logo

దేవుడా.. ఇదేం పాలన..?

నోరెత్తితే దేవుడి పేరు పలికే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అయిదేళ్ల పాలనలో ఆ భగవంతుడి ఆలనాపాలన సైతం పట్టించుకోలేదు..

Published : 03 May 2024 04:36 IST

నోరెత్తితే దేవుడి పేరు పలికే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అయిదేళ్ల పాలనలో ఆ భగవంతుడి ఆలనాపాలన సైతం పట్టించుకోలేదు.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత  ఆధ్యాత్మికతకు ఆలవాలమైన సిక్కోలులో దేవాలయాల అభివృద్ధిని సైతం గాలికొదిలేసింది. కనికట్టు మాటలతో కాలం గడిపేసిన పాలకులు అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం క్షేత్రాల ప్రగతిని పక్కన పెట్టేశారు. చాలా చేసేశాం అంటూ ఊదరగొడుతున్న నాయకులకు కనీసం సౌకర్యాల్లేక భక్తులు పడుతున్న ఇబ్బందులు కనిపించకపోవడం బాధాకరం.

 న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, గార, జలుమూరు

అరసవల్లిలో అభివృద్ధికి నోచుకోని ఇంద్రపుష్కరిణి

శ్రీకూర్మనాథ క్షేత్రంపై శీతకన్ను

గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రం పాలకుల ఆదరణకు నోచుకోలేదు. అష్టతీర్థాలతో పంచలింగ క్షేత్రంగా వంశధార - నాగావళి - సముద్రం మధ్య త్రిభుజాకార ప్రాంతంలో కొలువైన ఆలయం అభివృద్ధికి దూరంగా మగ్గిపోతోంది. వైకాపా అధికారంలోకి రాకముందు క్షేత్రం రూపురేఖలు మారుస్తామని పాలకులు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. రెండేళ్ల పాటు పాలకమండలి కొలువుదీరినా ఒక్క అదనపు సౌకర్యమూ కల్పించలేకపోయింది. నిత్యం వందల సంఖ్యలో భక్తుల తరలివచ్చే ఈ ఆలయంలో ప్రస్తుతం దాతలు సహకారంతో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం మినహా మరో సౌకర్యం కనిపించదు. దేవస్థానం అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం గమనార్హం.

ఎన్నెన్నో అవాంతరాలు..

  •  పుణ్యస్నానాలు ఆచరించే శ్వేత పుష్కరిణి పరిస్థితి అధ్వానంగా ఉంది. స్థానికులు అందులోనే దుస్తులు ఉతకడం వంటివి చేస్తుండటంతో నీరు రంగుమారి అపరిశుభ్రంగా తయారవుతోంది. పుష్కరిణి వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు.
  • భక్తుల వసతి కోసం గతంలో తితిదే నిర్మించిన సత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టలేదు.
  • వాహనాల పార్కింగ్‌ సమస్య వేధిస్తోంది.

అష్టతీర్థాల పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం వాటిని చేరుకునేందుకు దారులు సైతం సక్రమంగా లేవు. నిర్వహణ లేక నిస్తేజంగా మారిపోయాయి.

అరసవల్లికి మొండిచేయి..

దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి విషయంలో జగన్‌ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఏటా లక్షల సంఖ్యలో భక్తుల తాకిడి ఉంటున్నా.. రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఉన్న ఈ క్షేత్రం అయిదేళ్లలో కనీస ప్రగతికి నోచుకోలేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెదేపా హయాంలో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే దిశగా చర్యలు తీసుకుంది. వైకాపా అధికారంలోకి రాగానే ఆ ప్లానుపై సైతం దృష్టి సారించలేదు. దాతలిచ్చే విరాళాలతో నామమాత్రపు పనులు చేశారు తప్ప ప్రభుత్వ పరంగా ఒక్క నిర్మాణం చేపట్టలేదు.

మరిన్ని వైఫల్యాలిలా..

  •  ఆలయ అధికారిక కార్యకలాపాలు నిర్వహించేందుకు సరైన కార్యాలయం, పాలకమండలి సమావేశ మందిరం లేవు.
  • తిరువీధి కార్యక్రమాల సమయంలో పట్టుమని పది మంది ఒకేసారి వెళ్లేందుకు ఆస్కారం లేని విధంగా ఆలయ మాడవీధులు ఉన్నప్పటికీ వాటిని విస్తరించేందుకు అడుగులు పడలేదు.
  • భక్తులు వాహనాలను పార్కింగ్‌ చేసుకునే ప్రత్యేక ప్రదేశం కనిపించదు.
  •  అన్నదానం నిర్వహిస్తున్న గది, ప్రసాదాల కౌంటర్ల ప్రాంతం, కేశఖండనశాల భక్తుల అవసరాలకు సరిపడా లేవు.
  • ఇంద్రపుష్కరిణి ఆధునికీకరణకు రూ.4 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభించకపోవడంతో భక్తులు పుణ్యస్నానాలకు దూరమవుతున్నారు.
  • ప్రణాళిక, అనుమతులు లేకుండా దాతల విరాళాలతో నిర్మించిన వసతి గదులు సైతం భక్తులకు ఉపయోగపడని పరిస్థితి నెలకొంది.
  • క్యూలైన్లు సైతం అస్తవ్యస్తంగా ఉన్నా మెరుగుపరిచేందుకు దృష్టి సారించలేదు.
  • మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యమూ అంతంతమాత్రమే.

రూ.54 కోట్లు ఎక్కడ?

జిల్లాలో పేరొందిన శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిని విస్మరించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2022లో ఫిబ్రవరి 19న కొత్త పాలకమండలి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ రూ.54 కోట్లతో అనేక పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రానికి ఇరువైపులా ముఖద్వారాలు నిర్మిస్తామని బీరాలు పలికారు. వాటి సంగతి అతీగతీ లేకుండా పోయింది. తెదేపా హయాంలో 2018 మార్చి 30న మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు నాటి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. వాటితో మాఢ వీధుల పనులకు శ్రీకారం చుట్టారు. కొంతమేర పనులు చేశాక ఎన్నికలు రావడంతో ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వైకాపా గద్దెనెక్కిన తరువాత వాటి సంగతి పూర్తిగా విస్మరించింది.

నెలకొన్న సమస్యలిలా..

బీభక్తులకు వసతి సదుపాయం కల్పించేందుకు 2010లో రూ.45 లక్షల నిధులతో భవనం నిర్మించారు. బిల్లులందక పోవడంతో గుత్తేదారు నేటికీ దాన్ని దేవాదాయశాఖకు అప్పగించకపోవడంతో అది శిథిలావస్థకు చేరుకుంటుంది.

  • అష్టతీర్థాలు నిర్వహణ గాలికొదిలేశారు.
  • మాఢవీధుల నిర్మాణం, సోమలింగేశ్వరస్వామి అలయ సమీపంలో కల్యాణకట్ట, బస్‌ షెల్టర్‌, విశ్రాంతి భవనం, భోజనశాల చేపట్టాల్సి ఉంది.
  • మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే చత్రతీర్థస్నానానికి వచ్చే భక్తులకు నేటికీ శాశ్వత రహదారి లేదు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని