logo

మీరిచ్చిన హామీ గుర్తుందా సామీ!

తాను ప్రజల మనిషినని.. పాదయాత్రలో వారి కష్టనష్టాలను కల్లారా చూశానని, అధికారంలోకి వచ్చాక పేదలు, రైతుల బతుకులు మార్చేలా పరిపాలిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Updated : 28 Apr 2024 05:03 IST

అయిదేళ్లలో ఒక్కటీ నెరవేరని వైనం
పనులు జరగక.. ప్రజానీకం ఇబ్బందులు
నేడు ఎన్నికల ప్రచారానికి కందుకూరు రాక
కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే

తాను ప్రజల మనిషినని.. పాదయాత్రలో వారి కష్టనష్టాలను కల్లారా చూశానని, అధికారంలోకి వచ్చాక పేదలు, రైతుల బతుకులు మార్చేలా పరిపాలిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే కందుకూరుకు వచ్చిన సందర్భంలో యథావిధిగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు హామీలు ఇచ్చారు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి హోదాలో మరోసారి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలోనూ మరికొన్ని వరాలు ఇచ్చారు. అడిగిందే తడవు.. నిధుల వరద పారిస్తామని గొప్పలు చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వైకాపా ప్రభుత్వం అయిదేళ్లల్లో.. వాటిలో ఒక్కటీ నెరవేర్చలేదు. దీంతో కందుకూరు అభివృద్ధిపై జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇంకోవైపు.. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. మళ్లీ ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఆయా పనులు పూర్తి చేస్తామని ఇటీవల నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొనడంపైనా పెదవి విరుస్తున్నారు. నేడు కందుకూరుకు జగన్‌ పర్యటన నేపథ్యంలో జగన్‌ ఇచ్చిన హామీలు.. వాటి పరిస్థితులపై కథనం.

పీహెచ్‌సీకి ఏదీ మోక్షం!

హామీ: ఉలవపాడు మండలం కరేడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థలో ఉంది. రోగులకు ఇబ్బందులు కలగకుండా నూతన భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు హామీ ఇస్తున్నా.
సందర్భం: 2022, జులైలో ఇచ్చిన హామీ
పరిస్థితి: వర్షాకాలంలో రోగులతో పాటు వైద్యులు, సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. తగినన్ని గదులు, సరైన మౌలిక సదుపాయాలు లేవు. సీఎం హామీ మేరకు ఆర్‌అండ్‌బీ అధికారులు నూతన భవన నిర్మాణానికి రూ. 2.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. ఒక్క రూపాయి విడుదల కాలేదు.


అభివృద్ధి పనులకు ఆటంకం

హామీ: కందుకూరు పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు(రూ. 26.8 కోట్లు) పంపితే.. వెంటనే అనుమతులిస్తా.
సందర్భం: 2022, జులైలో
పరిస్థితి: కందుకూరు పట్టణానికి సంబంధించి.. మొత్తం 174 పనులకు రూ. 26.8 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ మేరకు అవసరమైన నిధుల విడుదలకు సుమారు ఏడాది తర్వాత జీవో ఇచ్చారు. సుమారు రూ. పది కోట్ల విలువైన 64 పనులు పూర్తి చేశారు. నిధుల విడుదలలో జాప్యంతో.. మిగిలిన 110 పనులను గుత్తేదారులు చేపట్టలేదు. పలు కాలనీల్లో అంతర్గత రోడ్లు, కాలువల సమస్య స్థానికులను వేధిస్తోంది.


రాళ్లపాడు కన్నీరు

హామీ: వైకాపా అధికారంలోకి వచ్చాక.. ఆరు నెలల్లో రాళ్లపాడు పెండింగ్‌ పనులు పూర్తి చేస్తాం. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. సోమశిల నుంచి రావాల్సిన వాటా నీరు తప్పనిసరిగా తీసుకొస్తాం.
సందర్భం: 2018, ఫిబ్రవరిలో కందుకూరు పాదయాత్రలో
పరిస్థితి: కందుకూరు నియోజకవర్గంతో పాటు ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలోని కొన్ని గ్రామాల రైతులకు ఈ ప్రాజెక్టు ఆయువుపట్టు. సామర్థ్యం 1.1 టీఎంసీ కాగా.. ప్రస్తుతం కొంత పూడికతో ఉంది. నిల్వ సామర్థ్యం 21 అడుగులు కాగా- కట్ట బలహీనంగా ఉందని 20 అడుగులకే పరిమితం చేస్తున్నారు. ఇంత వరకు రాళ్లపాడు అభివృద్ధికి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. సిబ్బంది కొరత వేధిస్తోంది. కట్ట వెంబడి చిల్లచెట్లు పెరిగి ప్రమాదకరంగా ఉంది. సోమశిల నుంచి రావాల్సిన 1.5 టీఎంసీ.. అయిదేళ్లలో ఒక్కసారి కూడా రాలేదు.


ఊసేలేని బైపాస్‌

హామీ: రామాయపట్నం ఓడరేవుతో కందుకూరు పెద్ద టౌన్‌హబ్‌గా తయారవుతుంది. మెరుగైన వసతుల ఏర్పాటులో భాగంగా పట్టణ బైపాస్‌కు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నా.
సందర్భం: 2022, జులైలో ఓడరేవు భూమిపూజ సభలో
పరిస్థితి: పట్టణంలో నానాటికి పెరుగుతున్న వాహనాలకు తగ్గట్లు రోడ్లు విస్తరణకు నోచుకోకపోవడంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. 25 ఏళ్ల కిందట వేసిన రోడ్లే నేటికీ దిక్కు..  ఈ క్రమంలో 2014లో పట్టణానికి ఉత్తరాన అర్ధ చంద్రాకారంలో నిర్మించేలా బైపాస్‌కు ప్రతిపాదించారు. తెదేపా ప్రభుత్వ హయాంలోనే అలైన్‌మెంట్‌ ఖరారైంది. ఈ ప్రభుత్వంలో 2020 జనవరిలో భూసేకరణకు రూ. 37 కోట్లు  ఇస్తున్నట్లు జీవో జారీ చేశారు. 2022లో సీఎం రూ. 25 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించినా.. నేటికీ ఒక్క పైసా రాలేదు.


జాడలేని ఓడ

హామీ: ప్రజలు ఆదరించి వైకాపాను అధికారంలోకి తీసుకొస్తే రామాయపట్నం ఓడరేవు బాధ్యత తీసుకుంటుంది. అన్ని అనుకూలతలు ఉన్న రామాయపట్నంలో మేజర్‌ పోర్టు ఏర్పాటు చేస్తాం. విడతల వారీగా అభివృద్ధి చేసుకుంటూ పోతాం. ప్రస్తుతం నాలుగు బెర్తులతో నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 2023 డిసెంబరు నాటికి బెర్తులు పూర్తి చేసి ఓడవచ్చేలా కృషి చేస్తాం. అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి.. భారీగా ఉద్యోగాలు కల్పిస్తాం.
సందర్భం: 2018, పాదయాత్ర, 2022 ఓడరేవు భూమి పూజ సందర్భంగా
పరిస్థితి: 2019లో అధికారంలోకి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డి.. మూడేళ్లపాటు ఓడరేవు గురించి పట్టించుకోలేదు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మైనర్‌ పోర్టుకు శ్రీకారం చుట్టారు. విడతల వారీగా అభివృద్ధి చేస్తామంటూ గుడ్లూరు మండలం చేవూరులో మొదటి విడతగా 825 ఎకరాల్లో నాలుగు బెర్తుల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఒక్కటి మాత్రమే నిర్మించగా.. అదీ ప్రారంభానికి నోచుకోలేదు. రైల్వే లైన్‌ పనులు, నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం, ఓడరేవుకు అనుబంధంగా ఏర్పాటు చేస్తామన్న పరిశ్రమల ఊసేలేదు.


ఎడమ కాలువ పొడిగింపు.. ఎండమావే

హామీ: రాళ్లపాడు ఎడమ కాలువ పొడిగింపు.. విస్తరణతో 8,500 ఎకరాలకు మంచి జరుగుతుందని.. అందుకు రూ. 27 కోట్లు అవసరమని అడుగుతున్నందున.. ఇంత మంచి కార్యక్రమానికి వెంటనే అనుమతులు మంజూరు చేస్తానని మాట ఇస్తున్నా.
సందర్భం: 2022 జులైలో ఓడరేవు భూమిపూజ సభలో
పరిస్థితి: రాళ్లపాడు ఎడమ కాలువ ప్రస్తుతం 3 కి.మీ. పొడవు ఉంది. ఆయకట్టు 1500 ఎకరాలు. దీన్ని 13 కి.మీ. వరకు పొడిగించి కలవళ్ల, నలదలపూరు, చీమలపెంట, వీఆర్‌కోట, శాఖవరం గ్రామాల్లోని చెరువులకు నీరు అందించాలని ప్రతిపాదించారు. కాలువ సామర్థ్యాన్ని 30 నుంచి 100 క్యూసెక్కులకు పెంచాల్సి ఉంది. ఆ మేరకు పదేళ్ల కిందటే ప్రతిపాదనలు తయారు చేశారు. 2019, జనవరిలో తెదేపా ప్రభుత్వం రూ. 38 కోట్లు కేటాయించింది. వెంటనే ఎన్నికలురావడం.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో... ఆ పనులు ప్రారంభం కాలేదు. 2022లో జగన్‌ హామీ ఇచ్చినా.. ఇంత వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. అడుగు ముందుకు పడలేదు. ప్రాజెక్టు నిండా నీరున్నా.. ఆయకట్టుకు చేరే పరిస్థితి లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని