logo

రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి

రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్‌బాగ్‌ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.

Published : 29 Apr 2024 05:25 IST

సభలో మాట్లాడుతున్న అశోక్‌గజపతిరాజు, చిత్రంలో అదితి

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్‌బాగ్‌ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. వైకాపా పాలనలో దోపిడీ ఎక్కువై, అభివృద్ధి కుంటుపడిందన్నారు. గత అయిదేళ్లలో లక్షలాదిమంది విద్యార్థులు బడికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిస్తేజంగా మార్చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని కోరారు.

వైకాపాది విధ్వంసం: అదితి

విధ్వంసమే వైకాపా లక్ష్యమని విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు ఆరోపించారు. సీఎం జగన్‌ లేనిది ఉన్నట్లుగా చూపి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. యువత భవిష్యత్తును నాశనం చేసిన చెత్త ప్రభుత్వమని ధ్వజమెత్తారు. వారికి ఉద్యోగాలు కల్పించకుండా మత్తుకు బానిసలుగా చేసి వారి జీవితాలతో ఆడుకుందన్నారు. నాయకులు అవనాపు విజయ్‌, గాడు అప్పారావు, కనకల మురళీ, కాళ్ల గౌరీశంకర్‌, ప్రసాదుల వరప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు.

చట్టం రద్దు: కలిశెట్టి

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపా అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తామని ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం నగరంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడారు. వైకాపా తీసుకొచ్చిన ఈ చట్టంతో రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలు వారి చేతుల్లో ఉంటాయని, కేవలం నకలు మాత్రమే ఇస్తారన్నారు. దీనివల్ల న్యాయస్థానానికి వెళ్లినా హక్కులు ఉండవన్నారు.


గుర్ల మండలం లవిడాంలో పిల్లలతో కాసేపు ముచ్చటించారు తెదేపా విజయనగరం పార్లమెంటరీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా లవిడాంలోని పూరిపాకలో నిర్వహిస్తున్న హోటల్‌లో టిఫిన్‌ చేశారు. అక్కడి పిల్లలతో ముచ్చటిస్తూ.. మీ భవిష్యత్తు కోసం చంద్రబాబునాయుడు తపిస్తున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమన్నారు.

న్యూస్‌టుడే, గరివిడి, గుర్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని