logo

పది ఫలితాల్లో నిరాశే..

తన కుమార్తె పదో తరగతి చదువుతుందని కాలనీలో అందరికీ చెప్పుకుంటూ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న తల్లి దాలు లక్ష్మి గత నెలలో రహదారి ప్రమాదంలో మరణించింది.

Updated : 23 Apr 2024 06:12 IST

88.17% ఉత్తీర్ణత

15వ స్థానంలో జిల్లా

 నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే : పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు నిరాశ కలిగింది. రాష్ట్రంలో 15వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చదువుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ప్రభుత్వం ఊదరగొట్టినా.. ఉత్తీర్ణత పెంపే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని విద్యాశాఖ పదేపదే ప్రకటించినా.. వాటి ఫలితం మాత్రం ఫలితాల్లో ప్రస్ఫుటించలేదు. గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగినా.. రాష్ట్ర స్థాయిలో చూస్తే.. స్థానం మరింత దిగజారడం ఆవేదన కలిగించింది.
జిల్లాలోని 176 పరీక్ష కేంద్రాల్లో 27,788 మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 24,500 మంది ఉత్తీర్ణత సాధించారు. 3,288 మంది అనుత్తీర్ణులయ్యారు. మొత్తం మీద 88.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత విద్యా సంవత్సరంలో 75.61 శాతంతో జిల్లా తొమ్మిదో స్థానంలో నిలవగా.. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగినా.. 15వ స్థానానికి పడిపోవడం నిరాశ కలిగించింది. పరీక్ష తప్పిన విద్యార్థులు మే 24వ తేదీ నుంచి జూన్‌ మూడో తేదీ వరకు జరగనున్న అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చని డీఈవో పీవీజే రామారావు తెలిపారు.

బాలికల హవా..

జిల్లా వ్యాప్తంగా 13,926 మంది బాలురు పరీక్ష రాయగా.. వారిలో 12,003 మంది ఉత్తీర్ణత సాధించారు. 86.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 13,862 మంది రాయగా.. వీరిలో 12,497 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 90.15గా నమోదైంది. మొత్తం మీద బాలుర కంటే బాలికలే అధికంగా పాస్‌ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ స్థానం 20,201, ద్వితీయ స్థానం 3,019, తృతీయ స్థానం 1280 మంది సాధించారు.


ఆ తల్లి బతికి ఉంటే..

 అవధుల్లేని ఆనందమే

 కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: తన కుమార్తె పదో తరగతి చదువుతుందని కాలనీలో అందరికీ చెప్పుకుంటూ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న తల్లి దాలు లక్ష్మి గత నెలలో రహదారి ప్రమాదంలో మరణించింది. కుమార్తె శృతి చివరి రెండు పరీక్షలు రాసే సమయంలో ప్రమాదం జరిగినా చెప్పకుండా.. పరీక్షలు రాసి వచ్చిన తర్వాత తల్లికి దహన సంస్కారాలు చేశారు. నేడు ఆ కుమార్తె పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. తల్లి ఉండి ఉంటే ఎంతో సంతోషించేదనీ, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తండ్రి హరిబాబు, కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు.

విద్యాకుసుమం.. విశాలాక్షి

బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని రేబాల నెహ్రూనగర్‌కు చెందిన మువ్వల విశాలాక్షి పదోతరగతి పరీక్షల్లో 593 మార్కులు సాధించింది. ఏడో తరగతి చదువుతుండగా విద్యార్థిని తండ్రి మృతిచెందారు. నిరుపేద కుటుంబం కావడంతో తల్లి ఉమాదేవి తనలా కష్టం చేయకూడదని చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మింది. మల్లె పూలు విక్రయించి కుమార్తెను కష్టపడి చదివించింది. కుటుంబ కష్టాలు తెలుసుకున్న బాలిక చదువులో ఉన్నతంగా రాణించి పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకుంది. ఐఐటీలో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గురుకులాలు, కేజీబీవీల్లో ఉత్తీర్ణత ఇలా..

జిల్లాలోని అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యాలయాల జిల్లా కోఆర్డినేటర్‌ హేమలత పేర్కొన్నారు. పెద్దపవని, కండలేరులో 100%, సంగం 97.50%, బుచ్చిరెడ్డిపాళెం, ముత్తుకూరు 97.04%, ఆదురుపల్లి 96.05%, కోడూరు 95%, బోగోలు 90.78% ఉత్తీర్ణత నమోదు అయిందని తెలిపారు. పెద్దపవనిలోని విద్యాలయంలో గీతిక 584 మార్కులు, సంగం విద్యార్థిని హేమమ్మ 580 మార్కులు సాధించారని వివరించారు.
కేజీబీవీల్లో.. జిల్లాలోని 12 కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారని సమగ్రశిక్షా అభియాన్‌ ఏపీసీ సీహెచ్‌ ఉషారాణి పేర్కొన్నారు. కలిగిరి, నందిపాడు, లింగసముద్రం, వీవీ పాళెంలో 100%, ఏఎస్‌పేట 97.43%, ఉలవపాడు 96.85%, గుడ్లూరు 94%, మర్రిపాడు 92.3%, కొండాపురం 87.5%, కావలి 85%, ఎస్‌ఆర్‌ పురం 74.19, కందుకూరు 73.64% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు.

మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో..

జిల్లాలోని వివిధ మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు సాధించిన ఫలితాలు ఇలా... ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో 93.84 శాతం, ఏపీ రెసిడెన్సియల్‌ సొసైటీలో 97.36, ఏపీఎస్‌డబ్ల్యూ రెసిడెన్సియల్‌ 96.83, ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 82.1, సెంట్రల్‌ గవర్నమెంట్‌ 83.33, కేజీబీవీల్లో 91.76, జిల్లా పరిషత్‌ పాఠశాలలు 80.85, మున్సిపల్‌ పాఠశాలలు 75.42, ఎయిడెడ్‌ 67.75, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 71.45 శాతం ఫలితాలు సాధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని