logo

జగన్‌.. ఈ పాపం నీదే

విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి..

Published : 29 Apr 2024 05:35 IST

8 వేల ఎకరాలను ఎండబెట్టేశావ్‌
పెదంకలాం ఆనకట్ట ఆవేదన ఇదీ..

విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. వేలాది మంది రైతులు వాటిల్లో సాగు చేస్తూ కడుపు నింపుకొనేవారు..


ప్రస్తుతం వారంతా కన్నీళ్లు పెడుతున్నారు.. గడిచిన రెండేళ్లుగా శ్రమదానం చేస్తూ నా కాలువలను బాగుచేసుకుంటున్నారు.. అయినా ఫలితం దక్కడం లేదు.. ఆనకట్ట.. కాలువల నిర్వహణకు కేంద్రం నిధులిస్తే పక్కన పెట్టేశావ్‌.. కనీసం పనులు చేయకుండా వేల ఎకరాలను ఎండబెట్టేశావ్‌.. ఈ పాపం నీదే జగన్‌.. కాదంటావా..

మరమ్మతులకు గురైన షట్టర్లు


నాలుగైదేళ్లుగా కష్టాలు..

19వ దశాబ్దంలో పెదంకలాం వద్ద ఆనకట్ట రూపంలో నన్ను నిర్మించారు. రెండు మండలాల పరిధిలోని ప్రధాన గ్రామాలకు సాగునీరు అందించాల్సిన బాధ్యతను నాకు అప్పగించారు. 8,270 ఎకరాల ఆయకట్టును నా భుజాలపై పెట్టారు.. ఈ మేరకు 25 కిలోమీటర్ల మేర కాలువ తవ్వారు. ప్రారంభం నుంచి ఎలాగోలా నీరందిస్తూనే ఉన్నా.. కానీ నాలుగైదేళ్లుగా నిర్వహణ లేకపోవడంతో గండ్లు పడుతున్నాయి.. ఒక్క అధికారి నావైపు చూస్తే ఒట్టు.. పాపం ఆ రైతులే పూడ్చేవారు.. నేటికీ పనులు చేస్తున్నారు.. విరాళాలు వేసుకుని వారి పరిధిలోని కాలువను బాగుచేసుకుంటున్నారు.

బలిజిపేట మండలం పలగరలో రూపుకోల్పోయిన కాలువ

డబ్బులిస్తే ఏం చేశావ్‌..

కాలువకు గండ్లు, ప్రధాన కట్ట వద్ద మరమ్మతులను చూసిన కొందరు అధికారులు నా పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం 2022లో రూ.17.30 కోట్ల జైకా నిధులను మంజూరు చేసింది. వాటితో 25 కిలోమీటర్ల పరిధిలోని కాలువను, ఆనకట్ట పరిధిలో ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఎంతో సంతోషించాను. అదే ఏడాది రూ.14.02 కోట్లకు ఓ గుత్తేదారుడు టెండర్లు పాడుకున్నారు. 16 కిలోమీటర్ల వరకు సిమెంటు లైనింగు, ఆనకట్ట వద్ద మరమ్మతులు, షట్టర్ల మార్పిడి, స్లూయిస్‌ పనులు చేపడతానని చెప్పారు. హమ్మయ్య అనుకున్నా.. కానీ ఈ జగమొండి జగన్‌ నిధులిస్తేగా..

బలిజిపేట మండలం చిలకలపల్లి వద్ద అధ్వానంగా పంట కాలువ


ఓ రైతు వేదన..

పెదంకలాం కాలువ ఆధునికీకరణకు జైకా నిధులిచ్చినా సకాలంలో విడుదల కాక పనులు చేపట్టలేకపోయారు. దీంతో కాలువ అధ్వానంగా మారింది. ఏటా శ్రమదానం చేసుకుని బాగుచేసుకుంటున్నాం. ఖరీఫ్‌ వచ్చే లోగా బాగు చేస్తే మేలు జరుగుతుంది. ఈ ఐదేళ్లూ పట్టించుకోలేదు. నిధులున్నా నిరుపయోగంగా మార్చేశారు’ అని బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన రైతు బలగ సత్యనారాయణ నా పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరికొన్ని రోజులే..

గుత్తేదారు 2022, ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. కిలోమీటరు దూరం వరకు లైనింగ్‌ చేపట్టారు. ఈమేరకు రూ.57 లక్షల వరకు వెచ్చించారు. కానీ నా బాధ పట్టని ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయలేదు. దీంతో నన్ను కనికరించిన కాంట్రాక్టర్‌ వెనక్కి వెళ్లిపోయాడు. ఆయనకు ఇంకా రూ.32 లక్షలు ఇవ్వాలట. ఇంకేముంది నా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నా కాలువ పరిధిలోని మూడో కిలోమీటరు నుంచి 7 వ కిలోమీటరు వరకు గుంతలే దర్శనమిస్తున్నాయి. పలగర, చిలకలపల్లి, వెంగాపురం, పెదపెంకి గ్రామాల పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ పాపం జగన్‌దే అంటున్నా..

న్యూస్‌టుడే, బలిజిపేట


స్పందించలేదట..

పనులు జరిగిన మేరకు బిల్లులు వచ్చేలా సంబంధిత వివరాలు పంపించామని జలవనరుల శాఖ మన్యం జిల్లా డీఈఈ తిరుమలరావు ‘న్యూస్‌టుడే’ ప్రతినిధికి చెప్పారట. ఎన్నికల నేపథ్యంలో పనులు ఆగాయని, పూర్తయ్యాక ప్రారంభిస్తామని వెల్లడించారట. మరి ఇన్నేళ్లూ ఏం చేశారో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని