logo

ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వచ్చే నెల 13న నిర్వహించే పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు స్పష్టం చేశారు.

Published : 28 Apr 2024 05:49 IST

నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు, చిత్రంలో నిజామాబాద్‌ సీపీ కల్మేశ్వర్‌ శింగెనవార్‌, అదనపు కలెక్టర్‌ అంకిత్‌,  జగిత్యాల జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ సన్‌ ప్రీత్‌సింగ్‌, ఎన్నికల పరిశీలకులు

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వచ్చే నెల 13న నిర్వహించే పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలకులు ఎలిస్‌వజ్‌, డీఎం నెమ్జి, పోలీసు పరిశీలకుడు రాజేశ్‌ మీనా శనివారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో జగిత్యాల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు రెండు జిల్లాలకు చెందిన నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు. పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 17,04,867 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ గ్రామీణం, బాల్కొండ నియోజకవర్గాల్లో 1,288, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో 516 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా నగదు, మద్యం, కానుకల పంపిణీపై గట్టి నిఘా పెట్టామన్నారు. ఇప్పటి వరకు రూ.1.22 కోట్ల నగదు, రూ. 1.28 కోట్ల విలువ చేసే బంగారం, ఇతర వస్తువులు సీజ్‌ చేశామన్నారు. మహారాష్ట్ర నుంచి మద్యం, ఇతర వస్తువులు అక్రమంగా జిల్లాలోకి తరలించకుండా సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు చోట్ల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసీ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తిచేసి నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచామని చెప్పారు. 15 మంది కంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉంటే వాటికి అనుగుణంగా బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటి వద్దే ఓటు వేసేందుకు 80 ఏళ్లు పైబడిన వారు 859, దివ్యాంగ ఓటర్లు 899 మందిని గుర్తించామని వెల్లడించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా కోరుట్ల, జగిత్యాలలో ఏర్పాట్లను వివరించారు. సీపీ కల్మేశ్వర్‌ మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా పోలీసుల సమన్వయంతో సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం, నగదు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాత నేరస్థులు, రౌడీషీట్‌ ఉన్న 943 మందిని బైండోవర్‌ చేశామని, లైసెన్స్‌ కలిగిన 76 ఆయుధాలను డిపాజిట్‌ చేయించామన్నారు.  అదనపు కలెక్టర్‌ అంకిత్‌, నగర కమిషనర్‌ మకరందు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని