logo

మీ మాటలకు మోసపోయాం!

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చారు.

Published : 23 Apr 2024 04:56 IST

సీఎం హామీలు విస్మరించారంటూ వీఆర్‌ఏల ఆందోళన

కలెక్టరేట్‌ ఎదుట నిరసన(పాత చిత్రం)

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చారు. పైగా ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ విస్మరించారు.

 - ఇది గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ)ఆవేదన.

న్యూస్‌టుడే, నెల్లూరు (కలెక్టరేట్‌): ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలను క్రమబద్ధీకరించి వేతనాలు పెంచాలంటూ అయిదేళ్లలో అనేకసార్లు ఉద్యమబాట పట్టినా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోకపోగా అక్రమ అరెస్టులతో అనేక ఇబ్బందులకు గురి చేసిందని వీఆర్‌ఏలు వాపోతున్నారు. జిల్లాలో సుమారు 1500 మంది వీఆర్‌ఏలు ఉన్నారు.
డీఏ తీసుకున్నారు
గత తెదేపా ప్రభుత్వం వీఆర్‌ఏలకు రూ.6వేల నుంచి రూ.10,500కు జీతం పెంచింది. డీఏ రూ.3వేలు చెల్లించింది. గతంలో వీఆర్‌ఏ నుంచి వీఆర్వోలుగా ఉద్యోగోన్నతులు, గ్రేడ్‌-1 వీఆర్వోగా ఇచ్చేవారు. దీనివల్ల బేసిక్‌ వేతనం రూ.22వేల వరకు వచ్చేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కరూపాయి కూడా పెంచలేదు. గతంలో పోరాడి సాధించుకున్న డీఏను రద్దు చేయడంతో పాటు.. తీసుకున్న డీఏను తిరిగి వీఆర్‌ఏల నుంచి రికవరీ చేశారు. దీంతో ఒక్కో వీఆర్‌ఏ రూ.12 వేల నుంచి రూ.14వేల వరకు తిరిగి ప్రభుత్వానికి చెల్లించారు. వీఆర్‌ఏ నుంచి వీఆర్వో ఉద్యోగోన్నతులు గ్రేడ్‌-2 ఇవ్వడం వల్ల కేవలం రూ.15 వేలతో పని చేస్తున్నారు. వీఆర్‌ఏల ఆందోళనలు, ఎన్నికలు నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి డీఏ రూ.500 పునరుద్ధరించి రూ.10,500తో పాటు రూ.500 డీఏ మాత్రమే ప్రస్తుతం అందిస్తున్నారు.


అయిదేళ్లుగా పట్టించుకోలేదు..
కె.పెంచలనరసయ్య, వీఆర్‌ఏల సంఘం నాయకులు

అధికారంలోకి రాగానే అర్హులెన వారికి ఉద్యోగోన్నతులు కల్పిస్తామని జగన్‌ హామీ ఇచ్చి మోసం చేశారు. వీఆర్‌ఏలను అయిదేళ్లుగా పట్టించుకోలేదు. చాలీచాలని వేతనం ఇస్తున్నారు.

ఎన్నో పోరాటాలు చేశాం.. దేవర చెంచయ్య

అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్లలో ఏ హామీ నెరవేర్చలేదు. ఎన్నో పోరాటాలు చేశాం. నామినీగా పని చేస్తున్న వీఆర్‌ఏలకు రాత్రి కాపలా దారులు, అటెండర్లు, డ్రైవర్లు, వీఆర్వోలు ఉద్యోగాలు ఖాళీఉన్న చోట భర్తీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు.

భారంగా కుటుంబ పోషణ.. దాచూరి దుగ్గయ్య

చాలీచాలని వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. వీఆర్‌ఏలను జగన్‌ గుర్తించకపోగా విస్మరించారు. అయిదేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టినా పట్టించుకోలేదు. ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని