logo

సర్కారు వారి గూడు పుఠాణి

ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు.

Published : 29 Apr 2024 05:43 IST

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల

పట్టణ పేదల సొంతింటి కల నెరవేరుస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లను పూర్తి చేసి అప్పగిస్తాం.  

ముఖ్యమంత్రి జగన్‌


ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. మరికొన్ని చోట్ల అప్పగించకుండానే బ్యాంకు వాయిదాలు చెల్లించాలని లబ్ధిదారులపై ఒత్తిడి పెంచుతున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంపై వడ్డీలు, వాయిదాల భారం మోయలేక పట్టణ పేదలు లబోదిబోమంటున్నారు.

బొబ్బిలిలో మధ్యలోనే నిలిచిన ఇళ్ల నిర్మాణాలు


ఒక్కటీ ఇవ్వలేదు

తెదేపా హయాంలో బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద 2072 మందికి పక్కా గృహాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో లబ్ధిదారులను గుర్తించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఏజెన్సీని మార్చేశారు. కొన్ని సముదాయాలు అసంపూర్తిగా వదిలేయగా.. మరికొన్ని పూర్తయ్యాయి.
మొత్తం 35 బ్లాకుల్లో 1680 గృహాలు నిర్మించాలి.  ఇందులో 26 బ్లాకుల్లో 1280  సిద్ధం చేశారు. వైకాపా రంగులు పూసి మెరిపించారు. లబ్ధిదారులకు ఇంతవరకు అప్పగించలేదు. ఇంకా తొమ్మిది బ్లాకుల్లో 432 పూర్తి చేయాలి. ఈ పనులు ఐదేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. కొన్ని స్లాబ్‌లు పూర్తికాగా మరికొన్ని పునాదుల్లోనే ఉండిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 392 మంది లబ్ధిదారులకు ఇళ్లు రద్దు చేసింది. వారికి జగనన్న కాలనీల్లో స్థలాలు ఇచ్చారు. అయినా వారు తొలుత ఇంటి కోసం చెల్లించిన రూ.50 వేల నగదును తిరిగి ఇవ్వలేదు. 1280 మంది లబ్ధిదారుల పేరిట  ప్రభుత్వం రుణాలను వాడేసింది. ప్రస్తతం నెలసరి వాయిదాలు చెల్లించాలని మరోవైపు బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు.

బొబ్బిలి: ఇంకా పునాదుల దశలోనే నిర్మాణాలు

మౌలిక వసతులు లేవు ..

టిడ్కో సముదాయాల వద్ద రూ.3.71 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను అధికారులు ఈ ఏడాది మార్చి 6న ప్రారంభించారు. ఇంతవరకు పూర్తయిన ఇళ్లకు సర్వీసులు ఇవ్వలేదు. కాలువలు, రహదారులు, తాగునీరు వంటి పనులకు రూ.7 కోట్లతో టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదు. గోతులు తీసి వదిలేశారు.


అయిదేళ్లు అడుగు పడలేదు

రాజాం, న్యూస్‌టుడే: రాజాం మండలం కంచరాం సమీపంలో తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.59.76 కోట్ల అంచనా వ్యయంతో 1125 నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. రూ.17 కోట్ల వరకూ ఖర్చు చేశారు. మరో రూ.42.76 కోట్లు వెచ్చిస్తే పనులు పూర్తయి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో  అందేవి. కొంత వరకూ పూర్తయిన (365, 430 అడుగుల విస్తీర్ణం) 240 ఇళ్లను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వీరంతా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కొంత మేర చెల్లింపులు సైతం చేశారు. పూర్తిస్థాయిలో వసతులను సమకూర్చి వీటిని పూర్తిచేసి ఇంటి తాళాలను అందించాలి. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నిలిపేసింది. రీటెండర్లు పిలిచి పూర్తిచేస్తామని చెప్పి అయిదేళ్లు కావస్తున్నా వాటి జోలికి వెళ్లలేదు. గడువు మీరడంతో ఈఎంఐలు చెల్లించాలని లబ్ధిదారులపై బ్యాంకర్లు ఒత్తిడి పెంచుతున్నారు.


సౌకర్యాల లేమి..

సోనియానగర్‌లో పూర్తికాని విద్యుత్తు పనులు

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని సారిపల్లి, సోనియానగర్‌లో లబ్ధిదారులకు  ఎట్టకేలకు టిడ్కో గృహాలను అప్పగించారు. అయితే ఇంకా వాటిల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సారిపల్లిలో కొందరు నివాసం ఉంటుండగా, సోనియానగర్‌లో పనులు పూర్తికాక ఇంకా దిగలేదు. ఈ రెండు ప్రాంతాల్లో ఆరేళ్ల క్రితం నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటివరకు 3776 మందికి గృహాలిచ్చారు.

నివాసముంటున్నా..

సారిపల్లిలో సుమారు 200 వరకు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ విద్యుత్తు సమస్య వేధిస్తోంది. పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. కొన్నింటికి ఇళ్ల పైకప్పుల నుంచి నీరు కిందకు దిగుతోంది. కొన్ని బ్లాకుల్లో మాత్రమే సిమెంటు రోడ్లు వేశారు. ఇంకా 60 శాతం మేర రోడ్లు వేయాలి. కొన్నిచోట్ల కాలువలు అవసరం. సోనియానగర్‌లో విద్యుత్తు పనులు పూర్తికాలేదు. నీటి సమస్య వెంటాడుతోంది.


మొండి గోడలే దర్శనం

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: నెల్లిమర్ల నగర పంచాయతీలో తెదేపా హయాంలో 2,252 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. తర్వాత 720 మందికి  కుదించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే 576 మందికి  తగ్గించారు. ఇప్పటికీ ఇళ్లు ఇవ్వలేదు. మొదట్లో 821 మంది లబ్ధిదారులు వివిధ కేటగిరీల్లో సుమారు రూ.3.41 కోట్ల నగదును ప్రభుత్వానికి చెల్లించారు. ఇళ్లు రద్దు చేసిన వారికి రూ.2.15 కోట్లు చెల్లించాల్సి ఉంది.

సౌకర్యాలు లేకుండా ఎలా..: ఇళ్లు నిర్మించాం. వెళ్లిపోమని మాపై ఒత్తిడి తెచ్చారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఏ సదుపాయాలు లేవు. తాగడానికి మంచినీరు లేదు. మురుగునీరు పోయే మార్గం లేదు. అడవిలో నివసించినట్లుగా ఉంటుంది. అందుకే సౌకర్యాలు కల్పించాక వెళ్తామని చెప్పాం. విద్యుత్తు సదుపాయం కూడా లేదు.

ఓ లబ్ధిదారురాలు, బొబ్బిలి  

  • మొత్తం మంజూరైన  ఇళ్లు: 8,048
  • లబ్ధిదారులకు అప్పగించినవి: 4,832
  • వివిధ దశల్లో ఉన్నవి: 3,216
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని