Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!

Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి విద్యుత్‌ ద్విచక్ర వాహనం రాక ఆలస్యం కానుంది. అందుకు గల కారణాలను ఆ కంపెనీ ఎండీ వివరించారు.

Published : 14 May 2024 00:04 IST

Royal Enfield | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయంగా విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఏయేటికాయేడు వీటి అమ్మకాలు ఊపందుకుంటున్నాయి.  ఈ విషయంలో స్కూటర్లదే హవా. కొన్ని విద్యుత్‌ మోటార్‌ సైకిళ్లు అందుబాటులో ఉన్నా.. అమ్ముడవుతున్నవి మాత్రం పరిమితి సంఖ్యలోనే. అవి కూడా రివోల్ట్‌, హాప్‌ ఎలక్ట్రిక్‌ వంటి స్టార్టప్‌ కంపెనీలు తయారుచేసినవే. ఈ విషయంలో పెద్ద పెద్ద కంపెనీలు ఇంకా రంగ ప్రవేశం చేయాల్సిఉంది. ఇందుకోసం బైక్‌ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దేశీయంగా బుల్లెట్‌, క్లాసిక్‌ 350, హంటర్‌ వంటి మోటార్‌ సైకిళ్లను విక్రయిస్తున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) సైతం విద్యుత్‌ మోటార్‌సైకిల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. 2025 నాటికి తమ తొలి విద్యుత్‌ మోటార్‌ సైకిల్‌ను తీసుకొస్తామని ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ మరింత ఆలస్యం కానుంది. ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్ తీసుకొచ్చే ఆలోచన ఉన్నప్పటికీ.. ఆ విషయంలో తాము తొందరపడడం లేదని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ లాల్‌ అన్నారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. అందుకు గల కారణాలను తెలిపారు.

విద్యుత్‌ మోటార్‌ సైకిల్‌ తయారీకి పెద్ద బ్యాటరీలు అవసరమన్నారు. ప్రస్తుతం బ్యాటరీలు సైజు పరంగా పెద్దగా ఉన్నాయని, వాటి బరువు కూడా అధికంగా ఉంటోందని పేర్కొన్నారు. ఖరీదు కూడా ఎక్కువేనని, దీనివల్ల పెట్రోల్‌ ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఖరీదు బాగా పెరిగిపోతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ విద్యుత్‌ వాహనాలకు డిమాండ్‌ పెద్దగా ఏర్పడలేదని చెప్పారు. బ్యాటరీల బరువు తగ్గి, వాటి ధరలు అందుబాటులోకి వచ్చేవరకు ఆశించిన స్థాయిలో డిమాండ్‌ ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుతానికి తాము సొంతంగా ఓ ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ మోటార్‌ సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నామని లాల్‌ తెలిపారు. స్పెయిన్‌కు చెందిన స్టార్క్‌ మోటార్‌ సైకిల్‌తో మరో ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నామని చెప్పారు. అయితే, వీటిని ఎప్పుడు లాంచ్‌ చేసేదీ మాత్రం వెల్లడించలేదు. స్టార్క్‌ ఫ్యూచర్‌ కంపెనీతో 2022లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని