logo

ఇళ్లన్నావ్‌.. రోడ్డున పడేశావ్‌

పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు.

Published : 29 Apr 2024 05:08 IST

బొబ్బిలిలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణం

న్యూస్‌టుడే, బొబ్బిలి: పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంత పేదలకు ఇళ్లు ఇవ్వాలని దాదాపు పూర్తి చేసిన టిడ్కో సముదాయాల్ని కూడా లబ్ధిదారులకు అప్పగించలేదు. దీంతో వారికి వేదనే మిగిలింది.

లబ్ధిదారుల నిలదీత

బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద 2,072 మందికి పక్కా గృహాలు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు మందగించాయి. ఇందులో 26 బ్లాకుల్లో 1,280  ప్లాట్లను మాత్రం సిద్ధం చేశారు. సదుపాయాలు కల్పించలేదు. ఎన్నికల ముందు అప్పగించేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించారు. కానీ లబ్ధిదారులు తిప్పకొట్టారు. కమిషనర్‌ రామలక్ష్మి, పుర అధ్యక్షుడు వెంకట మురళీకృష్ణ లబ్ధిదారులతో సమావేశమై, చర్చించారు. రోడ్లు, నీరు, కాలువలు, విద్యుత్తు లేకుండా ఎలా ఉండాలని లబ్ధిదారులు నిలదీశారు. దీంతో అప్పగింతలు వాయిదాపడ్డాయి. మరోవైపు ఇళ్లు అప్పగించకుండానే బ్యాంకు వాయిదాలు కట్టాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.


మోక్షం కలగలేదు

సౌకర్యాలు లేక నిరుపయోగంగా ఉన్న సముదాయం

రామన్నదొరవలసలో టిడ్కో గృహాలకు రహదారులు, డ్రైన్లు వేసేందుకు సముదాయాల మధ్య మట్టిని తవ్వేసి ఆరునెలలు అవుతోంది. ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. సీసీ రోడ్లు, కాలువలు, ఇంటింటి కుళాయిలు, తాగునీటి రిజర్వాయర్‌ నిర్మాణానికి నిధులు కేటాయించామని చెబుతున్నా గుత్తేదార్లు ఒక అడుగు రహదారి కూడా వేయలేదు. పట్టణం నుంచి సముదాయాల వద్దకు వెళ్లేందుకు ప్రధాన రహదారి మార్గం లేదు. పారిశ్రామికవాడ నుంచి బీటీ రహదారి వేస్తామని గతంలో చెప్పుకొచ్చారు. ఆ పనులు చేపట్టలేదు. గుత్తేదారు పనులు చేయాల్సి ఉందని టిడ్కో ఏఈ నవీన్‌కుమార్‌ అన్నారు.


గూడు లేదు.. డబ్బులు లేవు
- బొబ్బిలి పట్టణంలోని రెడ్డికవీధికి చెందిన ఓ లబ్ధిదారు

టిడ్కో ఇళ్ల కోసం రూ.25 వేలు మార్జిన్‌మనీగా చెల్లించాను. ఐదేళ్లు అవుతోంది. ఆపై నా ఇళ్లు రద్దు చేసి.. జగనన్న కాలనీలో ఇంటిపట్టా ఇచ్చారు. చెల్లించిన మొత్తాలు ఇవ్వకుండా తిప్పుతున్నారు. అధికారులను అడిగితే ప్రభుత్వం వద్ద ఉన్నాయి, ఇస్తామని చెబుతున్నారు. ఇంతవరకు రాలేదు. అప్పు చేసి ఇచ్చినా, ప్రయోజనం లేకుండా పోయింది. ఇబ్బందులు పడుతున్నా. ఎప్పుడొస్తాయో తెలియదు.


నగదు తీసేస్తున్నారు
- రాఘవరావు, లబ్ధిదారుడు, బొబ్బిలి

నాకు రెండు పడకల గది ప్లాట్‌ మంజూరు చేశామని చెప్పారు. ఇంతవరకు అప్పగించలేదు. మరోవైపు ప్రతీనెల రూ.3 వేలు వాయిదా బ్యాంకర్లు లాగేస్తున్నారు. నేను ఎల్‌ఐసీ ఏజెంటుగా పనిచేస్తున్నాను. ఆయా కమిషన్‌ మొత్తాలు ఖాతాలో పడగానే తీసేస్తున్నారు. వాయిదాలు కడుతున్నా ఇంటిలో మాత్రం ఇంతవరకు దిగలేదు. సదుపాయాలు కల్పించి ఎప్పుడు ఇస్తారో చెప్పండి.


ఇంత జాప్యమా?
- ఆర్‌.నిర్మల, లబ్ధిదారురాలు, బొబ్బిలి

ఇళ్లు నిర్మించడానికి ఐదేళ్లు పట్టింది. ఇంకా రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయం లేదు. వీటిని నిర్మించడానికి ఇంకెన్నేళ్ల్లు పడుతుందో తెలియదు. ఇంతవరకు ఇళ్లు అప్పగించకపోతే ఎలా? అక్కడ మేమెలా నివసించగలం. అధికారులు, నేతలు చెప్పిన మాటలకు, పరిస్థితులకు పొంతన లేదు. మరోవైపు బ్యాంకుల నుంచి డబ్బులు కట్టాలని ఒత్తిడి వస్తోంది        

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని