logo

చెంతనే నీరున్నా.. చింతే నాయకా

వేసవి వచ్చింది... నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పొంచిఉంది. నీటి వనరులున్నా.. నిర్వ హణ లోపంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. పథకాలున్నా..

Published : 29 Apr 2024 04:28 IST

నిర్వహణను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
న్యూస్‌టుడే, నెల్లూరు (నగరపాలక సంస్థ), కావలి, కందుకూరు పట్టణం, ఆత్మకూరు

వేసవి వచ్చింది... నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పొంచిఉంది. నీటి వనరులున్నా.. నిర్వ హణ లోపంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. పథకాలున్నా.. వైకాపా ప్రభుత్వం పూర్తి చేయక నెల్లూరు నగరానికి, కావలి పట్టణానికి నీటి ముప్పు పొంచిఉంది. పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరాలో ముందస్తు ప్రణాళికలు కొరవడ్డాయి. ఫలితంగా అరకొర నీటితోనే సరిపెట్టుకుంటున్నారు.


పాతపైపుల్లోనే సరఫరా

కుళాయిల్లో వస్తున్న కలుషిత నీరు

నెల్లూరు నగర ప్రజలకు తాగునీటిని అందించేందుకు గత తెదేపా ప్రభుత్వం రూ.550 కోట్లతో తాగునీటి పథకం నిర్మించింది. సంగం మండలం మహ్మదాపురం వద్ద 120 ఎంఎల్‌డీ సామర్థ్యంతో తాగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించి... అక్కడి నుంచి పైపుల ద్వారా నీటిని నగర ప్రజలకు అందించాల్సి ఉంది. దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం తీరుతో పథకానికి గ్రహణం పట్టించింది. సంగం నీటిని తీసుకొచ్చి పాత పైపుల నుంచే అందిస్తున్నారు. దీంతో కలుషిత నీరు సరఫరా అవుతోంది. సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు, హెడ్‌వాటర్‌ వర్క్స్‌ నిర్వహణ సరిగా లేక వైఎస్సార్‌నగర్‌, శ్రామికనగర్‌, బుజబుజనెల్లూరు, చంద్రబాబునగర్‌, అంబాపురం తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది.


గుంతలు తీస్తేనే..

నీళ్ల కోసం తీసిన గుంతలు

కందుకూరు పట్టణంలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిండా నీళ్లున్నా శివారు ప్రాంతాలైన ఐ.ఎస్‌.రావు నగర్‌, సుందరయ్యనగర్‌, లుంబినీవనం, విప్పగుంట రోడ్డు ప్రాంతాల్లో పైపులైన్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాక నీరు సరఫరా కావడం లేదు. ఐ.ఎస్‌.రావు నగర్‌లో పైపులైన్లు ఉన్నా సరిపడా సామర్థÄ్యం లేక కొన్ని ఇళ్లకు నీరు అరకొరగా సరఫరా అవుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్‌యార్డుకు వెళ్లే రోడ్డులో గుంతలు తీసుకుంటేనే నీళ్లు వచ్చే పరిస్థితి నెలకొంది.


నీటి వనరులున్నా.. నిర్లక్ష్యమే

సోమశిల నీటిశుద్ధి విభాగం

ఆత్మకూరుకు పుష్కలంగా తాగునీటి వనరులున్నా అన్ని ప్రాంతాలకు నీటిని సరఫరా చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. పురపాలకానికి సోమశిల నుంచి గ్రావెటీపై నీటిని అందజేసేందుకు రూ.70 కోట్ల తాగునీటి పథకాన్ని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అందుబాటులోకి తెచ్చారు. పట్టణ జనాభా పెరిగినా లక్ష మంది అవసరాలు తీర్చేలా దీన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం పట్టణంలో 32 వేల మందే జనాభా ఉన్నారు. పథ]కం పరిధిలోని శుద్ధి విభాగం రోజుకు 50 లక్షల లీటర్ల నీటిని శుద్ధిచేసి అందిస్తోంది. మరోవైపు పెన్నానది వద్ద రెండు తాగునీటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. పూసలకాలనీ, ముస్తాపురం, నరసాపురం శాంతినగరం టిడ్కో గృహ సముదాయానికి సోమశిల నీరు సరఫరా లేదు. అన్ని ప్రాంతాలకు సోమశిల తాగునీరు విడుదలలో జాప్యం వస్తుందనే సాకుతో కొన్ని ప్రాంతాలకు సరఫరా ఆపేశారు.


పంపిణీ అస్తవ్యస్తం

కావలి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌

కావలి పురపాలక సంఘానికి చెందిన సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌లో నీటి నిల్వలు ఉన్నా.. పంపిణీ అస్తవ్యస్తంగా ఉంది. సోమశిల జలాశయంలో మున్సిపాలిటీకి తాగునీటి కేటాయింపులున్నాయి. సోమశిలలో విడుదలైన నీటిని కావలికి బెజవాడ పాపిరెడ్డి కాలువ ద్వారా జలదంకి మండలం చిన్నక్రాక బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వరకు తీసుకొస్తారు. అక్కడి నుంచి పైపులైన్‌లో కావలి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌కు నీరందుతుంది. అక్కడ శుద్ధి చేసి పట్టణానికి నీరివ్వాలి. పాత పైపులైన్ల కారణంగా పట్టణ పరిధిలో అన్ని ప్రాంతాలకు సరిగా నీరు అందడం లేదు. ఏడున్నర సంవత్సరాల క్రితం ప్రారంభమైన అమృత్‌ పథకం పనులు తెదేపా ప్రభుత్వంలో 80శాతం పూర్తికాగా మిగిలిన కొద్దిపాటి పనులు వైకాపా ప్రభుత్వం చేయలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని