logo

గొంతు తడిపే ఆలోచనుందా..?

వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు..

Published : 29 Apr 2024 05:15 IST

భామిని మండలం రేగిడిలో తాగునీటికి వినియోగిస్తున్న ఊటబావి. వేసవిలో ఇది ఇంకిపోతే గ్రామస్థుల కష్టాలు వర్ణనాతీతం

పార్వతీపురం, భామిని, న్యూస్‌టుడే: వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. వారి సమీపంలో ఉండేవన్నీ ఊటబావులే. ఏటా ఎండలతో ఊటల్లో నీరు ఇంకుతుంటే వారి గొంతుల్లో తడారుతుంది. ఈ పరిస్థితి ఎక్కువగా పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట, భామిని మండలాల్లో ఉంది. సీతంపేటలో 33..అదే మండలంలోని బగ్గ, చింతాడ, దబర, దారపాడ, దేవనాపురం, గులుమూరు, కేపీ ఈతమానుగూడ, పీవీ ఈతమానుగూడ, కీసరజోడు, కిలాడ, కొడిశ, కొండాడ, మండ, రోలుగుడ్డి, వజ్జాయ్‌గూడ, తుంబకొండ, సోమగండి తదితర పంచాయతీల్లోని 33 గ్రామాలు నీటి కోసం కటకటలాడుతున్నాయి.

భామినిలో 11.. భామిని మండలంలో నల్లరాయిగూడ, బొడ్డగూడ, పాలవలస, పాలిసుకోట పంచాయతీలకు చెందిన 11 గ్రామాల ప్రజలు ప్రస్తుతం ఊట నీరు వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఊటల చుట్టూ సిమెంట్‌ కట్టడాలు ఏర్పాటు చేసి నీరు నిల్వ చేసి వాడుతున్నారు. వేసవి తీవ్రత ఎక్కువైతే ఊటలు ఎండి నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది.  

గతంలో ట్యాంకర్లతో నీరు..

పార్వతీపురం మన్యం జిల్లాలో గెడ్డలు, ఊటబావుల నీటిపై ఆధారపడి గొంతు తడుపుకొంటున్న గ్రామాలు వందకు పైగా ఉన్నాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాచిపెంట, భామిని, సీతంపేట మండలాల్లో గిరిజన గూడేలు ఎక్కువ. గత ప్రభుత్వ హయాంలో అక్కడ పరిస్థితిని ముందుగానే గుర్తించి, వారికి నీరు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు వేసేవారు. దీని అమలుకు అవసరమైన నిధులు సమకూర్చేవారు. ట్యాంకర్లు ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు పంపించి నీటి కష్టాలు తీర్చేవారు. వైకాపా హయాంలో రెండేళ్లు అందించినా మూడేళ్లుగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం అసలు నిధులే రావడం లేదు.  

నీటి రవాణాకు నిధులేవీ..

గతంలో వేసవిలో నీరు లేని గ్రామాలకు ట్యాంకర్లతో సరఫరా చేసేవారు. గత మూడేళ్లుగా ఈ నిధులు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నీరు సరఫరా చేసినా చెల్లింపులు లేక అధికారులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని అంటున్నారు. కొన్ని మండలాల్లో ఎక్కడికక్కడ పంచాయతీలే తమకు అందుబాటులో ఉన్న నిధులతో సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు, వేసవి తీవ్రత దృష్ట్యా ఊటనీటిపై ఆధారపడే గ్రామాల్లో సమస్య ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతేడాది పలుగ్రామాల్లో నీరు ఇచ్చేందుకు రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు సీతంపేట ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు.


ప్రణాళిక రూపొందిస్తున్నాం..
- ఒ.ప్రభాకరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఈఈ, పార్వతీపురం మన్యం

సీతంపేట, భామిని మండలాల్లో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు ప్రణాళికను కలెక్టర్‌కు సమర్పిస్తున్నాం. మొత్తం 40 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు రూ.23.90 లక్షలతో ప్రతిపాదనలు చేశాం. ఇవి మంజూరైతే ట్యాంకర్లతో అందజేస్తాం. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు ఈ ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని