logo

12 లో ఫెయిల్‌ జీవితంలో గెలుపు

పది, ఇంటర్‌, డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణతే మైలురాయి కాదు. విద్యాలయాలకు వెళ్లకపోయినా దూర విద్యలోనూ డిగ్రీలు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడినవారున్నారు. పరిమిత వనరుల్లోనూ ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి

Updated : 23 Apr 2024 07:37 IST

అపజయంతో కుంగిపోవద్దని నిరూపించిన ఐపీఎస్‌ మనోజ్‌కుమార్‌ శర్మ

రేపు ఇంటర్‌ ఫలితాలు

 

పది, ఇంటర్‌, డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణతే మైలురాయి కాదు. విద్యాలయాలకు వెళ్లకపోయినా దూర విద్యలోనూ డిగ్రీలు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడినవారున్నారు. పరిమిత వనరుల్లోనూ ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. విద్యా సంబంధ మార్కుల కంటే.. అత్యున్నత సర్వీసులైన సివిల్స్‌ లాంటి పోటీ పరీక్షల ఫలితాల్లో విఫలమైనా కుంగిపోకుండా ప్రయత్నించి విజయం సాధిస్తున్నారు.  ఇటీవల సివిల్స్‌ ఫలితాల్లోనూ ఉమ్మడి జిల్లావాసి స్ఫూర్తిగా నిలిచారు.

ఇదీ ‘12లో ఫెయిల్‌’ కథ..

పరిస్థితుల కారణంగా ఇంటర్‌ వంటి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడు. కానీ అది సాధించలేక పోషణ కోసం ఉపాధి బాటపడతాడు. ఆ తర్వాత ఉన్నతోద్యోగం మార్గం తెలుసుకుని ఆదిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. ఎదురైన కష్టాలు అధిగమించి చివరికి ఐపీఎస్‌గా ఎంపిక అవుతాడు. ఆయన జీవన ప్రయాణంలో సాగిన ప్రతి దశల్లో ఏదో ఒకటి, లేదా అన్ని సమస్యలు మనకూ ఎదురు కావొచ్చు. భయపడిపారిపోయే ప్రయత్నం చేస్తే... 12లో ఫెయిల్‌ సినిమానే లేదు. కష్టాలు అధిగమించి విజయం సాధించిన ముంబయి కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ మనోజ్‌కుమార్‌శర్మ నిజజీవితం ఆధారంగా ఈ చిత్రం తీశారు.

పరీక్షలే మైలురాయి కాదు..

చేసే పనిలో నిజాయతీ ఉండాలి. ప్రయత్న లోపం ఉండొద్దు. ఆ పనిలో విజయం సాధిస్తే లభించే అనుభూతి వేరు. అపజయమెదురైతే స్వీయ అనుభవ పాఠం దారి చూపుతుంది. ఈ విషయాన్ని స్ఫూర్తిగా స్వీకరించి కొందరు అనూహ్య విజయాలు నమోదు చేస్తారు. ఆ విజయాలే గ్రంథాలు, చిత్రాలుగా తెరకెక్కుతాయి. అలా పుస్తక రూపంలో వచ్చిన, సినిమాగా తెరకెక్కిన ఒక విజేత జీవితమే ‘12 ఫెయిల్‌’. త్వరలో విద్యార్థుల ఉన్నత చదువులకు కూడలి లాంటి కీలక ఇంటర్‌, ఎస్‌ఎస్‌సీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. పరీక్ష ఫలితం ఎలా వచ్చినా దానిని తదుపరి సాగే విద్యకు అనుభవంగా ఎంచుకుంటే మేలు. కానీ కుంగుబాటుకు గురై ఆ ఫలితాలే తమ జీవిత లక్ష్యమన్నట్లు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం శూన్యం. ప్రతికూల ఫలితాన్ని అధిగమించి మరింత పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌ :ఉమ్మడి జిల్లాలో పరీక్ష ఫలితాలు వెల్లడైనప్పుడు జరుగుతున్న కొన్ని ఘటనలు కలవరపెడుతున్నాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుంటారు. పిల్లల కంటే వారికే ఎక్కువ కంగారు ఉంటుంది. ఫలితం ఎలా వస్తుందో? పిల్లలు ఎలా స్పందిస్తారో? అనే భయం వెంటాడుతుంది. దానికి కారణం పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలు. వాటికి దూరంగా ఉండేందుకు విద్యార్థుల్లో ముందుగానే స్థైర్యం నింపాలి. పాఠ్య పుస్తకాలతో వచ్చే మార్కుల కంటే సమాజంలో గుర్తింపు తీసుకొచ్చే సాధనాలు, అవకాశాలు ఎన్నో ఉన్నాయని అవగాహన పెంచాలి. ముఖ్యంగా మార్కులు తక్కువ వచ్చినా, పరీక్షల్లో తప్పినా ఉన్నత స్థానాల్లో నిలిచిన వారి విజయగాథలు వివరించాలి. వారిని స్ఫూర్తిగా తీసుకుని పిల్లలు ఒకదానిలో కోల్పోయిన అవకాశాన్ని మరో దాంట్లో వెతుక్కుంటారు.

  •  గత ఏడాది ఆర్మూర్‌ పట్టణంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలో తప్పినందుకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
  •  ఇలా ఏటా ఫలితాలు విడుదలైనప్పుడు ఒకరిద్దరు ప్రాణాలు తీసుకుంటున్నారు.
  •  మార్కులు అనుకున్నంత రాలేదని మానసికంగా కుంగుబాటుకు గురై తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసే వారూ ఉన్నారు.

ఆరోసారి విజయతీరానికి..

  • కామారెడ్డి జిల్లాకు చెందిన రజనీకాంత్‌ ఐదు సార్లు సివిల్స్‌ రాసి ఫెయిల్‌ అయినా.. ఆరోసారి విజయతీరానికి చేరుకున్నారు. మూడుసార్లు ప్రిలిమ్స్‌, మరో మూడు సార్లు మెయిన్స్‌కు అర్హత సాధించారు. చివరి ప్రయత్నంలో 587వ ర్యాంకు సాధించారు.
  •  నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన కంఠం మహేష్‌కుమార్‌ 2022లో ఆరో ప్రయత్నంగా సివిల్స్‌లో 200వ ర్యాంకు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని