logo

అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం

అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..

Published : 29 Apr 2024 02:42 IST

లోయ గ్రామాలకు అందని వైద్య సేవలు
దాత సాయంతో నడుస్తున్న వాహనం

టైరు పంక్చర్‌ అవడంతో కంభంలో వేయిస్తున్న దృశ్యం

అర్థవీడు, న్యూస్‌టుడే: అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..ఆసుపత్రులకు తరలించాలన్న ప్రయివేటు వాహనాలే గతైంది. ఈ పరిస్థితి నుంచి లోయ ప్రజలను గట్టేక్కించేందుకు అయిదేళ్లుగా నేస్తం ఫౌండేషన్‌ సభ్యుల సహకారానికి అధికార ప్రభుత్వం నీరుగార్చింది. దాతల సహకారంతో ఉచిత అత్యవసర వాహనం లోయ గ్రామాలకు సమకూరుస్తాం..దాన్ని ప్రభుత్వం నడిపించేలా సహకరించండంటూ..వైకాపా నాయకులు, వైద్య అధికారుల వెంట అయిదేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోక పోవడం గమనార్హం. ‌్ర అర్థవీడు మండల కేంద్రం నుంచి వెలగలపాయ లోయ గ్రామాలకు అత్యవసర వాహనం వెళ్లాలంటే పోనూరానూ..సుమారు 150 కిలోమీటర్ల దూరం ఉంది. రాకపోకలకు సుమారు గంటన్నర సమయం పడుతుంది. ఇలాంటి తరుణంలో అత్యవసర వైద్యం అందాలంటే రోగుల ప్రాణాలు గాల్లో పోతాయి. అంతేకాక లోయలోని తొమ్మిది గ్రామాల్లో చరవాణి సిగ్నల్‌ కూడా లేదు. ప్రమాదాలు చోటు చేసుకున్న అక్కడ నుంచి సరైన సమయంలో సమాచారం అందదు. ఇతంటి దుర్భర పరిస్థితిలో యాచవరం గ్రామానికి చెందిన నేస్తం ఫౌండేషన్‌ సభ్యులు బోయపాటి రవితేజ దాత సాయంతో అత్యవసర వాహనం లోయ పల్లెల వినియోగానికి ఉచితంగా అందిస్తాం..దాన్ని ప్రభుత్వం ఆధీనంలో ప్రజలకు సేవలు అందేలా చూడాలంటూ..నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రుల దృష్టికి, స్పందన కాల్‌ సెంటర్‌ ద్వార తెలియపరిచినా ఫలితం లేదన్నారు. జిల్లా వైద్యశాఖ అధికారులను సైతం పలుమార్లు కలసినా స్పందించలేదన్నారు. ‌్ర అర్థవీడుకు కేటాయించిన అత్యవసర వాహనం ఒక్కసారి లోయకు వెళ్లిందంటే మండల కేంద్రం వైపు పల్లెల్లో ఏ ప్రమాదం సంభంవించినా కనుచూపు మేర కనపడదు. పక్క మండలాల నుంచి మరో వాహనం వచ్చేంత వరకు ఎక్కడి రోగులు అక్కడే గడపాలి. వాహనానికి చిన్నపాటి మరమ్మతులు, చక్రాలు పంక్చర్‌ అయినా పక్క మండలం కంభానికి వెళ్లాల్సిందే. ప్రజల సేవలకంటే వాహన మరమ్మతులకే సిబ్బంది ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. వాహనం ఎక్కడికి వెళ్లినా తిరిగి అర్థవీడు పీహెచ్‌సీలో ఉంచాలన్న నిబంధనలతో లోయ గ్రామాలకు దూరభారంగా మారిపోయింది.

అయిదేళ్లుగా తిరిగాం..

దాతల సహకారంతో లోయ గ్రామాలకు మా ఫౌండేషన్‌ తరపున ఉచితంగా అత్యవసర వాహనం ఇస్తామని నియోజకవర్గ పాలకులు, అధికారుల చుట్టూర అయిదేళ్లుగా తిరిగినా ఎవరూ స్పందించలేదు. లోయ పల్లెల్లో ఎలాంటి ప్రమాదం జరిగినా అత్యవసర వాహనాలు సకాలంలో రావు. దీంతో ఆటోల్లో..ద్విచక్ర వాహనాల్లో ఆసుపత్రులకు తరలించడం షరా మాములైంది.

బోయపాటి రవితేజ, నేస్తం ఫౌండేషన్‌, యాచవరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని