logo

డిజిటల్‌ లావాదేవీలపై నిఘా

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకులో ఓ వినియోగదారుడు ఏప్రిల్‌ రెండో వారం నుంచి రూ.7 లక్షల మేర లావాదేవీలు జరిపారు.

Updated : 28 Apr 2024 06:11 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకులో ఓ వినియోగదారుడు ఏప్రిల్‌ రెండో వారం నుంచి రూ.7 లక్షల మేర లావాదేవీలు జరిపారు. గతంలోనూ ఇతను ఏడాదిలో రూ.18 లక్షలు చెల్లింపులు చేశారు. తాజాగా అతనికి బ్యాంకు అధికారులు ఫోన్‌ చేశారు. పరిమితికి మించి యూపీఐ లావాదేవీలు జరిపారని, ఖాతాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు


‘జిల్లా కేంద్రంలో మరో ఖాతాదారుడికి ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి అధికారులు ఫోన్‌ చేశారు. మీ ఖాతాలో పరిమితికి మించి యూపీఐ లావాదేవీలు జరిపారని, బ్యాంకుకు వచ్చి కలవాలని అధికారులు సూచించారు. దీంతో వినియోగదారుడు ఆందోళనకు గురయ్యాడు.’


ఎన్నికల వేళ తమకు సడలింపులు ఇవ్వాలని కామారెడ్డి కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌కు వినతిపత్రం ఇస్తున్న ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు
(పాతచిత్రం)

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరిమితికి మించి లావాదేవీలు జరుపుతున్న ఖాతాలపై అధికారులు నిఘా పెంచారు. వివరాలు సక్రమంగా లేకపోతే సదరు ఖాతాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

వ్యాపారులకు సడలింపు ఇవ్వాలని..

గతేడాది శాసనసభ ఎన్నికల సమయంలో వాహన తనిఖీలను బ్యాంకులకు సమీపంలో చేపట్టారు. దీంతో సామాన్య ప్రజానీకం నుంచి విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కూడా చిరు వ్యాపారులు, అత్యవసర సమయాల్లో నగదు తరలించేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. డిజిటల్‌ లావాదేవీలపై ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిపిన లావాదేవీలు, మూడు నెలల కిందట చేపట్టిన వాటిపై అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. వాటిని ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి డిజిటల్‌ చెల్లింపులపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని