logo

69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది.

Published : 29 Apr 2024 03:08 IST

వైకాపా కుట్రలకు ప్రతిపక్షాల అడ్డుకట్ట
జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు ఊరట

కనిగిరి: కాశిరెడ్డి నగర్‌ సచివాలయం వద్ద నిరీక్షిస్తున్న వృద్ధులు
(పాత చిత్రం)

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. ప్రత్యామ్నాయంగా ఉద్యోగులతో వారికి ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని ఆదేశించింది. ఎన్డీఏ కూటమి ఇదంతా చేసిందన్న భావన లబ్ధిదారుల్లో కల్పించాలనే కుట్రతో వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముగింట రాజకీయ నాటకం నడిపింది. అందులో భాగంగా గత నెల సచివాలయాల వద్దనే పంపిణీ చేశారు.

 ప్రశ్నలతో కదిలిన ఈసీ...: తాజాగా జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం బయటకు రావాలంటే వడదెబ్బ బారిన పడతామేమోనని భయపడుతున్నారు. అవసరమైతేనే బయటకు రావాలంటూ విపత్తుల సంస్థ కూడా ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో పింఛను లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాల వద్దకొచ్చి ఎలా తీసుకోగలరని గత రెండు రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాయి. సచివాలయ సిబ్బందితో ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి విన్నవించాయి. దీంతో వైకాపా ప్రభుత్వ కుట్రలకు తెర పడింది. బ్యాంక్‌ ఖాతాలకు నగదు జమ చేయనున్నారు. తద్వారా వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఊరట కలిగింది. ఖాతాలు లేని వారితో పాటు, విభిన్న ప్రతిభావంతులు, ఆరోగ్య సమస్యలున్న వారికి మే 1 నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్దే అందించనున్నారు. ఈ విషయమై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆదివారం వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, డీఆర్డీఏ పీడీ వసుంధర హాజరయ్యారు.
జిల్లా అధికారులకు వివరాల అందజేత...: జిల్లా వ్యాప్తంగా 719 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో అన్ని విభాగాల కింద మే నెలకు మొత్తం 2,92,525 పింఛన్లుండగా, అందుకు సుమారు రూ.97 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. జిల్లాలో ఇప్పటికే పింఛను పొందుతున్న 2,22,607 మందికి ఆధార్‌ అనుసంధానంతో బ్యాంక్‌ ఖాతా ఉన్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ గుర్తించింది. అందుకు సంబంధించి వివరాలను ఆదివారం డీఆర్డీఏకు అందించారు. సదరు లబ్ధిదారులకు ఇతర ప్రభుత్వ పథకాల తరహాలోనే మే 1న డీబీటీ విధానం ద్వారా బ్యాంక్‌ ఖాతాకు జమ చేయనున్నారు. మిగిలిన 69,918 మందికి సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దే ఇవ్వనున్నారు.


పండుటాకులతో వికృత ఆటలు...

గత నెలలో 3 నుంచి 6వ తేదీ వరకు పింఛను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులు ఉదయం 7 గంటలకే సచివాలయాల వద్దకు చేరుకున్నారు. స్థానికంగా నివాసం ఉండని ఉద్యోగులు మాత్రం ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. వారు వచ్చే వరకు పలువురు అక్కడే నిరీక్షించారు. పంపిణీలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. ఈ క్రమంలో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు ఎండకు ఇబ్బంది పడ్డారు. వారికి స్థానికంగా నీడ, తాగునీరు వంటి సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని