logo

సంగం హామీకి సున్నం

దుష్ట సంహారం నిమిత్తం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సుని ‘పినాక ’అంటారు. పినాక ధారుడైన పరమశివుడిని ‘పినాకపాణి’ అని భక్తులు పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రం నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది వంపులు తిరిగి శివుడి విల్లు పినాక ఆకారంలో ఉండటంతో పెన్నానది అని పిలుస్తున్నారు.

Published : 29 Apr 2024 04:15 IST

జగన్‌ తీరు

మాట: సంగం బ్యారేజి, కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయం పరిసరాలను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తాం.

సీఎం హోదాలో 2022 సెప్టెంబరు 6న వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి


అమలు: హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా కనీస అడుగులు పడలేదు.


దుష్ట సంహారం నిమిత్తం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సుని ‘పినాక ’అంటారు. పినాక ధారుడైన పరమశివుడిని ‘పినాకపాణి’ అని భక్తులు పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రం నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది వంపులు తిరిగి శివుడి విల్లు పినాక ఆకారంలో ఉండటంతో పెన్నానది అని పిలుస్తున్నారు. ఇందులో సంగం వద్ద బీరాపేరు, బొగ్గేరు అనే రెండు వాగులు సంగమిస్తున్నాయి. ఈ సంగమ స్థానం కాలక్రమంలో సంగంగా మారింది. ఇక్కడే పరశురాముడు ప్రతిష్ఠించిన కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయం ఉంది.

సంగం, న్యూస్‌టుడే: పెన్నానది జలాలను వృథాగా సముద్రంలో కలవకుండా సద్వినియోగం చేసేందుకు 1882-85 మధ్య కాలంలో సంగం వద్ద పెన్నానదికి అడ్డుగా 1242 మీటర్ల పొడవైన ఆనకట్టను నాటి ఆంగ్లేయులు నిర్మించారు. దక్షిణాసియాలో ఇప్పటికి అదే అత్యంత పురాతనమైన జలవనరుల ఆనకట్టడంగా పేరొందింది. దీనికి అనుబంధంగా కనిగిరి జలాశయం ప్రధాన, కనుపూరు కాలువ, నెల్లూరు చెరువు కాలువ, దువ్వూరు కాలువ, బెజవాడ పాపిరెడ్డికాలువలున్నాయి.

  • సాధారణంగా పురాతన కట్టడంకి ఎగువ భాగంలో నూతన నిర్మాణం చేపడతారు. ఇక్కడ మాత్రం దీనికి భిన్నంగా సంగం ఆనకట్టకి దిగువన 450 మీటర్ల దూరంలో 1200 మీటర్ల పొడవైన బ్యారేజి నిర్మించారు. దానిపైనే పది మీటర్ల వెడల్పుతో పాదచారుల మార్గాలతో కూడిన పైవంతెన ప్రత్యేకంగా ఉంది.
  • ఈ రెండు కట్టడాల మధ్య సుమారు 250 ఎకరాలకు పైగా నీటి నిల్వ ఏర్పడింది. దాంతో ఎటుచూసినా జలసౌందర్యం అలరారుతూ ఉంటుంది. ఆనకట్ట ప్రారంభ స్థానం నుంచి బ్యారేజి వరకు రహదారులు, పొర్లుకట్ట అందుబాటులో ఉండటంతో సందర్శకులు విరివిగా వస్తున్నారు.
  • జిల్లా కేంద్రానికి 32 కి.మీ. దూరంలోనే బ్యారేజి నెల్లూరు ముంబయి జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంది.
  • ప్రస్తుతం పర్యాటకులకు ఇక్కడ కనీస సదుపాయాలు లేవు. బ్యారేజి నిర్మాణంలో భాగంగా నాలుగు ఘాట్లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికి ఒక్కదాన్ని మాత్రమే అసంపూర్ణంగా నిర్మించారు. దానికి రక్షణ ఏర్పాట్లు లేవు. ఈ విధంగా అరకొర నిర్మాణం మినహా మిగిలిన వాటి గురించి ఊసేలేదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ హామీ అమలై ఉంటే ఈ ప్రాంతం పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చెందిఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉపాధి అవకాశాలకు గండి

గణేష్‌నాయుడు : ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో ఉపయోగంగా ఉండేది. బాలల నుంచి యువత, మహిళలు అన్ని వర్గాల వారికి ఆహ్లాదకరంగా ఉండేది. ఫలితంగా పలువురికి ఉపాధి అవకాశాలు లభించేవి.


సమంజసం కాదు

కె.రవీంద్రరెడ్డి : ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ విస్మరించడం సమంజసం కాదు. సంగం ఆనకట్ట, బ్యారేజి వద్ద ప్రతిరోజు పర్యాటకులు భారీగా వస్తున్నారు. వారికి కనీస సదుపాయాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతాభివృద్ధిపై నాయకులు తమ వైఖరి స్పష్టం చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని