logo

గెలుపు వ్యూహం..!

ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది.

Published : 29 Apr 2024 04:39 IST

నల్గొండ, భువనగిరిలో పాగాకు భాజపా కసరత్తు
వచ్చే నెల మొదటి వారంలో చౌటుప్పల్‌లో ప్రధాని మోదీ సభ!

ఈనాడు, నల్గొండ, న్యూస్‌టుడే, భువనగిరి: ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. రెండు స్థానాల్లో మాజీ ప్రజాప్రతినిధులైన శానంపూడి సైదిరెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌ను బరిలో నిలిపారు. వారు ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్‌, భారాసలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు.

నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార వ్యూహాలను ఖరారు చేస్తూ.. తాము గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న సమయంలో చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర, జాతీయ నాయకులను రప్పించి కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రెండు లోక్‌సభ స్థానాల అభ్యర్థుల నామినేషన్‌ సందర్భంగా కేంద్ర మంత్రులు జై శంకర్‌, కిరణ్‌ రిజిజులను రప్పించి రెండు స్థానాల్లో తాము గెలుపుపై ఎంత దృష్టి పెడుతున్నారో స్పష్టం చేశారు. దేశ విదేశాంగ మంత్రి భాజపా అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి రావడం భువనగిరి చరిత్రలో అదే తొలిసారి.

చౌటుప్పల్‌లో మోదీ సభ..!

నల్గొండ, భువనగిరి స్థానాల్లో గెలుపునకు అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన సభ చౌటుప్పల్‌లో ఖరారైంది. మే నెల 3న లేదంటే 7, 8 తేదీల్లో ఒక రోజు సభ ఉండే అవకాశం ఉందని పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్‌ ‘ఈనాడు’కు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాగా వేయాలని భావిస్తున్న భాజపా ఆ మేరకు మే నెల మొదటి వారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. రెండు లోక్‌సభల్లో కీలక ప్రాంతాలయిన నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్‌, మిర్యాలగూడల్లో కేంద్ర మంత్రులు, జాతీయ నేతలతో రోడ్‌షోలు, సభల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ప్రధాని మోదీ సభ అనంతరం భువనగిరిలో అమిత్‌షా లేదంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో రోడ్‌షో నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు జిల్లా స్థాయిలోనూ ఎప్పటికప్పుడు అభ్యర్థులు సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. సోషల్‌ మీడియా వారియర్స్‌తో పాటూ బూత్‌ స్థాయిలో అధ్యక్షుల నుంచి జిల్లా అధ్యక్షుల వరకు పార్టీ ప్రచార సరళిపై నివేదికల ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో పర్యవేక్షకులు తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలతో సమానంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు పొందేలా కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని