logo

ఒక్కొక్కరికి ఒక్కోలా.. అందరూ వినియోగించుకునేలా

ఓటును అందరూ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఉపయోగించుకోలేరు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, గుఢాచారి వ్యవస్థల్లో పనిచేసే వారు తమ ఓటును ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను ఎన్నికల సంఘం కల్పించింది.

Published : 29 Apr 2024 04:28 IST

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ఓటును అందరూ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఉపయోగించుకోలేరు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, గుఢాచారి వ్యవస్థల్లో పనిచేసే వారు తమ ఓటును ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను ఎన్నికల సంఘం కల్పించింది.

ఈడీసీ ద్వారా: తమ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అదే కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. అలాంటి వారు ఈడీసీ (ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌) తీసుకుని తాము విధులు నిర్వహించే పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకుంటారు.

సర్వీసు ఓటు: దేశ రక్షణలో ఉన్న సైనికులు, పారామిలటరీ ఉద్యోగులు విధి నిర్వహణలో సుదూర ప్రాంతాల్లో ఉంటారు. వీరు తమ స్వస్థలంలో ఓటు హక్కును వినియోగించుకోలేరు. వీరికి సర్వీసు ఓటు హక్కును కల్పించింది ఎన్నికల సంఘం.

ఎన్నారైలకు: భారతీయ పౌరసత్వం ఉండి విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం ఇతర దేశాలకు వెళ్లి, అక్కడే ఉంటున్నవారు ఉన్నారు. అలాంటి వారికోసం ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. వీరికి ఫారం-6ఏ ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ఇందుకు వీరు పాస్‌పోర్టు సైజు ఫొటో, వీసా, పాస్‌పోర్టు నకలు తదితర వాటిని సమర్పించి ఓటు హక్కును నమోదు చేసుకుని తరువాత పోలింగ్‌ రోజు వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది.

ప్రాక్సీ ఓటు: దీన్ని పరోక్ష ఓటు అంటారు. గుఢాచారి, ఇంటెలిజెన్స్‌ వారు వినియోగించుకొంటారు. తమకు బదులు ఇంకొకరిని పంపి ఓటు వేయిస్తారు. తమకు ప్రాక్సీ ఓటు వేసే అవకాశం కల్పించాలని ఎన్నారై సంఘాలు కోరుతున్నాయి.

టెండర్‌ ఓటు: ఎన్నికల రోజు వరకూ ఓటరు జాబితాలో పేరు ఉండి, పోలింగ్‌ కేంద్రం వద్ద గల్లంతు కావడం, తమ పేరున ఉన్న ఓటును వేరే వారు వేయడం లాంటి పరిస్థితుల్లో వారికి ఓటేసే అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ఓటరు తాను అంతకు ముందు ఓటు వేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు టెండర్‌ ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతిస్తారు.


సాధారణ ఓటు: భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనిని సాధారణ ఓటు అంటారు. ఇలా నమోదు చేసుకున్నవారు పోలింగ్‌ రోజు తమ గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయవచ్చు.


పోస్టల్‌ బ్యాలెట్‌: ఎన్నికల విధుల్లో భాగంగా ఉద్యోగులు తమ నియోజకవర్గ పరిధిలో కాకుండా ఇతర చోట్ల విధులు నిర్వహిస్తుంటారు. వారి కోసం ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని