logo

ముస్లిం మైనార్టీల అభ్యున్నతిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది!

‘రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కూటమిగా పోటీ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ఎన్డీయేతో కలిసిన తెదేపా ప్రభుత్వంలో విశేషంగా కృషి చేశాం. మళ్లీ కూటమికి ఓటేసి గెలిపిస్తే.. మరింతగా పాటుపడతాన’ని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

Published : 29 Apr 2024 04:50 IST

రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికే కూటమిగా పోటీ
కోటమిట్ట షాదీ మంజిల్‌లో బాబు ఆత్మీయ సమావేశం
ఘన స్వాగతం పలికిన తెదేపా నాయకులు, కార్యకర్తలు
ఈనాడు, నెల్లూరు: స్టోన్‌హౌస్‌పేట, కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ..

‘రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కూటమిగా పోటీ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ఎన్డీయేతో కలిసిన తెదేపా ప్రభుత్వంలో విశేషంగా కృషి చేశాం. మళ్లీ కూటమికి ఓటేసి గెలిపిస్తే.. మరింతగా పాటుపడతాన’ని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. 14 ఏళ్లు పరిపాలన చేశానని, అధికారం నాకు కొత్తేమీ కాదని.. తెదేపా, జనసేన, భాజపా సంయుక్తంగా ప్రజల కోసమే కూటమిగా ముందుకెళుతున్నామని చెప్పారు. రాష్ట్రం బాగుండాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలని, కూటమి వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని, ఆ బాధ్యత నేనే తీసుకుంటానని హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం కోటమిట్ట షాదీమంజిల్‌లో ఆదివారం నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సుకు చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెదేపా నాయకులు, శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్థానిక కుక్కలగుంట మహాలక్ష్మి ఆలయం నుంచి షాదీ మంజిల్‌ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆయా ప్రాంతాలు పసుపుమయమయ్యాయి. జై బాబు.. జైజై బాబు.. బాబు సీఎం అన్న అభిమానుల నినాదాలతో సమావేశ ప్రాంగణం మార్మోగింది. చంద్రబాబుతో సెల్ఫీలు తీసుకునేందుకు మహిళలు, యువత పోటీపడ్డారు. తొలుత సభావేదికపై దివంగత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబును పార్టీ ముఖ్య, ముస్లిం మైనార్టీ నాయకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ముస్లిం మత పెద్దలు దువా చేశారు. చంద్రబాబు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమానికి ముస్లిం మహిళలు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, తెదేపా నాయకులు పెద్దఎత్తున హాజరుకావడంతో షాదీ మంజిల్‌ కిక్కిరిసిపోయింది. నెల్లూరు నగర అభ్యర్థి డాక్టర్‌ పొంగూరు నారాయణ పనితీరును చంద్రబాబునాయుడు అభినందించారు. అందరూ సమష్టిగా కృషి చేసి జిల్లాలో తెదేపా జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

ఆకాశమంత అభిమానం

చంద్రబాబుమాట్లాడుతూ.. ఆత్మీయ సమావేశంలో తనపై ప్రజలందరూ ఆకాశమంత ప్రేమ చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. మీ అందరినీ చూస్తుంటే.. నా జన్మ సార్థకమైందన్నారు. బిడ్డల భవిష్యత్తు- బంగారు భవిష్యత్తు కావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారని, వైకాపా ప్రభుత్వంలో అలా జరగడం లేదని దుయ్యబట్టారు. ముస్లిం సోదరులంటే నమ్మకం, ధైర్యం, కష్టాన్ని నమ్ముకుని బతికేవారని కొనియాడారు.. కష్ట జీవులు మా ముస్లిం సోదరీమణులని అభినందించారు. గతంలో తెదేపా ప్రభుత్వ పాలన చూశారని, ప్రస్తుతం వైకాపా పాలన చూశారని, ఏ ప్రభుత్వ పాలన బాగుందో చెప్పాలని చంద్రబాబు కోరారు. ఏ ప్రభుత్వ పాలనలో న్యాయం జరిగిందో చెప్పాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న తమను విమర్శిస్తున్న జగన్‌.. గడిచిన అయిదేళ్లు ఏ పార్టీకి మద్దతు తెలిపారో చెప్పాలన్నారు. ఈ విషయం నెల్లూరులో ఉన్న నక్కజిత్తుల ఎంపీకి తెలియదా? ఆయన సంతకం పెట్టలేదా? అని ప్రశ్నించారు. వారు చేసేదంతా తప్పుడు పనులేనని.. ప్రజలను మోసం చేయాలని వైకాపా ప్రభుత్వం చూస్తోందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన ముస్లిం సోదరులు, సోదరీమణులు


ప్రజల ప్రశ్నలు చంద్రబాబు సమాధానాలు

సార్‌.. నేను ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ చదువుతున్నాను. మీరు ప్రవేశపెట్టిన కలలకు రెక్కలు అనే అద్భుత పథకం ద్వారా ఎడిటింగ్‌ నేర్చుకున్నా. తొలిసారి ఓటుహక్కు నమోదు చేసుకున్నా.. మీకే నా మొదటి ఓటు. మిమ్మల్ని సీఎంగా చూడాలన్నదే నా లక్ష్యం. కలలకు రెక్కలు సర్టిఫికెట్‌ మీద మీ సంతకం కావాలి సార్‌..

షాజీయా

యువత భవిష్యత్తే ధ్యేయంగా తెదేపా ప్రభుత్వం ముందుకెళుతుంది. అందులో భాగంగానే కలలకు రెక్కలు అనే అద్భుత పథకం ద్వారా ఆసక్తి ఉన్న నైపుణ్యాన్ని పెంపుదల చేస్తున్నాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. స్వయం ఉపాధితో బతికేందుకు విరివిగా వడ్డీలేని రుణాలు మంజూరు చేసి.. వారి అభ్యున్నతికి కృషి చేస్తోంది తెదేపానే...


సార్‌ ఇంటర్‌ చదివాను. అనంతరం ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోయాను. స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఆశిస్తున్నా. తెదేపా ప్రభుత్వం వచ్చాక.. మాలాంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం.

ఆయేషా

ఆడబిడ్డలు ఇంకా బాగా చదువుకోవాలి. నైపుణ్యాలను పెంచి.. ఉపాధి కల్పిస్తాం. ఒకటి ఉద్యోగమైనా చేయాలి? మరో పది మందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నెల్లూరులో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వసతులు ఉన్నాయి. ఆ దిశగా ఏర్పాటుకు కృషి చేస్తాం. చదువుకోవాలని ఆసక్తి ఉండే మైనార్టీలకు ఎన్ని కళాశాలలైనా ఏర్పాటు చేసి.. వారు అనుకున్న లక్ష్యం చేరుకునే అవకాశం కల్పిస్తాం.


2019లో అబ్దుల్‌ అజీజ్‌ ద్వారా స్వర్ణకారులను ఆదుకోవాలని కోరుతూ మీ వద్దకు వచ్చాం. మీరు ఓపికగా మా సమస్య విని, మమ్మల్ని ఆదుకుంటామని మాటిచ్చారు. మా సంక్షేమానికి రూ. పది కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. తెదేపా అధికారంలోకి రాగానే మా సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్‌..

రియాజ్‌

స్వర్ణకారుల అభ్యున్నతికి తెదేపా ప్రభుత్వంలో ఎంతగానో కృషి చేశాం. విశేషంగా పనిచేశాం. గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ. పది కోట్లకుపైగానే నిధులు మంజూరు చేస్తాం. అన్ని విధాలా ఆదుకుంటాం.


తెదేపా ప్రభుత్వంలో ముస్లింలకు ఇచ్చిన దుల్హన్‌ పథకం ఎంతో ఉపయోగపడింది. చాలా మంది లబ్ధి పొందారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పథకంలో నిబంధనల పేరుతో మైనార్టీలను మోసం చేస్తోంది. మీరు అధికారంలోకి వచ్చాక.. నిబంధనల ఆంక్షలు లేకుండా అందరికీ దుల్హన్‌ పథకం అందించాలని కోరుతున్నాం.

ఓ మహిళ

చంద్రబాబు: పేద ఆడబిడ్డల సంక్షేమం కోసం.. వారు సంతోషంగా ఉండాలని ఆనాడు తెదేపా ప్రభుత్వంలో దుల్హన్‌ పథకాన్ని అమలు చేశాం. తెదేపా అధికారంలోకి వచ్చాక.. కచ్చితంగా, ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ముస్లిం ఆడబిడ్డకు దుల్హన్‌ పథకం నిధులు అందేలా చర్యలు తీసుకుంటాం.


సార్‌.. వైకాపా ప్రభుత్వంలో రూ.అయిదు వేల వేతనానికి వాలంటీరుగా పనిచేశా. తెదేపా ప్రభుత్వం వచ్చాక రూ. పది వేలు ఇస్తామన్నారు. విజనరీ అయిన మీ ప్రభుత్వంలో పనిచేయాలని ఉంది.

- మహతాజ్‌, వాలంటీరు

వైకాపా ప్రభుత్వం వాలంటీర్లతో చాకిరీ చేయిస్తూ.. వారికి కేవలం రూ.అయిదు వేలు మాత్రమే ఇచ్చింది. వారి కష్టానికి అది సరైన గౌరవవేతనం కాదు. తెదేపా ప్రభుత్వం వచ్చాక వాలంటీరు వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారికి రూ. పదివేల గౌరవ వేతనం ఇస్తాం. వారు ఇంకా ఉన్నత విద్య అభ్యసించాలంటే సహకరిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని