logo

మోదీ.. బీసీ.. ట్రస్టు..

పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు.

Updated : 29 Apr 2024 06:23 IST

న్యూస్‌టుడే, గజ్వేల్‌,మెదక్‌: పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు. మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మెదక్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో మెదక్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండగా మిగతా ఆరింటిలో ప్రతిపక్ష పార్టీ భారాస ఎమ్మెల్యేలున్నారు. నియోజకవర్గంలో 18-40 ఏళ్ల వయసున్న ఓటర్లు 9.50 లక్షలు ఉన్నారు. ప్రధాన పార్టీ నేతలు వీరి అవసరాలను గుర్తించి ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. యువజన, మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

భాజపా: జాతీయభావం

ఎలాగైనా మెదక్‌ పార్లమెంటు సీటును గెలుచుకుని పాగా వేయాలని భాజపా గురిపెట్టింది. పార్లమెంటు పరిధిలో భాజపా ఎమ్మెల్యేలు లేకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా గట్టెక్కిస్తుందని నమ్మకంతో ఉన్నారు. వాగ్ధాటి ఉన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును బరిలోకి దించిన భాజపా సర్వశక్తులు ఒడ్డుతోంది. రాబోయేది మళ్లీ మోదీ ప్రభుత్వమేనని భారాస, కాంగ్రెస్‌లకు ఓట్లేస్తే వృథా అవుతాయని చెబుతున్నారు. దేశంలో ప్రధానిగా మోదీ తప్ప మరెవ్వరున్నా రక్షణ ఉండదని, హిందువుల ఆరాధ్య దైవం రాముడికి గుడి కట్టించటమేకాక అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న భాజపానే గెలిపిస్తారని విశ్వసిస్తున్నారు.

కాంగ్రెస్‌: చేరికలకు ప్రోత్సాహం

కాంగ్రెస్‌ పథకాలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారని ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ‘బీసీ బిడ్డను గెలిపించండి’ అని సామాజికవర్గాన్ని ప్రచారంలో ముందుకేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటే చోట మెదక్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నా చేరికలు, భారాసపై అసంతృప్తి, ప్రభుత్వంపై భరోసా ఓట్లు తీసుకొస్తాయని నేతలు చెబుతున్నారు. భారాస ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. డీసీసీబీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా నేతలు  ఎలక్షన్‌రెడ్డి, కేసీఆర్‌ సన్నిహితుడు మడుపు భూంరెడ్డి కారు దిగి హస్తం పార్టీలో చేరారు. పదుల సంఖ్యలో ఓటర్లలో పట్టున్న నేత అయినా సరే చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన తీరును ప్రస్తావిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

భారాస: మరోసారి పట్టు కోసం

సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాలు తమకు కంచుకోటగా ఉన్నాయని భారాస భరోసాతో ఉంది. 2004 నుంచి మెదక్‌లో వరుసగా విజయం సాధిస్తున్న భారాస ఈసారీ పట్టు నిలుపుకోవాలని వ్యూహంతో ముందుకెళుతోంది. మెదక్‌ పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలు భారాస ఖాతాలో ఉన్నందున భారీగా ఓట్లు రాబట్టుకునేందుకు అవకాశం ఉందని పార్టీ నేతలు నమ్ముతున్నారు. సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని బరిలోకి దించిన భారాస విజయం కోసం పావులు కదుపుతోంది. రూ.100 కోట్ల ట్రస్టు ద్వారా సొంతంగా సేవా కార్యక్రమాలు చేస్తానని వెంకట్రామిరెడ్డి ప్రచారంలో చెబుతున్నారు. ఎలాగైనా గెలిపించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌ పాలనలో లోపాలు ఎత్తిచూపి ఓట్ల లబ్ధి పొందాలనే వ్యూహంతో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని