logo

మగువ.. ప్రచారంలో తెగువ

ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో మహిళలు ముందంజలో ఉన్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పాదయాత్రలు, రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

Updated : 29 Apr 2024 06:48 IST

ఓటర్లకు చేరువవుతున్న నేతలు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో మహిళలు ముందంజలో ఉన్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పాదయాత్రలు, రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వివిధ వార్డులు, బస్తీల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వ్యాయామం, నడక కోసం వచ్చేవారితో ఉదయాన్నే మాట కలుపుతూ తమకు ఓట్లు ఎందుకు వేయాలో వివరించి గెలిపించమని అడుగుతున్నారు.

ముందంజలో అపరాజిత

భువనేశ్వర్‌ సిటింగ్‌ ఎంపీ అపరాజిత షడంగి ఐఏఎస్‌ మాజీ అధికారి. ప్రభుత్వ ఉన్నతాధికారిణిగా మన్ననలందుకున్నారు. వీఆర్‌ఎస్‌ తీసుకుని గతసారి ఎన్నికల బరిలో దిగిన ఆమె భువనేశ్వర్‌ లోక్‌సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. గత అయిదేళ్లు రాజధాని ప్రాంతాలకు ఉత్తమ సేవలందించిన అపరాజిత ఈసారి మళ్లీ బరిలో ఉన్నారు. ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్న ఆమె ఓటర్లకు దగ్గరవుతున్నారు.

  • బిజు, నవీన్‌ మంత్రివర్గాల్లో కీలకమైన ఆర్థిక, వ్యవసాయ శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన రామకృష్ణ పట్నాయక్‌ కుమార్తె అనితా శుభదర్శిని ఈసారి ఎన్నికల్లో అస్కా లోక్‌సభ భాజపా అభ్యర్థిగా రంగంలో నిలిచారు. మరో బిజద దివంగత నేత హరప్రసాద్‌ సాహు కుమార్తె రంజితా సాహును ముఖ్యమంత్రి నవీన్‌ నిలిపారు. అనితా, రంజితాలు ఉన్నత విద్యావంతులు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారంలో నువ్వా? నేనా? అన్న రీతిలో పోటీపడి ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

జగత్సింగ్‌పూర్‌లో బిజద అభ్యర్థి రాజశ్రీ మల్లిక పాదయాత్ర

అంతఃపురం నుంచి జనాల మధ్యకు...

రాణులు ప్రజల ముందుకు రారు. అంతఃపురంలో ఉంటారన్నది నిన్నటి మాట. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడిన తర్వాత వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రజల మధ్యకు వస్తున్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తర్వాత ఒడిశాలో రాజులు, రాణుల ప్రభావం నేటికీ కొనసాగుతోంది. కలహండి రాజు అర్కకేసరిదేవ్‌ 2014 నుంచి 2019 వరకు బిజద ఎంపీ, గతసారి ఆయనకు సీఎం టిక్కెట్టు ఇవ్వలేదు. తర్వాత ఆయన, భార్య మాళవిక దేవి భాజపాలో చేరారు. ఈసారి ఎన్నికల్లో కమలదళం సిటింగ్‌ ఎంపీ బసంత పండాను కాదని మాళవికను అభ్యర్థిగా చేసింది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉన్న మాళవిక పాదయాత్రలు చేస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు.

మరో విజయానికి తహతహ

తహసీల్దారుగా విధులు నిర్వహించి గతసారి ఎన్నికల సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి బిజదలో చేరి జాజ్‌పూర్‌ ఎంపీ అయిన శర్మిష్ఠ శెఠిని నవీన్‌ ఈసారి మళ్లీ పోటీకి అవకాశం ఇచ్చారు. ఇదివరకు బిజదకు స్టార్‌ ప్రచారకురాలిగా సీఎం వెంట ఉన్న ప్రముఖ ఒడియా సినీనటి బర్షా ప్రియదర్శిని ఈసారి జాజ్‌పూర్‌ లోక్‌సభ సెగ్మెంటులోని బొడొచొణా అసెంబ్లీ స్థానం నుంచి బిజద అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. శర్మిష్ఠ, బర్షాలు ఇద్దరు కలిసి ప్రస్తుతం ప్రచారంలో తలమునకలై ఉన్నారు.

మరో ఛాన్స్‌ కోసం

జగత్సింగ్‌పూర్‌ ప్రస్తుత లోక్‌సభ సభ్యురాలు రాజశ్రీ మల్లిక్‌ మళ్లీ బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గడిచిన అయిదేళ్లు ప్రజలకు చేసిందేమీ లేదన్న అపవాదు ఉంది. ఈసారి రాజశ్రీకి మళ్లీ టిక్కెట్టు కేటాయించరన్న అంచనాల మధ్య నవీన్‌ మళ్లీ ఆమెను నిలబెట్టారు. తప్పులుంటే క్షమించాలని, తాను ఈ ప్రాంతాలకు దూరం కాలేదని, మరో అవకాశమిస్తే తానేమిటో నిరూపించుకుంటానని రాజశ్రీ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పాదయాత్రŸగా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు విన్నవిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని