logo

ప్రముఖుల బరి... ఎవరిదో విజయం మరి?

పొరుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుత ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు.

Published : 02 May 2024 02:45 IST

సంబల్‌పూర్‌లో ముక్కోణపోరు ఆసక్తికరం
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే

 

పొరుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుత ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. సంబల్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇద్దరు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నారు. బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్‌దాస్‌ (బొబి) కేంద్రమంత్రితో నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడుతున్నారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వ వైఫల్యాలను అదేపనిగా కొన్నాళ్లుగా కడిగేస్తూ వచ్చిన ధర్మేంద్రను ఓడించడానికి సీఎం పెద్ద సంఖ్యలో బలగాలను సంబల్‌పూర్‌కు తరలించారు. పోరు రసవత్తరంగా జరుగుతుండగా రాష్ట్ర ప్రజల దృష్టి సంబల్‌పూర్‌ స్థానంపైనే ఉంది.

ఒకరు కేంద్రమంత్రి, మరొకరు బిజద రాజకీయాల వ్యవహారాల ఇంఛార్జి. వీరికి తోడు మాజీ ఎంపీ ఒకరు పోటీలో ఉన్నారు. దీంతో సంబల్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎవరు గెలుస్తారన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది.

శామలాయికి నూతన సొబగులు

సంబల్‌పూర్‌ శామలాయి శక్తి పీఠం

పశ్చిమ ప్రాంతాల ఆరాధ్య దేవత శామలాయి. సంబల్‌పూర్‌ మహానది ఘాట్‌కు చేరువలో ఉన్న ఈ తల్లి పీఠం మహిమాన్వితమైనది. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌ నుంచి నిత్యం భక్తులు దర్శనానికి వస్తుంటారు. పరిమిత స్థలంలో ఇరుకుగా ఉన్న శామలాయి శక్తిపీఠాన్ని విస్తరించి పశ్చిమ వాసులకు చేరువ కావాలన్న ధ్యేయంతో రూ.200 కోట్లకుపైగా వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన విస్తరణ పనులు చేయించారు. ఇటీవల ఈ ఆలయ నూతన నిర్మాణాల ప్రతిష్ఠ వేడుకలు స్వయంగా సీఎం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో బొబి ముఖ్య ప్రాత పోషించారు.

అంచనాలు తలకిందులు చేసిన కాంగ్రెస్‌

సంబల్‌పూర్‌కి చెందిన ప్రముఖ వైద్యురాలు, సేవా సంస్థల సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రాసేశ్వరి బెహరా ఇటీవల బిజదకు రాజీనామా చేయడం ఆ పార్టీకి గట్టి దెబ్బ. మరోవైపు సంబల్‌పూర్‌ బిజద మాజీ ఎంపీ నాగేంద్ర ప్రధాన్‌ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ఏఐసీసీ అధిష్ఠానం అభ్యర్థిగా చేసింది. ఈ ప్రాంతంలో గట్టి పట్టున్న నాగేంద్రకు బిజద బలం, బలహీనతలు తెలుసు. వ్యూహకర్తగా అంతా చెబుతారు. సంబల్‌పూర్‌లో కాంగ్రెస్‌కంటూ ఓటు బ్యాంకు ఉంది. ఉత్తర కోస్తా వాసి అయిన ప్రణవ ప్రకాష్‌ దాస్‌ను అభ్యర్థిగా చేయడం కొంతమంది బిజద పెద్దలకు మింగుడుపడలేదు. వారిలో అసంతృప్తి ఉంది. వీరంతా నాగేంద్రకు అనుకూలంగా మారే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు. కాంగ్రెస్‌ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ ప్రచారం ఇంకా ఊపందుకోలేదు

పశ్చిమంలో గుర్తింపు ఉన్న నేత

పశ్చమ ఒడిశాలో ధర్మేంద్ర ప్రధాన్‌కు గుర్తింపు ఉంది. ఆయన తండ్రి దివంగత దేవేంద్ర ప్రధాన్‌ గతంలో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ధర్మేంద్ర భాజపాకు దగ్గరై ప్రధాని మోదీకి విశ్వసనీయునిగా ముద్రపడ్డారు. బిహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఏకగ్రీవమైన ఆయన కేంద్రంలో పెట్రోలియం, సహజ వాయువులు, ఉక్కుగనుల శాఖల మంత్రిగా, ప్రస్తుతం విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన దేవ్‌గఢ్‌ వాసి. ఈసారి లోక్‌సభకు పోటీ చేయాలని ఏడాది క్రితం నిర్ణయించారు. దేవ్‌గఢ్‌ అసెంబ్లీ సెగ్మెంటు సంబల్‌పూర్‌ పరిధిలో ఉంది. భాజపా కేంద్ర నాయకత్వం కేంద్రమంత్రి విన్నపం మేరకు సంబల్‌పూర్‌ అభ్యర్థిగా చేసింది.

ప్రజలతో మంచి సంబంధాలు

ధర్మేంద్ర చొరవతో సంబల్‌పూర్‌లో ప్రతిష్ఠాత్మక ఐఐఎం ఏర్పాటైంది. ఇతర నిర్మాణాలూ జరిగాయి. తాను ఇక్కడి నుంచి పోటీ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న కేంద్రమంత్రి తరచూ ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజలకు దగ్గరయ్యారు. ఆయన భార్య మృదుల ప్రధాన్‌ ఆధ్వర్యంలోని వికాస్‌ ఫౌండేషన్‌ ఇటీవల కాలంలో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారు.

అభివృద్ధే అజెండా

సంబల్‌పూర్‌ ప్రాంతంలో పాదయాత్రలు, రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్న ధర్మేంద్ర అభివృద్ధే తన అజెండాగా వివరిస్తున్నారు. నవీన్‌ పాలనా కాలంలో ఈ ప్రాంతాలు నిరాదరణకు గురయ్యాయని, ఆశించిన స్థాయిలో పనులు జరగలేదని ఓటర్లకు చెబుతున్నారు. ప్రాంతీయ అసమానతలకు పశ్చిమ ప్రాంతాలు నిలువుటద్దంగా ఉన్నాయని ఓటర్లకు వివరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో ఆయాచోట్ల ‘చాయ్‌ పే చర్చా’ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు.

పశ్చిమానికి ఉత్తరకోస్తా వాసి

పశ్చిమ ప్రాంతాల్లో బిజదలో అగ్రనేతలెందరో ఉన్నారు. సంబల్‌పూర్‌ నుంచి పోటీ చేయాలని ఆశలు పెంచుకున్నా నవీన్‌ అవకాశమవివ్వలేదు. ఉత్తరకోస్తా (జాజ్‌పూర్‌)కు చెందిన ప్రణవ ప్రకాష్‌ దాస్‌ (బొబి)ను అభ్యర్థిగా నిలిపారు. బిజద రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అయిన బొబి సీఎం, వి.కార్తికేయ పాండ్యన్‌లకు అత్యంత సన్నిహితుడు. ఉద్దేశపూర్వకంగా ఏడాది క్రితం నవీన్‌ ఆయనను సంబల్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి పరిశీలకునిగా నియమించారు. తరచూ పర్యటించిన ఆయన ఆయా ప్రాంతాల నేతలు, కార్యకర్తలతో నిత్యం చర్చలు జరిపారు. ఎన్నికల వ్యూహం ఖరారు చేశారు. ప్రత్యర్థి ధర్మేంద్ర బలం, బలహీనతలు అంచనా వేసిన బొబి సీఎం అండదండలతో యుద్ధ ప్రాతిపదికన సంబల్‌పూర్‌ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయించారు.

సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రణవ ప్రకాష్‌

ధర్మేంద్రను సంబల్‌పూర్‌లో ఎదుర్కోవడం సులువు కాదని తెలిసిన బొబి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శక్తియుక్తులు ప్రదర్శిస్తున్నారు. నవీన్‌ హయాంలో జరిగిన ప్రగతి గురించి వివరిస్తున్నారు. క్లబ్బులు, సేవా సంస్థలకు సొమ్ము పంపిణీ చేస్తున్నారు. అట్టహాసంగా ప్రచారం జరుగుతోంది.

మోదీ పవనాలు వీస్తున్నాయి

సంబల్‌పూర్‌లో ధర్మేంద్ర ప్రచారం

సంబల్‌పూర్‌లో ధర్మేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ పవనాలు రాష్ట్రంలో బలంగా వీస్తున్నాయన్నారు. ఆయన గ్యారంటీని అన్నివర్గాల ఓటర్లు విశ్వసిస్తున్నారన్నారు. తన గెలుపు ఈ ప్రాంత ప్రజలదని, తాను నిమిత్తమాత్రుడినని వివరించారు.

నవీన్‌ ఆదరణ గెలిపిస్తుంది

ప్రసంగిస్తున్న బొబి

దేవ్‌గఢ్‌లో బొబి విలేకరులతో మాట్లాడుతూ... నవీన్‌ ఆదరణ తన విజయానికి బాటలు వేస్తుందన్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతాల్లో పనులెన్నో జరిగాయని, ఈ అభివృద్ధి కొనసాగాలన్న ధ్యేయంతో ఓటర్లు తనని గెలిపిస్తారన్నారు. ధర్మేంద్ర కేంద్రమంత్రిగా సంబల్‌పూర్‌కి చేసిందేమీ లేదన్న వ్యతిరేకత జనాల్లో ఉందని చెప్పుకున్నారు.

జనం అండదండలున్నాయి

కాంగ్రెస్‌అభ్యర్థి నాగేంద్ర మాట్లాడుతూ సంబల్‌పూర్‌ ప్రాంతాల ప్రజలు తనను లోక్‌సభకు పంపిస్తారని, వారి అండదండలు పుష్కలంగా ఉన్నాయని, ఎన్నికల్లో ఇది నిరూపితమవుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని