logo

ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు.. 1,45,912

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో 53 వేల ఓటర్లు మాత్రమే పెరిగారు.

Published : 29 Apr 2024 05:04 IST

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో మహిళలే అధికం 

పోలింగ్‌కేంద్రం వద్ద బారులుదీరిన ఓటర్లు(పాతచిత్రం)

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో 53 వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. 2019 నుంచి 2024 మధ్య 1,45,912 మంది పెరగడం గమనార్హం. పెరిగిన ఓటర్లలోనూ మహిళల సంఖ్యే అధికంగా ఉంది. జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్లు అధికంగా పెరిగారు. ప్రస్తుతం అధికారులు విడుదల చేసిన తుదిజాబితా ప్రకారం జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 16,40,755. ఒక్క నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో మాత్రమే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు స్వల్పంగా ఎక్కువగా ఉన్నారు. మిగతా అన్ని చోట్ల మహిళలే అధికంగా ఉన్నారు.

ఏడాదంతా నమోదు

గతంలో ఓటర్ల నమోదు కార్యక్రమం ఏడాది పొడవునా సాగేది. గత ఏడాది నుంచి ఏడాదికి నాలుగుసార్లు తుదిజాబితా విడుదల చేస్తున్నారు. ప్రతి నాలుగునెలలకోసారి నమోదు కార్యక్రమాలు, తుదిజాబితాలు విడుదల చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం బూత్‌స్థాయి అధికారులు ఇంటింటా కొత్త ఓటర్ల వివరాలు సేకరించారు. 18 సంవత్సరాలు నిండిన వారికి దరఖాస్తు ఫారాలు అందించి ఓటరుజాబితాలో పేర్లు నమోదు చేశారు. అంతేకాకుండా కళాశాలల్లో ఓటరు చైతన్య నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించారు. దీంతో ఓటర్ల సంఖ్య అధికంగా పెరిగింది.

పోలింగ్‌ కేంద్రాలకు వస్తారా..?

ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించడం సవాలుగా మారుతోంది. వేసవిలో వృద్ధులు, దివ్యాంగులకు సరైన వసతులు కల్పించకపోతే వారు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. ప్రస్తుతం రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడతో ఆ ప్రభావం పోలింగ్‌శాతంపై పడే అవకాశాలు ఉన్నట్లు అభ్యర్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్‌ లోక్‌సభకు 2009లో జరిగిన ఎన్నికల్లో 74.67 శాతం, 2014లో 77.28 శాతం, 2019లో 69.70 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య భారీగా పెరిగినా.. వీరందరు వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని