logo

వారు.. శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికయ్యారు!

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు.

Published : 24 Apr 2024 02:34 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికాఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు.

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే:

రావి నారాయణరెడ్డి:

1952లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) తరఫున భువనగిరి ఎమ్మెల్యేగా, నల్గొండ ఎంపీగా విజయం సాధించారు. భువనగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. నెహ్రూకు పోలైన 2,33,571 ఓట్ల కంటే ఎక్కువగా నల్గొండ ద్విసభ్య స్థానం నుంచి బరిలో నిలిచిన రావి నారాయణరెడ్డికి 3,09,162 ఓట్లు వేసి ప్రజలు గౌరవించారు. 1957 ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా, 1962లో రెండోసారి నల్గొండ ఎంపీగా విజయం సాధించారు.

బొమ్మగాని ధర్మభిక్షం:  

1952లో సూర్యాపేట, 1957 నకిరేకల్‌, 1962లో నల్గొండ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా కమ్యూనిస్టు నేత బొమ్మగాని ధర్మభిక్షం విజయం సాధించారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1991, 1996 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 1996లో జలసాధన ఉద్యమంలో భాగంగా 480 మంది అభ్యర్థులున్నా 71,757 ఓట్ల ఆధిక్యంతో ఈయన గెలుపొందడం విశేషం.

భీమిరెడ్డి నర్సింహారెడ్డి:

1957లో సూర్యాపేట, 1967లో తుంగతుర్తి నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1971, 1984, 1991 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి లోక్‌సభ సభ్యుడిగా విజయాలు సాధించారు.

పాల్వాయి గోవర్దన్‌రెడ్డి:

1967, 1972, 1978, 1983, 1999 ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా.. 2012 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.

చకిలం శ్రీనివాసరావు:

1967, 1972 ఎన్నికల్లో నల్గొండ, 1983లో మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ నేత చకిలం శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.

మల్‌రెడ్డి రఘుమారెడ్డి:  

చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన మల్‌రెడ్డి రఘుమారెడ్డి తెదేపా ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో నల్గొండ ఎంపీగా ఎన్నికయ్యారు. 1989లో నల్గొండ నుంచి శాసనసభ సభ్యుడిగా విజయం సాధించారు.

నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి:  

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి రాజకీయాల్లోకి అడుగిడిన నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1999, 2004 ఎన్నికల్లో కోదాడ నుంచి 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. 2019 ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.  

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి:

కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 1999, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2019లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి:

పారిశ్రామిక రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌ అభ్యరిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా విధులు నిర్వహించారు. 2018, 2023లో మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

నల్గొండకు చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డేపల్లి కాశీరామ్‌ 1960లో నిర్వహించిన నల్గొండ ఉప ఎన్నికలో 59,294 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1967, 1972లో రామన్నపేట శాసనసభ్యుడిగా గెలుపొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని