logo

లోక్‌సభ ప్రచారంలో.. స్థానిక వ్యూహం

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు మాసాలకే జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు భువనగిరి, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు డిజిటల్‌ ప్రచారాన్ని మొదలుపెట్టారు.

Updated : 28 Apr 2024 06:37 IST

సెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు మాసాలకే జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు భువనగిరి, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు డిజిటల్‌ ప్రచారాన్ని మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థిపై వాడివేడి విమర్శలు సంధిస్తూ ఓటర్లను ఆకట్టుకునే నినాదాలతో ఆయా పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేశాయి. అధికారంలోకి వస్తే ఏమి చేస్తామనేది చెబుతూనే ప్రత్యర్థులపై సున్నితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యంగ్య చిత్రాలు, చురుక్కుమని గుచ్చుకునేలా నినాదాలతో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్విటర్‌(ఎక్స్‌), ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్లస్‌ వెబ్‌సైట్, డిజిటల్‌ మీడియా వేదికగా చేసుకొని అభ్యర్థులు ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదంతా ఒక ఎత్తైతే.. మరో వైపు పల్లెల్లో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది.

రీల్స్‌ పెట్టు.. సాయంత్రం సరకు పట్టు..

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే తమ పార్టీ అభ్యర్థితో పాటు స్థానిక నాయకుడి ఫొటోతో రీల్స్‌ తయారు చేసి ఆరోజు గ్రూపులో పెడితే సాయంత్రం ఆ కార్యకర్తకు పండగే. రెండు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌, భాజపా, భారాస అభ్యర్థులు ఖరారు కావడంతో ఆయా పార్టీలు సామాజిక మాధ్యమాల గ్రూపులను ఏర్పాటు చేసి, పార్టీలో చురుగ్గా వ్యవహరించే నాయకులు, కార్యకర్తలతో వాట్సప్‌ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రూపుల్లో ఎవరైనా కార్యకర్త ఆ పార్టీ స్థానిక నాయకుడిని పొగిడేలా ఫొటోతో రీల్స్‌ పెడితే ఆ మొత్తం బృందం విందు ఏర్పాట్లకు ఆయా నాయకులు రూ.10 వేల వరకు ముట్టచెబుతున్నట్టు సమాచారం. ఈ తరహా ప్రచారంతో ‘స్వామి కార్యము. స్వకార్యమూ’ పూర్తవుతున్నాయని ఆయా పార్టీల గ్రామ స్థాయి ఆశావహులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి పల్లెనా ‘ఫలానా’.. అన్న యువసేన ..

లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఉంటుందనే ప్రభుత్వ ప్రకటనతో ప్రతి గ్రామంలో ‘ఫలానా’.. అన్న యువ సేన.. అనే పేరుతో వాట్సప్‌ గ్రూపులు వెలుస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే, మండల, గ్రామ స్థాయి నాయకుడి పేరుతో చివరన అన్న యువసేన పదాన్ని జోడించి వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా పల్లె స్థాయిలో ప్రచారం పొందేందుకు వేదిక ఏర్పాటు చేసుకుంటున్నారు. పల్లెల్లో ఏర్పాటు చేస్తున్న వాట్సప్‌ గ్రూపులు మొత్తం రాబోయే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులే ఏర్పాటు చేస్తుండటం డిజిటల్‌ ప్రచార వేదికకు అద్ధం పడుతోంది.                            

నాంపల్లి, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని