logo

‘నా.. నా’లుక వరకే మీరు

‘నా ఎస్సీలు... నా ఎస్టీలు’ అంటూ మైకులు పగిలేలా మాటలు చెప్పే జగన్‌.. చేతల్లో ఆయా వర్గాలకు తీరని ద్రోహం చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని వేదికలపై పలుకుతూ.. తన అయిదేళ్ల పాలనలో వారి బతుకులనే సంక్షోభంలో పడేశారు.

Updated : 28 Apr 2024 05:40 IST

సంక్షేమమంటూ సంక్షోభంలోకి నెట్టారు
నిధుల్లేక ఉత్తుత్తిగా మిగిలిన కార్పొరేషన్లు
ఎస్సీలను దగా చేస్తున్న జగన్‌

‘నా ఎస్సీలు... నా ఎస్టీలు’ అంటూ మైకులు పగిలేలా మాటలు చెప్పే జగన్‌.. చేతల్లో ఆయా వర్గాలకు తీరని ద్రోహం చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని వేదికలపై పలుకుతూ.. తన అయిదేళ్ల పాలనలో వారి బతుకులనే సంక్షోభంలో పడేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీల జీవనోపాధి మెరుగుకు వివిధ పథకాల ద్వారా చేయూతనిచ్చేందుకు రాజ్యాంగ బద్ధంగా కార్పొరేషన్లనూ దిష్టిబొమ్మలుగా మార్చారు. గతంలో అమలు చేసిన పథకాలకూ మంగళం పాడారు. బటన్‌ నొక్కానంటూ ఉత్తుత్తి మాటలు చెబుతూ.. వారి స్వయం ఉపాధికి పాడి కట్టారు. చదువులు, భూ కొనుగోలు, శిక్షణ తరగతులను రద్దు చేశారు.  కాలనీల్లో మౌలిక వసతులూ కల్పించడం లేదు.

ఏటా వెయ్యి మంది చదువులపై వేటు...

ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్‌ పథకం ఉంది. కోరుకున్న చోట ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివేందుకు అవకాశం ఉంటుంది. తెదేపా ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య జిల్లాకు చెందిన సుమారు అయిదు వేల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడంతో ఏటా 1,000 మంది విద్యార్థులు కార్పొరేట్‌ విద్యకు దూరమయ్యారు.

పేరు మార్చేసి..  కత్తెరేసి...

జిల్లా నుంచి విదేశీ విద్య అభ్యసించే వారి సంఖ్య పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం కింద 15 దేశాల్లో కోరుకున్న చోట ఉన్నత విద్యను అభ్యసించేందుకు సుమారు 40 మంది విద్యార్థులకు ఆర్థికసాయం అందించారు. జగన్‌ కొలువుదీరాక మూడేళ్లపాటు అమలు చేయలేదు. ఆ తర్వాత జగనన్న విదేశీ విద్య అని పేరు మార్చారు. దీనిపై ప్రతిపక్షాలతో పాటు, దళితులు ఆందోళన చేపట్టినా వెనక్కి తగ్గలేదు. పైగా క్యూఎస్‌ ర్యాంకింగ్‌ టాప్‌-200లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందినవారికే సాయం అంటూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయం చేశారు.

దుప్పట్లు ఇచ్చింది లేదు...

3 నుంచి 10వ తరగతి వరకు చదివే ఎస్సీ విద్యార్థులకు జిల్లాలో 61 వసతి గృహాలున్నాయి. వీటిలో 21 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కళాశాల విద్యార్థులకు చెందిన మరో 20 వసతిగృహాల్లో 13 అద్దె భవనాలే దిక్కు. మౌలిక వసతుల నిమిత్తం నాడు- నేడు కింద ప్రతిపాదించినా ఇంతవరకు పనులు ప్రారంభించనే లేదు. ప్రవేశాల సమయంలోనే దుప్పట్లు, దోమతెరలు ఇవ్వాల్సి ఉన్నా చలికాలంలో అరకొరగా పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఆరు నెలలుగా డైట్‌, కాస్మోటిక్‌ ఛార్జీల బకాయిలు చెల్లించలేదు. ఆఖరికి వంటకు సరిపడా గ్యాస్‌ కూడా సరఫరా చేయడం లేదు.

పాత యూనిట్లకే కొత్తగా రంగులు...

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకు తొలి విడతగా మండలానికి ఒక్కో యూనిట్‌ కింద ట్రాక్టర్‌, డ్రైన్‌ క్లీనింగ్‌ యంత్రం మంజూరు చేశారు. అందుకు గత ప్రభుత్వ హయాంలోనే కొందరు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయగా, ఆ తర్వాత 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో నిలిచిపోయింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంపిణీ ఆపేయడంతో సదరు వాహనాలు ప్రగతి భవన్‌ ఆవరణలోనే ఉండిపోయాయి. వైకాపా వచ్చాక 2022 ఏప్రిల్‌లో కొత్తగా పది మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పాత యూనిట్లకు కొత్తగా రంగులేసి ఇచ్చారు.

కార్లంటూ రెండేళ్లుగా కబుర్లు...

జాతీయ షెడ్యూల్‌్్డ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) సహకారంతో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా జిల్లాకు 11 ఇన్నోవా కార్లు కేటాయించారు. అందుకు సుమారు 400 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి 2022 జనవరిలో ఒంగోలు టీటీడీసీ కార్యాలయంలో సంబంధిత అధికారులు ముఖాముఖి నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక చేపట్టి రెండేళ్లు దాటినా ఇంతవరకు కార్ల ఊసేలేదు.

స్వయం ఉపాధికీ తూట్లు...

తెదేపా ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి పైగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 50 శాతం వరకు రాయితీ రుణాలు పొందారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 20 వేల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ముఖాముఖి నిర్వహించి మూలకు నెట్టేశారు. యూనిట్ల మంజూరు ఊసేలేదు.

  • తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం కింద 35 శాతం రాయితీపై సుమారు 500 మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పలు రకాల కార్లు, ఆటోలు మంజూరు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆయా వర్గాలకు ఇంతవరకు ఒక్క యూనిట్‌ కూడా మంజూరు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని