logo

ఓటర్లలో ఎక్కువ.. ప్రాతినిధ్యంలో తక్కువ

ఓటర్ల సంఖ్యలో అతివలే పురుషుల కంటే ఎక్కువగా ఉంటున్నారు. కానీ, పార్లమెంట్‌కు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించడంలో మాత్రం వారి సంఖ్య తక్కువగా ఉంటోంది.

Updated : 28 Apr 2024 06:10 IST

మెదక్‌, జహీరాబాద్‌ స్థానాల్లో మహిళలకు దక్కని ప్రాధాన్యం

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఓటర్ల సంఖ్యలో అతివలే పురుషుల కంటే ఎక్కువగా ఉంటున్నారు. కానీ, పార్లమెంట్‌కు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించడంలో మాత్రం వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల ఓటర్లకు మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1952 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతాల పరిధిలో అతి తక్కువ మంది మహిళలు ఎంపీలుగా విజయం సాధించారు. 1952 నుంచి 2008 వరకు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఉండేవి. 2009 నుంచి జహీరాబాద్‌ను ప్రత్యేక లోక్‌సభ స్థానంగా మార్చారు. జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా విజయం సాధించలేదు. ఏ రాజకీయ పార్టీ వారికి టికెట్‌ కేటాయించలేదు. మెదక్‌ స్థానంలో 1967లో సంగం ఝాన్సీలక్ష్మీబాయి, 1980లో ఇందిరాగాంధీ విజయం సాధించారు.

ఇందిరాగాంధీ మెదక్‌ నుంచే ఎందుకంటే...  

దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత నిర్వహించిన 1977 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చెందింది. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి బరిలోదిగిన ఇందిరాగాంధీ కూడా ఓటమి చవిచూశారు. అప్పుడు దేశంలో జనతా ప్రభుత్వం కొలువుదీరింది. కానీ, ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎక్కువ మంది విజయం సాధించారు. ఇందిరాగాంధీని ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోటీ చేయాలని నేతలు కోరారు. 1980లో జనతా ప్రభుత్వం పడిపోయి దేశంలో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, ఇక్కడి మెదక్‌ స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. రాయ్‌బరేలీ కంటే మెదక్‌లో విజయావకాశాలు అధికంగా ఉన్నాయని సర్వే నివేదికలు చెప్పడంతో ఆమె ఇక్కడి నుంచి బరిలో దిగి 2 లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత 2009లో మెదక్‌ నుంచి సినీనటి విజయశాంతి ఎంపీగా విజయం సాధించారు.

8.33 లక్షల మంది ఉన్నప్పటికీ

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో మహిళా ఓటర్లు 8.33 లక్షల మంది ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు వారికి టికెట్‌ కేటాయించలేదు. కాంగ్రెస్‌, భారాస, భాజపా వంటి ప్రధాన పార్టీలు పురుష అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని