logo

పట్టు సాధించేలా..

కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది.

Updated : 29 Apr 2024 06:22 IST

రేపు అల్లాదుర్గంలో ప్రధానమంత్రి సభ

న్యూస్‌టుడే, మెదక్‌, అల్లాదుర్గం: కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో అగ్రనేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తూ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రి అమిత్‌షా, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌సావంత్‌ ప్రచారం చేపట్టగా.. ప్రధాని నరేంద్రమోదీ మెతుకుసీమలో పర్యటించనున్నారు. ఈ నెల 30 మంగళవారం మెదక్‌ జిల్లా అల్లాదుర్గం శివారులోని చిల్వేర్‌ వద్ద నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారు. మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ కార్యకర్తలు, శ్రేణులను తరలించనున్నారు.

  • మెదక్‌ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో రఘునందన్‌రావు బరిలో నిలిచారు. 2019 ఎంపీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసిన ఆయన మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జహీరాబాద్‌ స్థానానికి నాలుగో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి సారి కాంగ్రెస్‌ గెలవగా, ఆ తర్వాత వరుసగా భారాస విజయం సాధించింది. రెండు సార్లు ఎంపీగా గెలిచిన బీబీపాటిల్‌ ఈసారి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు.

నెలన్నరలోనే రెండోసారి

ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలనే యోచనతో పార్టీ అగ్రనేతలు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యే సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. లక్ష మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు 30 ఎకరాలను చదును చేశారు. మెదక్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాలకు అందుబాటులో ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. గత మార్చి 5న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులో జరిగిన భాజపా విజయ సంకల్పసభకు హాజరైన ప్రధానమంత్రి నెలన్నర రోజుల వ్యవధిలోనే మరోసారి ఉమ్మడి జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రధాని సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా.. పెద్దఎత్తున పార్టీ శ్రేణులను తరలించి, సభ విజయవంతానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. జహీరాబాద్‌, మెదక్‌ ఎంపీ అభ్యర్థులు బీబీపాటిల్‌, రఘునందన్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని