logo

పద..పార్టీ మారుదాం !

రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీల క్యాడర్‌ స్వరూపం మారిపోతోంది. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కిందిస్థాయి క్రీయాశీలక కార్యకర్తల వరకు ఒక్కొక్కరు తమకు అనుకూలంగా ఉండే పార్టీల వైపు క్యూ కడుతున్నారు.

Published : 23 Apr 2024 07:55 IST

న్యూస్‌టుడే, నందిపేట్‌ గ్రామీణం: రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీల క్యాడర్‌ స్వరూపం మారిపోతోంది. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కిందిస్థాయి క్రీయాశీలక కార్యకర్తల వరకు ఒక్కొక్కరు తమకు అనుకూలంగా ఉండే పార్టీల వైపు క్యూ కడుతున్నారు. ఏది ఏమైనా ఈ పార్లమెంటు ఎన్నికలలోపే ప్లాట్‌ ఫాం చూసుకునేందుకు నేతలు ఆరాటపడుతున్నారు. ఇప్పుడే పార్టీలో ప్రాధాన్యం పెంచుకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చక్రం తిప్పవచ్చనే భావనతో పద.. పదాంటూ చేరికల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ముఖ్య నేతలే ముందు వరుసలో..

 రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులుండరనే నానుడిని నిజం చేస్తూ ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పార్టీలు మారుస్తున్నారు. ఆర్మూర్‌ బల్దియా పాలకవర్గంతో పాటు మండల పరిషత్‌, నియోజకవర్గంలో కీలక నేతలు, సర్పంచులు కండువాలు మార్చుకున్నారు. నందిపేట్‌ మండలంలోని ద్వితీయ శ్రేణి నేతలంతా వరుస కట్టారు. ముఖ్య నేతలే ముందు వరుసలో ఉంటున్నారు. అసెంబ్లీ పోరులో ఒకరిపై ఒకరు విమర్శ, ప్రతి విమర్శలు చేసుకున్న వారు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చారు.

 స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా  

పల్లె, పట్టణమని తేడా లేకుండా కొందరు పూర్తి స్థాయి రాజకీయాలకు అంకితమయ్యారు. ఏదో ఒక పదవిలో ఉండాలనే ఆకాంక్ష వారిని పార్టీ ప్రతినిధులుగా మారుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏ పార్టీ నుంచైతే ఏంటి రప్పించుకునేందుకు అధిష్ఠానాలు పచ్చజెండా ఊపుతున్నాయి. దీంతో పలువురు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీలు మారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. ఇప్పుడు క్రీయాశీలకంగా ఉంటే వచ్చే మున్సిపల్‌, సర్పంచి, ఎంపీటీసీ, సొసైటీల ఎన్నికల్లో తమ ఆధిపత్యమే ఉంటుందని విశ్వసిస్తూ కండవాలు కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని