logo

కాలూరుకు చెందిన గర్భిణి మృతి

నిజామాబాద్‌ గ్రామీణ మండలం కాలూరుకు చెందిన గర్భిణి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Published : 29 Apr 2024 04:39 IST

 ఆసుపత్రి ఎదుట గ్రామస్థుల ఆందోళన

వైద్యుడితో వాగ్వాదం చేస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ గ్రామీణ మండలం కాలూరుకు చెందిన గర్భిణి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. స్రవంతి(35) నాలుగు నెలల గర్భిణి. శనివారం ఉదయం కడుపునొప్పి రావడంతో వీక్లీమార్కెట్‌ వద్ద ఉన్న ఆసుపత్రికి వెళ్లారు. స్కానింగ్‌ చేసి కడుపులో పిండం చనిపోయిందని, అబార్షన్‌ అవసరం లేదని, మాత్రలు వేసుకుంటే సరిపోతుందని చెప్పి పంపించారు. వారి సూచన మేరకు మాత్ర వేసుకుంది. శనివారం రాత్రి తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యుడికి ఫోన్‌ చేయగా రక్తస్రావం కోసమే మాత్ర ఇచ్చానని, రాత్రి ఆసుపత్రికి రావొద్దని చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బాధితులు మళ్లీ ఫోన్‌ చేయగా సదరు వైద్యుడు ఉదయం రావాలని ఫోన్‌ పెట్టేశారు. ఆదివారం ఉదయం ఆసుపత్రికి తీసుకురాగా తీవ్ర రక్తస్రావమవుతుందని మరో ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. అక్కడి వైద్యులు పరిశీలించి గర్భిణి మృతి చెందినట్లు గుర్తిచారు. దీంతో బాధితులు మొదట చూపించిన ఆసుపత్రికి వచ్చి వైద్యుడి నిర్లక్ష్యం వల్లే స్రవంతి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలో అబార్షన్లు చేస్తున్నా జిల్లా వైద్యారోగ్య శాఖకు పట్టడం లేదు. నిబంధనల ప్రకారం వారి అనుమతి తప్పనిసరి. కానీ, ఇవేవీ లేకుండానే మాత్రతో గర్భవిచ్ఛిత్తికి ప్రయత్నించారు. జిల్లా కేంద్రంలో పలు చోట్ల అబార్షన్ల పేరుతో గర్భిణుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. మాత్ర ఇస్తే తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి సుదర్శనంను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సదరు ఆసుపత్రిపై విచారణ చేస్తామన్నారు. వైద్యులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి నివేదిక ఇస్తారు.. ఆసుపత్రి నిర్లక్ష్యమని తేలితే కఠిన చర్యలుంటాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని