logo

ప్రలోభాల ఎర.. తప్పదు చెర!

లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది.

Updated : 24 Apr 2024 06:12 IST

నాంపల్లి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. ఈ ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అనేక తాయిలాలు అందిస్తుంటారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా ఎన్నికల చట్టం ప్రకారం నేరమే. ప్రభావితం చేసిన వారిపై  భారతీయ శిక్షాస్మృతి, ప్రజాప్రాతినిధ్య చట్టం (రిప్రజెంటేషన్‌ ఆప్‌ పీˆపుల్‌ యాక్ట్‌)-1951, ఎక్సైజ్‌ చట్టం-1968 ప్రకారం పలు రకాల కేసులు నమోదు చేస్తారు. ఏయే నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసుకుందాం.

మద్యం పంపిణీ చేస్తే..

ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి మద్యం పంపిణీ చేస్తుంటారు. అనుమతి లేకుండా పరిమితికి మించి మద్యం నిలువ ఉంచినా.. విక్రయించినా, ఓటర్లకు పంపిణీ చేసినా కేసు నమోదు చేస్తారు. ఓటర్లకు సారా, కల్లు, మద్యం ఇతర మత్తు పదార్థాలు ఏవి ఇచ్చినా నేరమే అవుతుంది. పట్టుబడిన సారా, మద్యాన్ని బట్టి ఎక్సైజ్‌ చట్టం-1968 సెక్షన్‌ 34(ఏ) ప్రకారం ఆరు నెలల నుంచి ఏడాది జైలు శిక్ష పడుతుంది. రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధిస్తారు.

బెదిరింపులకు పాల్పడితే..

ఎన్నికల్లో తమకే ఓటెయ్యాలని అభ్యర్థులు, పార్టీల నాయకులు ఓటర్లను బెదిరించకూడదు. ఓటర్లను బెదిరిస్తే ఐపీసీ 171 (సీ) ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఏడాది జైలుతో పాటు జరిమానాలు విధించవచ్చు. రెండూ విధించే అవకాశం కూడా ఉంది.

ఓటర్లకు డబ్బులు పంచితే..

ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఓట్లను నోట్లతో కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేటప్పుడు పట్టుబడితేే ఐపీసీ 171 (ఇ) ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం శిక్షలు అమలు చేస్తారు.

విద్వేషపూరిత ప్రసంగాలు..

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచేలా విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తే వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం (ఆర్‌పీ యాక్ట్‌) 125 ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా ఉంటుంది. రెండూ విధించవచ్చు. ఎవరూ మతాలు, వర్గాలను కించపరిచేలా, మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దు.

కానుకలు ఇవ్వడం..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లను ఆకర్షించడానికి కానుకలు అందించినా నేరమే. మహిళలకు చీరలు, గృహోపకరణాలు, యువకులకు క్రీడా కిట్లు, చరవాణులు ఇలా ఏవి ఇచ్చినా ఐపీసీ 171 (ఈ) ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.

అబద్ధాలతో ప్రచారం..

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తే నేరమే అవుతుంది. లేని వాటిని ఉన్నట్లు చెప్పడం, పోటీ చేసే రాజకీయ ప్రత్యర్థిపై తీవ్రమైన నిందలు వేస్తూ అబద్ధాలు చెప్పడం నేరంగా పరిగణిస్తారు. అందుకు ఐపీసీ 171(జీ) ప్రకారం జరిమానా విధిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని