logo

పసివారి పైనా పాలకుడి పడగ

పసి వారిపైనా ముఖ్యమంత్రి జగన్‌ పగబట్టారు. ఆయన నిర్ణయంతో ఈ భావి సంపద నీరుగారిపోతోంది. ‘పది రూపాయలు’ మిగుల్చుకుందామని అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు.

Published : 23 Apr 2024 05:00 IST

 డబ్బుల కోసం విలీనం కుట్ర  ‌
నాణ్యత లేని పౌష్టికాహారం అందజేత 
 అంగన్‌వాడీల ఉసురుతీసిన జగన్‌

 న్యూస్‌టుడే, కనిగిరి, పీసీ పల్లి, హనుమంతునిపాడు : పసి వారిపైనా ముఖ్యమంత్రి జగన్‌ పగబట్టారు. ఆయన నిర్ణయంతో ఈ భావి సంపద నీరుగారిపోతోంది. ‘పది రూపాయలు’ మిగుల్చుకుందామని అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. ఇవి చాలవన్నట్లు దూరాభారం..నాణ్యత లేని ఆహారం అందివ్వడంపై మాతృ హృదయాలు వేదన చెందుతున్నాయి. వసతుల్లేని అద్దె భవనాలు కావడంతో అందులోనే చిన్నారులు మగ్గిపోతున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలు కార్పొరేట్‌ విద్యాలయాల్లా తీర్చుదిద్దుతామని, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని, బలవర్థకమైన ఆహారం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌ హామీలు గాలిలో కలిసిపోయాయి. కనిగిరి పరిధిలోని కనిగిరి, వెలిగండ్ల ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఆరేళ్ల లోపు చిన్నారులు 17 వేల మంది, గర్భిణులు 1800 మంది, బాలింతలు ఇరవై రెండొందల మంది ఉన్నారు. అక్కడి అధికశాతం అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాలు నడుస్తున్నాయి. వాటికి సరఫరా చేసే పౌష్టికాహారం కిట్లు నాసిరకంగా ఉండటంతో బాలింతలు, చిన్నారులు, గర్భిణులకు ఆరోగ్యపర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ధరలు పెరిగి.. ఇచ్చే నగదు చాలక: గ్యాస్‌ సిలిండర్‌కు ప్రభుత్వం ఇచ్చే నగదు సరిపోకపోవడంతో తమకు ఇబ్బంది మారిందని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. కూరగాయలు, ఆకు కూరల ధరలు పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే నగదు సరిపోవడం లేదు. కనిగిరి పరిధిలోని భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కొన్నిచోట్ల స్థలాలు కేటాయించి, నిర్మాణాలు ప్రారంభించినా అవి కాస్తా మధ్యలోనే నిలిచిపోయాయి.

జీతాలు పెంచాలని రోడ్డెక్కినా..

జీతాలు పెంచాలని తాము ధర్నాలు చేసినా పాలకులకు ఉలుకు పలుకు లేదని కార్యకర్తలు వాపోయారు. ఎప్పుడో నాలుగు, అయిదు నెలలుకు ఇస్తే తాము ఎలా నిర్వహించగలమని వారంటున్నారు. విద్యార్థికిచ్చే డబ్బులు సరిపోవడం లేదు. అన్ని రేట్లు పెరిగినా ఆ మేరకు వీటి బడ్జెట్‌ పెంచడం లేదని ఆవేదన చెందుతున్నారు.

30 గ్రాముల గుడ్లే గతి

కనిగిరి, దర్శి ప్రాంతాల్లోని వారికి అందించే గుడ్లు గోళీ కాయ సైజులో ఉంటున్నాయి. వాస్తవంగా 50 గ్రాములు ఉండాల్సినవి కేవలం 30 గ్రాములే ఉండటం గమనార్హం. అదేవిధంగా బెల్లం, పప్పుచెక్క, ఖర్జూరం, రాగిపిండి, అటుకులు కూడా నాసిరకంగా ఉంటున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దె భవానాల్లో ఉండే కేంద్రాలకు ప్రభుత్వం నెల నెలా సకాలంలో అద్దె చెల్లించడం లేదని, దీంతో తాము సొంత నిధులు ముందుగా చెల్లించాల్సి వస్తోందని కార్యకర్తలు వాపోతున్నారు.

ముండ్లమూరు: దర్శి నియోజకవర్గంలో అంగన్‌వాడీ కేంద్రాలలో పాలు సరఫరా కాకపోవడంతో పంపిణీ చేయడంలేదు. నాణ్యత లేని..మురిగిపోయిన గుడ్లు అందజేస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ముండ్లమూరు మండలం పసుసుపుగల్లు అంగన్‌వాడీ కేంద్రం దూరంగా ఉందని గ్రామంలోని రాళ్లపల్లిలో ఉంటున్న ఇద్దరు చిన్నారులను కేంద్రాలకు పంపించడంలేదు. అదేవిధంగా రెడ్డినగర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాథమిక  పాఠశాలలో ఓ గదిలో ఏర్పాటు చేయడంతో అక్కడికి పంపేందుకు తల్లులు విముఖత చూపుతున్నారు.


కోదండరామాపురంలో నిలిచిపోయిన అంగన్‌వాడీ కేంద్రం

155 కేంద్రాలకు మంగళం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ నూతన విద్యావిధానం అమలు అంటూ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడం పసివారికి శరాఘాతంగా మారింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో 21 ప్రాజెక్టులుండగా, వాటి పరిధిలో మొత్తం 4,244 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, వాటిని సమీప ప్రాథమిక పాఠశాలలకు మ్యాపింగ్‌ చేశారు. 2022లో జిల్లాల విభజనకు ముందుగా 155 అంగన్‌వాడీ కేంద్రాలను సమీప ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేశారు. ఐసీడీఎస్‌ గణాంకాల ప్రకారం జిల్లాలో 3-6 సంవత్సరాల వయస్సులోపు 85 వేల మంది పిల్లలున్నారు.  

అరకొర వసతుల మధ్య 1,824 కేంద్రాలు

జిల్లావ్యాప్తంగా 1,824 కేంద్రాలను ఏళ్ల తరబడి అరకొర వసతుల నడుమ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. మరో 963 కేంద్రాలను గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన సామాజిక భవనాలు, పాఠశాల భవనాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1,457 కేంద్రాలను శాశ్వత ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తుండగా, అందులో 675 కేంద్రాలు పాఠశాలల సముదాయంలోనే ఉన్నాయి. తొలివిడతగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కిలోమీటరు దూరంలోపే ఉన్న వాటిని విలీనం చేశారు. వాటిలోనూ ఎక్కువగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నవే ఉన్నాయి.

నిండు గర్భిణి అయినా..

బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ముఖ ఆధారిత యాప్‌ తప్పనిసరి. దీంతో సదరు లబ్ధిదారులు కేంద్రానికి వెళ్తేనే పౌష్టికాహారం ఇవ్వనున్నారు. నిండు నెలల గర్భిణి లేదా సిజేరియన్‌ అయినా బాలింతలు కేంద్రాలకు వెళ్లడం క్లిష్టంగా మారింది. ఈ మేరకు వారు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు.

రెడ్డినగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో తక్కువగా ఉన్న పిల్లలు

డబ్బులు మిగుల్చుకునేందుకు..

విలీన ప్రక్రియ ద్వారా ప్రభుత్వం డబ్బులు మిగుల్చుకునే ఉద్దేశంతో విలీనం కుట్రకు తెరలేపింది. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఆయా తరగతి గదులను అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు సర్దుబాటు చేశారు. కొన్నిచోట్ల రెండు కేంద్రాలను ఒకటిగా చేశారు. దీంతో దూరంలో ఉన్న కేంద్రానికి చిన్న పిల్లలను తీసుకెళ్లడం మాతృమూర్తులకు పెనుభారంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని