logo

కాలనీలు కాదు.. జగనన్న కహానీలు

మేము కట్టేది కాలనీలు కాదు ఊళ్లు అని సీఎం జగన్‌ ఇళ్ల పట్టాల పంపిణీ సభల్లో గొప్పలు చెప్పారు. అయిదేళ్లలో చాలమంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు.

Updated : 23 Apr 2024 05:09 IST

రాజ్యమేలుతున్న సమస్యలు
అసౌకర్యాలతో నిర్మాణానికి ఆసక్తి చూపని లబ్ధిదారులు

మేము కట్టేది కాలనీలు కాదు ఊళ్లు అని సీఎం జగన్‌ ఇళ్ల పట్టాల పంపిణీ సభల్లో గొప్పలు చెప్పారు. అయిదేళ్లలో చాలమంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఆయన చెప్పిన ఊళ్లు ఎలా ఉన్నాయోనని పరిశీలిస్తే.. ఊరు కాదు కదా కనీస వసతులు లేని లేఅవుట్లు కనిపించాయి. శివారులో, కొండ సమీపంలో, గెడ్డకు దగ్గరగా.. సౌకర్యాల కల్పనకు అవకాశం లేని ప్రదేశాల్లో స్థలాలు ఇచ్చేయడంతో కట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఆయా ప్రాంతాలకు నిర్మాణ సామగ్రి తరలించే సరికి పెనుభారంగా మారుతోందని చెబుతున్నారు. అష్టకష్టాలు పడి కొంతమంది పునాదులు వేసి చేతులెత్తేసిన పరిస్థితులు సైతం ఉన్నాయి. లేఅవుట్లలో మట్టి రోడ్లు, దీపాలు లేని వీధులు, బోర్లు వేయని స్థలాలు వెక్కిరిస్తున్నాయి.

న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం, ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం గ్రామీణం, పలాస, మందస, పలాస గ్రామీణం


మట్టి రోడ్లు.. దీపాలు లేని వీధులు

రామకృష్ణాపురంలో అసంపూర్తిగా

పలాస నియోజకవర్గంలో పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని 9856 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 4855 మంది అర్హులు నిర్మాణానికి నానా పాట్లు పడుతున్నారు. పలాస మండలం రామకృష్ణాపురంలో మట్టిరోడ్లు దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల కాలువ నిర్మాణాలు జరగకపోవడంతోపాటు వీధి దీపాలు అమర్చడం లేదు. పైపులైన్లు పూర్తి కాలేదు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.


కట్టేందుకు వెనకడుగు

లొద్దపుట్టి లేఅవుట్‌లో ఇదీ పరిస్థితి

ఇచ్ఛాపురం మండలంలోని లొద్దపుట్టిలో జగనన్న కాలనీలో మొత్తం 114 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వగా ఇప్పటి వరకు కేలవం 50 మంది మాత్రమే ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేశారు. లోతట్టు ప్రాంతం కావడం, ఇళ్లు నిర్మాణాలకు అనువుగా లేకపోవడంతో చాలా మంది అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు.


మౌలిక సౌకర్యాలేవి..?

మందస మండలం హరిపురానికి సంబంధించి రెండు కిలోమీటర్ల దూరంలోని నోతువార వద్ద జగనన్న కాలనీకి లేఅవుట్‌ వేశారు. ఇప్పటి వరకు విద్యుత్తు సౌకర్యం మినహా మరే వసతులు లేవు బోరు తీయలేదు. సిమెంటు రోడ్లు, కాలువల ఏర్పాటు లేదు.


ఇదేనండీ రోడ్డు

కనీస రహదారి సౌకర్యానికి నోచుకోని ఇచ్ఛాపురం జగనన్న కాలనీ

ఇచ్ఛాపురంలో 2867 ఇళ్లు మంజూరు అయ్యాయి. వేర్వేరు చోట్ల లబ్ధిదారులు స్థలాలు కేటాయించారు. డిగ్రీకళాశాల పక్కనే, రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే ఇళ్ల పనులు జరుగుతుండగా మిగతా ప్రాంతాలు కొండకు దగ్గరల్లో, దూర ప్రాంతాల్లో కేటాయించడంతో నిర్మాణ సామగ్రి తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చు తడిసి మోపెడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలల్లో ఇళ్లు మంజూరు అయితే కేవలం 148 మాత్రమే ఇప్పటి వరకూ పూర్తయ్యాయి.


డ్రైనేజీలు ఎక్కడ?

పలాస మండలంలోని మామిడిమెట్టు, చిన్న మామిడిమెట్టు, రంగోయి, గురుదాసుపురం, చిన్నగురుదాసుపురం, సున్నాదేవి, చిన్న సున్నాదేవి, రామకృష్ణాపురం గ్రామాల ప్రజలకు....మామిడిమెట్టు లే అవుట్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ గ్రామాల నుంచి 38 మంది లబ్ధిదారులున్నారు. ఇక్కడికి చేరుకునేందుకు రహదారులు లేవు. అష్టకష్టాలు పడుతున్నారు.


గుత్తేదారుకు అప్పగింత

ఇల్లు కట్టలేక, మధ్యలో వదల్లేక, అసౌకర్యాల నడుమ అవస్థలు పడలేక గుత్తేదారుకు అప్పగించేశాం. ఇక్కడ చూస్తే, వీధి దీపాలు తప్ప ఏ సౌకర్యం లేదు.

పి.జ్యోతి, ఇచ్ఛాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని