logo

తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు

సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

Published : 29 Apr 2024 02:49 IST

అక్క కుటుంబ వివాదంలో తమ్ముడి హతం

రాజా వెంకటేష్‌  మృతదేహం

దర్శి, న్యూస్‌టుడే: సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..తర్లుపాడు మండలం పోతలపాడుకు చెందిన రాజా వెంకటేష్‌ (19) శనివారం దర్శి మండలం రాజంపల్లిలో నివాసముంటున్న తన సోదరి విజయ వద్దకు వెళ్లాడు. వెంకటేష్‌ పెద్దమ్మ తిరుపతమ్మ గ్రామంలోనే ఉంటున్నారు. ఆమె కుమార్తె వెంకట రమణకు, అల్లుడు దేవరకొండ వెంకటేశ్వర్లుకు మధ్య గత కొంతకాలంగా కుటుంబ తగాదాలు నడుస్తున్నాయి. దీంతో కుమార్తె తల్లి వద్దే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భార్యను తనతో పాటు తీసుకెళ్లేందుకు వెంకటేశ్వర్లు ఆదివారం మూడు వాహనాల్లో 30 మందితో రాజంపల్లి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్‌ పెద్దమ్మ వారింటికి వెళ్లాడు. అక్కడ అప్పటికే గొడవ జరుగుతుండటంతో సర్ది చెప్పేందుకు వెళ్లిన వెంకటేష్‌పై అక్కడికి వచ్చిన వ్యక్తుల్లో ఒకరు కత్తితో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకోబోయిన తిరుపతమ్మపై కూడా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సీఐ సమీముల్లా, ఎస్సై సుమన్‌ సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. మృతుని సోదరి విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కత్తితో దాడిచేసిన వ్యక్తి పరారు కాగా, అక్కడున్న కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వచ్చిన వారిలో ఓ న్యాయవాది కూడా ఉన్నట్లు తెలిసింది.


హోమశాల అగ్నికి ఆహుతి

హోమశాల నుంచి ఎగసిపడుతున్న మంటలు

కంభం (రాచర్ల), న్యూస్‌టుడే : రాచర్ల మండలం సోమిదేవిపల్లి గ్రామంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ పూజల కోసం ఏర్పాటు చేసిన హోమశాల అగ్నికి ఆహుతైంది. తాటాకు మట్టలతో వేసిన పందిరికి ఆదివారం మధ్యాహ్నం వేళ ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. అగ్ని కీలలు వ్యాపించడంతో అక్కడున్న అర్చకులు పరుగు పరుగున బయటకు వచ్చారు. పందిరిలో ఉన్న సామగ్రి, మైక్‌సెట్‌, లౌడ్‌ స్పీకర్లు, తదితరు వస్తువులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంతో రూ.లక్ష ఆస్తినష్టం సంభవించిందని స్థానికులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని