరీంనగర్‌ ఒకటి. దేశంలో 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరగ్గా.. కరీంనగర్‌ ద్విసభ్య నియోజకవర్గం నుంచి బద్దం ఎల్లారెడ్డి (జనరల్‌), ఎం.ఆర్‌.కృష్ణ (ఎస్సీ రిజర్వ్‌డ్‌) ఎన్నికయ్యారు. 1957లో ఎం.శ్రీరంగారావు(జనరల్‌), ఎం.ఆర్‌ కృష్ణ(రిజర్వ్‌డ్‌) ఎన్నికయ్యారు. 1961లో ద్విసభ్య విధానాన్ని రద్దు చేసి ఏకసభ్య పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా నియోజకవర్గాలను వేర్వేరుగా కేటాయించారు.

అప్పట్లో అభ్యర్థికో ఇనుపపెట్టె..

న్యూస్‌టుడే, మిరుదొడ్డి: ఎన్నికల నిర్వహణ కత్తి మీద సాము లాంటిదే. ప్రస్తుతం అందివచ్చిన సాంకేతికతను ఎన్నికల సంఘం వినియోగించుకుంటూ ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పుడు పోలింగ్‌ సమయంలో ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ యంత్రాలను వినియోగిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం సిబ్బంది ఈవీఎంలతో తమకు కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్తుంటారు. కానీ 1952, 1957లలో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రత్యేకంగా ఇనుప పెట్టెలు ఏర్పాటు చేసేవారు. వాటిని తీసుకెళ్లేందుకు సిబ్బంది నానాపాట్లు పడేవారు. ఇక ఓటర్లు అభ్యర్థికి కేటాయించిన పెట్టెల్లోనే బ్యాలెట్‌ పత్రాలను వేసేవారు. 1962లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ విధానంలో మార్పు తీసుకొచ్చి పోలింగ్‌ బూత్‌కు ఒక పెట్టె ఏర్పాటు చేసేవారు. 1982లో కొన్ని ఎలక్టాన్రిక్‌ యంత్రాల వినియోగాన్ని ఆరంభించారు. అప్పటి నుంచి మార్పులు చోటుచేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు అన్ని చోట్ల వాటిని వినియోగిస్తుండటంతో సిబ్బందికి శారీరక శ్రమ తగ్గింది. పోలింగ్‌లో అక్రమాలకు తెరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని