logo

ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు

ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి.

Published : 25 Apr 2024 02:50 IST

అగ్నిమాపక కేంద్రాలపై జగన్‌ చిన్నచూపు
భర్తీకాని 60 పోస్టులు
న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

  • చేజర్ల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగితే పొదలకూరు నుంచి అగ్నిమాపక శకటం వెళ్లాలి. చేజర్ల, పొదలకూరు మధ్య దాదాపు 45 కి.మీ దూరం ఉంది. అంటే దాదాపు గంటకుపైగా ప్రయాణం చేయాలి. ఈలోపు ఆస్తి నష్టం జరిగిపోతోంది.
  • నెల్లూరు నగరంలో రెండు అగ్నిమాపక శకటాలు ఉన్నాయి. కోవూరు వైపు, ముత్తుకూరు వైపు, బుచ్చి, సంగం వరకు, వెంకటాచలం వైపు అగ్ని ప్రమాదాలు జరిగితే ఇక్కడి నుంచే వాహనం వెళ్లాలి. వీటి ప్రయాణం  కూడా గంటల్లోనే ఉంది.
  • జిల్లాలో మరికొన్ని అగ్నిమాపక కేంద్రాలు కావాలని, ఆ శాఖ అధికారులు ఎన్నోసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎక్కడెకక్కడ కావాలి? ఏయే ప్రాంతాల్లో పెడితే బాగుంటుందనే వివరాలతో అభ్యర్థించారు. నేటికీ కొత్తవి మంజూరు కాలేదు.

లాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌తో గడ్డి వాముల దగ్ధం కావడం, ఇళ్లు, దుకాణాల్లో నిప్పు రాజుకుంటుంది. విలువైన వస్తువులు అగ్నికి ఆహుతవుతుంటాయి. కొన్ని ప్రమాదాల్లో ప్రాణాలే పోతున్నాయి. పలితంగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో అగ్నిమాపక శాఖ కేంద్రాలు, సిబ్బంది కొరత వెంటాడుతోంది.

సిబ్బంది కొరత..

అగ్నిమాపక శాఖలో ఏళ్లుగా సిబ్బంది కొరత వెంటాడుతూనే ఉంది. జిల్లాలో ఉన్న 9 ఫైర్‌ స్టేషన్లలోనూ సిబ్బంది, వాహనాల కొరత ఉంది. ప్రస్తుతం ఉన్న పోస్టులకు మరో 60 ఉద్యోగాల భర్తీ జరగాల్సి ఉంది. హోంగార్డుల సాయంతో వాటిని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అగ్నిమాపక అధికారి, సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటరు, స్టేషన్‌ ఫైర్‌ అధికారులు పది మంది, లీడింగ్‌ ఫైర్‌మెన్‌లు 28, డ్రైవర్‌ ఆపరేటర్లు 41 మంది, ఫైర్‌మెన్‌లు 100 మంది ఉన్నారు. ఇంకా సీనియర్‌ అసిస్టెంట్‌, రీడింగ్‌ ఫైర్‌మెన్‌ ఒకటి, డ్రైవర్‌ ఆపరేటర్లు 8, ఫైర్‌మెన్‌ 40 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

కొత్త కేంద్రాలకు ప్రతిపాదించిన ప్రాంతాలు

నెల్లూరు గ్రామీణ పరిధిలోని అయ్యప్పగుడి వద్ద, వెంకటాచలం, కోవూరు నియోజకవర్గంలోని రాజుపాళెం, బుచ్చిరెడ్డిపాళెం, కావలి నియోజకవర్గం పరిధిలో అల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం ప్రాంతాలు ఉన్నాయి. బుచ్చిలో దాదాపు స్థల సేకరణ పూర్తయింది. ప్రభుత్వం నుంచి క్లియరెన్సు రావాల్సి ఉంది. నెల్లూరులో మరో కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఉన్నతాధికారులు స్పందించి కొత్త కేంద్రాలు మంజూరు చేయడంతోపాటు సిబ్బందిని నియమించి అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని