logo

ప్రకటనల మోత.. ఏదీ రైలుబస్సు కూత

మారుమూల ప్రాంతంలో సౌకర్యంగా ఉన్న రైలుబస్సు సేవలకు గ్రహణం పట్టింది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే సాలూరు రైల్వే స్టేషన్‌లో రైలు కూత వినిపించకుండా పోయింది.

Updated : 23 Apr 2024 05:45 IST

కేంద్రంతో మాట్లాడిన నేతలే కరవు
సాలూరు స్టేషన్‌ ప్రగతి గాలికే..

సాలూరు- బొబ్బిలి స్టేషన్ల మధ్య విద్యుత్తు లైను

న్యూస్‌టుడే, సాలూరు: మారుమూల ప్రాంతంలో సౌకర్యంగా ఉన్న రైలుబస్సు సేవలకు గ్రహణం పట్టింది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే సాలూరు రైల్వే స్టేషన్‌లో రైలు కూత వినిపించకుండా పోయింది. తెదేపా ప్రభుత్వం కేంద్రంతో చర్చించి సాలూరు-బొబ్బిలి మధ్య రైలు బస్సు నడిపించింది. ఈ ప్రభుత్వం వచ్చాక రైలు బస్సుకు బ్రేక్‌ పడినా కేంద్రంతో మాట్లాడిన నేతలు ఒక్కరూ లేకపోవడం దురదృష్టకరం. ప్రస్తుతం రైల్వేస్టేషన్‌ను ఇతర రాష్ట్రాల రైళ్లను నిలుపుకొనేందుకు పార్కింగ్‌ స్థలంగా వినియోగిస్తున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఆగిన రైలు మళ్లీ పట్టాలు ఎక్కలేదు. 

ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపం

బ్రిటీషు వారి హయాంలో సాలూరు పట్టణంలో రైల్వే స్టేషన్‌ ఏర్పాటైంది. అప్పట్లో ఇతర దేశాల నుంచి గోధుమలు, సిమెంట్‌, ఇతర సరకులు గూడ్స్‌ రైళ్ల ద్వారా దిగుమతి అయ్యేవి. ఆ తర్వాత ప్రయాణికుల కోసం సాలూరు-బొబ్బిలి పట్టణాల మధ్య తొలుత బొగ్గుతో, అనంతరం డీజిల్‌ ఇంజిన్‌తో రెండు బోగీల రైలును నడిపారు. నిర్వహణ భారం ఎక్కువైందని, నష్టాలు వస్తున్నాయని 1998లో ఏకంగా రైల్వే స్టేషన్‌నే ఎత్తివేశారు. ఆ తరువాత రెండు పట్టణాల మధ్య రైలు బస్సును ప్రవేశపెట్టారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అయిదు ట్రిప్పులు నడిచేది. సాలూరు, శివరాంపురం, పారన్నవలస, భవానీపురం, రొంపల్లి, మిర్తివలస, నారాయణప్పవలస తదితర గ్రామాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఉపయోగపడేది. నిర్వహణ లోపం, పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలకు రైలు బస్సు అందకుండా పోయింది.

పొడిగింపు ఏమైందో..

సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా పార్వతీపురం, రాయగడ, అక్కడి నుంచి విశాఖపట్నం వరకు పాసింజరు రైలు సేవలను పొడిగిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు. దండిగాం రోడ్డు వద్ద ప్రయాణికులు వేచి ఉండేందుకు కొత్తగా షెడ్డు  నిర్మించారు. ఇక్కడి నుంచి బొబ్బిలి వరకు విద్యుత్‌ లైన్‌ కూడా వేశారు. రైల్వే ట్రాక్‌, విద్యుత్‌, స్టేషన్‌ అభివృద్ధి పనులకు రూ.కోట్లు కేటాయించారు. ఏడాదిలో పనులు పూర్తయ్యాయి. రైలు నడిపే వేళలకు బోర్డు నుంచి అనుమతి పొందటమే తరువాయి.. సేవలు పునరుద్ధరిస్తారని ఈ ప్రాంత ప్రజలు సంబరపడ్డారు. ఆ దిశగా చర్యలు కొరవడటంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. దండిగాం రోడ్డు వద్ద నిర్మించిన ప్రయాణికుల షెల్టర్‌, స్టేషన్‌ పునరుద్ధరణ పనులు దెబ్బతిన్నాయి. గతేడాది వీటికి మరమ్మతులు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. రైలు మార్గంలో పనికిరాని మొక్కలు పెరిగాయి. ఈదురు గాలులకు షెల్టర్‌ రేకులు ఎగిరిపోయాయి.

మెము.. ప్రకటనకే పరిమితమా..

సాలూరు నుంచి బొబ్బిలి, విజయనగరం మీదుగా విశాఖపట్నం వరకు ఎంఈఎంయూ (మెము- 07468/69) రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. ఉదయం 4.30 గంటలకు సాలూరులో బయలుదేరి విశాఖపట్నం, మళ్లీ సాయంత్రం విశాఖలో బయలుదేరి రాత్రి 10.30 గంటలకు సాలూరు చేరుకుంటుందని కాలపట్టికను గత ఆగస్టులో వెల్లడించినా.. ఇప్పటి వరకు అతీగతీ లేదు.

ఎన్డీఏ కూటమిపై ఆశలు..

సాలూరు పట్టణానికి రైలు సౌకర్యం పునరుద్ధరణపై ప్రజల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. గతంలో రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులకు తనవంతుగా కృషి చేసిన అప్పటి ఎంపీ కొత్తపల్లి గీత ప్రస్తుతం ఎన్డీఏ ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. ఇటీవల ప్రచార కార్యక్రమానికి సాలూరు వచ్చిన ఆమె.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే స్టేషన్‌ అభివృద్ధిపై దృష్టిసారించి, రైలుబస్సు సేవలు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

విన్నపాలు పట్టించుకోలేదు..

సాలూరు స్టేషన్‌ అభివృద్ధి చేశారు. విద్యుత్తు లైన్‌ వేశారు. విశాఖËపట్నం వరకు మెము రైలు నడుపుతామని రైల్వే ఉన్నతాధికారులు గతేడాది ప్రకటన కూడా జారీచేశారు. ఇప్పటి వరకు జరగలేదు.  కొత్త జిల్లా ఏర్పడినందున పార్వతీపురం వరకైనా నడిపితే బాగుంటుంది. పలుమార్లు కలెక్టర్‌, రైల్వే అధికారులు, నాయకులకు వినతులు సమర్పించినా ఎలాంటి కదలిక లేదు.

జె.సీతారాం, జిల్లా వినియోగదారుల మండలి కార్యదర్శి, సాలూరు

వైకాపా పాలనలోనే రైలు బస్సు సేవలు ఆగాయి. అయిదేళ్లలో వైకాపా ఎంపీ ఒకసారి కూడా పార్లమెంట్‌లో సమస్యను ప్రస్తావించలేదు. సాలూరు ప్రజలు ఏం పాపం చేసుకున్నారో ఏమో.. ఉన్న స్టేషన్‌ను ఎత్తేశారు. బస్సెక్కితే ఛార్జీల మోత మోగుతోంది.

సుదర్శనరావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని