logo

‘గల్ఫ్‌ కార్మికులు ఇప్పుడు గుర్తుకొచ్చారా?

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డికి ఇన్నాళ్లకు గల్ఫ్‌ కార్మికులు గుర్తుకొచ్చారా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ప్రశ్నించారు. భాజపా జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 29 Apr 2024 05:51 IST

ఎడపల్లి మండలానికి చెందిన యువకులకు పార్టీ కండువాలు వేస్తున్న అర్వింద్‌, చిత్రంలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌, మేడపాటి, మోహన్‌రెడ్డి తదితరులు

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డికి ఇన్నాళ్లకు గల్ఫ్‌ కార్మికులు గుర్తుకొచ్చారా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ప్రశ్నించారు. భాజపా జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఉన్నాయని గల్ఫ్‌బోర్డు మాట ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ 60 ఏళ్ల పాలనలో యువతకు ఉపాధి కల్పించకపోవడం వల్లే ఎడారి దేశాలకు పొట్టచేతబట్టుకొని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ సమయంలో భాజపా అనుబంధ సంస్థ ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరం గల్ఫ్‌ నుంచి ఎనిమిది విమానాలను నడిపిందని, అవరమైన మందులు, ఆహారం అందించిందని గుర్తుచేశారు. గల్ఫ్‌బోర్డు హామీని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. గల్ఫ్‌ కార్మికుల పట్ల కాంగ్రెస్‌ చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రవాస భారతీయుల సేవ కోసం యూఏఈలో ఐపీఎఫ్‌ పనిచేస్తోందని గుర్తుచేశారు. ఇస్లామిక్‌ దేశాల్లో హిందూ ఆలయాలు నిర్మిస్తున్నారు.. ముస్లింలు గుడిలో ప్రసాదం తీసుకొని రోజా విరమించారు.. ఇందుకు కారణం నరేంద్ర మోదీ మాత్రమేనని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సంవత్సరం దోపిడీ ఆపితే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానంటున్నారు.. ఆర్నెల్లు అయింది కదా రూ.లక్ష ఎందుకు చేయలేదని ఎద్దేవా చేశారు. తన పదవి ఊడకముందే మొదటిదశలో రూ.లక్ష రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎడపల్లి మండలానికి చెందిన పలువురు యువకులు భాజపాలో చేరారు. సమావేశంలో ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరం అధ్యక్షుడు జితేంద్ర సింగ్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, వడ్డి మోహన్‌రెడ్డి, న్యాలం రాజు, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, బంటు రాము, సుదీర్‌, స్రవంతిరెడ్డి తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని