logo

గుండ్లకమ్మలో ఇసుక తోడేళ్లు

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా వైకాపా నాయకుల ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. పైపెచ్చు... గుండ్లకమ్మ పరిధిలో యంత్రాలతో మరింతగా తోడేస్తున్నారు. అధికారులకు సమాచారం ఉన్నా... అటుగా వెళ్లి హెచ్చించిన దాఖాలాలు సైతం లేకపోవడం గమనార్హం.

Published : 28 Apr 2024 04:23 IST

జలాశయాన్ని తొలిచేస్తున్న అక్రమార్కులు

తవ్వకాలతో ఏర్పడిన ఓ గుంతలో చేరిన నీరు

న్యూస్‌టుడే - మద్దిపాడు, సంతనూలతపాడు: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా వైకాపా నాయకుల ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. పైపెచ్చు... గుండ్లకమ్మ పరిధిలో యంత్రాలతో మరింతగా తోడేస్తున్నారు. అధికారులకు సమాచారం ఉన్నా... అటుగా వెళ్లి హెచ్చించిన దాఖాలాలు సైతం లేకపోవడం గమనార్హం.

మరింతగా తోడేస్తున్నారు... : గుండ్లకమ్మ జలాశయం పరిసరాలతో పాటు... ఆ పరిధిలోని మల్లవరం, కొలసనకోట, వెల్లంపల్లి, నందిపాడు, ఇనమనమెళ్లూరు తదితర గ్రామాల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అన్ని చోట్లా అధికారపార్టీ నాయకులే దందా సాగిస్తున్నారు. భారీ పొక్లెయిన్లతో బాహాటంగానే తవ్వకాలు సాగిస్తున్నా... అధికారులకు అంతా తెలిసినా పట్టించుకోవడం లేదు. గేట్లు కొట్టుకుపోయి జలాశయం ఖాళీ అవ్వడంతో మరింతగా ఇసుక తోడేస్తున్నారు. ఇందుకోసమే కొత్త గేట్లు పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. సంతనూతలపాడు మండలం మద్దులూరు సమీపంలోని ముసి వాగులోనూ జేసీబీలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు తరలుతున్నాయి.

దూరాన్ని బట్టి ధర... : మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ దొరికే ఇసుక నాణ్యమైనది కావడంతో డిమాండ్‌ ఎక్కువ. అందుకు అనుగుణంగానే అక్రమార్కులు ధరలు వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి ట్రక్కు ఇసుకకు రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. దూరం పెరిగితే ధర మరింత పెంచేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు... వందల ట్రిప్పులు రవాణా సాగిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక మార్గాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. తవ్వకాల కారణంగా ఎక్కడికక్కడ భారీ గుంతలు ఏర్పడడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు