logo

విత్తనం.. ఎవరిదీ పెత్తనం

వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్‌ఆర్‌, ఐసీఏఆర్‌ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది.

Published : 23 Apr 2024 02:51 IST

మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన వరి వంగడంతో సాగైన పొలం

గరిడేపల్లి, న్యూస్‌టుడే: వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్‌ఆర్‌, ఐసీఏఆర్‌ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. అవీ పాతవి ఎక్కువ సరఫరా చేస్తుండటంతో రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దిగుబడులే లక్ష్యంగా ప్రైవేటు కంపెనీలు, ఏజెన్సీలు విత్తన రకాలను విడుదల చేసి మార్కెటింగ్‌ చేస్తున్నాయి. ఒక ప్రాంతానికి పనికిరావని తేలిన తర్వాత ఇతర ప్రాంతాల్లో విడుదల చేస్తున్నారు. ఇక్కడ విజయవంతం కావడంతో అమాంతం ధర పెంచేస్తున్నారు. అది రైతులపై పెనుభారంగా మారుతోంది. ఇటీవల ప్రైవేటు విత్తనాల కంపెనీలదే పెత్తనం సాగుతోంది. విత్తనాలు సరిగా లేకపోయినా, కల్తీ, నకిలీ విత్తనాలు సరఫరా చేసినా అంతగా జరిమానాలు, శిక్షలు లేకపోవడంతో ప్రైవేటు దందాపై అడ్డూ అదుపూ లేకుండా పోయింది. రైతులు ఏటా ఏదో ఒక జిల్లాలో మోసపోయి నష్టం చవిచూస్తూనే ఉన్నారు.

విత్తన రాయితీ..

పదేళ్ల క్రితం వరకు రైతులకు ప్రభుత్వం రాయితీ విత్తనాలు సరఫరా చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత విత్తన రాయితీ ఎత్తేసింది. కేంద్రం ఇచ్చే ఎన్‌ఎస్‌ఎం(నేషనల్‌ సెక్యూరిటీ మిషన్‌) రాయితీ కిలోకు రూ.5 ఉండేది. కేంద్రం అది తీసేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతులకు రాయితీ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ లేకుండా కొన్ని రకాల విత్తనాలు సరఫరా చేస్తోంది. అయినా రైతులు వాటిని కొనడం లేదు. నాలుగు సంవత్సరాల క్రితం వరకు బీపీటీ (సాంబమసూరి) విత్తనాలు వ్యవసాయశాఖ ద్వారా సహకార సంఘాల్లో ఉంచి అమ్మేవారు. ప్రైవేటు విత్తనాలు రావడంతో బీపీటీ ఇతర వంగడాలను కొనడం మానేశారు. రెండు సంవత్సరాల పాటు విత్తనాలు తెప్పించి తిరిగి పంపించారు. దాంతో వ్యవసాయ శాఖ సైతం ఆ విత్తనాలు తీసుకురావడం లేదు. ఐదేళ్లుగా ఏ రకమైన వరి విత్తనాలూ సరఫరా చేయడం లేదని జిల్లా వ్యవసాయాధికారి జి.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. పరిశోధనా స్థానాలలో విడుదలైన కొన్ని రకాలు రాష్ట్రం అంతటా అనుకూలంగా ఉండటం లేదు. కరీంనగర్‌, జగిత్యాల, వరంగల్‌ జిల్లాల్లో విడుదలైన రకాలు ఇక్కడ ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం, అక్కడి నేలల్లో సన్నాలుగా ఉండి ఇక్కడి నేలల్లో దొడ్డుగా ఉండటంతో రైతులు వాటిపై ఆసక్తి చూపడం లేదు.

సన్నాలకే మొగ్గు..

ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా అందులో దాదాపు 8 లక్షల ఎకరాల్లో సన్నాలే సాగు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు సగం దొడ్డు రకాలు సాగుచేశారు. ప్రైవేటు విత్తనాలు 50 రకాలు మార్కెట్‌లోకి రావడం, దిగుబడులు ఆశించిన దానికంటే ఎక్కువగా రావడంతో వాటిపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. పరిశోధనా స్థానాల నుంచి విడుదలైన రకాల్లో ఎకరానికి 40-45 బస్తాల దిగుబడి ఉండగా, ప్రైవేటు రకాలు కొత్తగా వచ్చినవి 50-55 బస్తాల వరకు దిగుబడి ఇస్తున్నాయి. అందుకే ప్రైవేటు కంపెనీలు రైతులపై పెత్తనం చెలాయిస్తున్నాయి. వారు చెప్పిన ధరకే కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దిగుబడి ఎక్కువగా వచ్చే విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి ధరను పెంచేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని