logo

ఇదేనా జగన్‌.. మీరు చెప్పిన ఊళ్లు..

జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అంటూ ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఊదరగొట్టారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతో పట్టణాల మాదిరిగా తయారవుతాయని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తున్న సాయం పునాదులు, గోడలు నిర్మించడానికే సరిపోతోంది.

Updated : 23 Apr 2024 07:30 IST

జగనన్న కాలనీల్లో కనీస వసతులు కరవు
గృహ నిర్మాణాలకు ఆసక్తి చూపని లబ్ధిదారులు

‘కడుతున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. పేదల సొంతిటి కల నెరవేరుస్తున్నాం. రూ.లక్షల విలువ చేసే ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాను’

జగనన్న కాలనీల విషయంలో సీఎం చెప్పిన మాటలివీ..

‘ఊరికి దూరంగా ఇంటి స్థలం చూపించారు.. అక్కడే ఇల్లు కట్టుకోవాలని చెప్పారు.. తీరా చూస్తే ఆ ప్రాంతంలో దారి సరిగ్గా లేదు.. వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం ఏమీ కల్పించలేదు. ఇల్లు కట్టుకుందామంటే ఇసుక కూడా దొరకట్లేదు. అయిదేళ్ల పాలన పూర్తయినా మా సొంతింటి కల నెరవేరలేదు’

ఇది క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఆవేదన


న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌, బూర్జ, నరసన్నపేట, కోటబొమ్మాళి, రణస్థలం, కవిటి గ్రామీణం, జలుమూరు, టెక్కలి పట్టణం, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు

గనన్న కాలనీల్లో నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అంటూ ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఊదరగొట్టారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతో పట్టణాల మాదిరిగా తయారవుతాయని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తున్న సాయం పునాదులు, గోడలు నిర్మించడానికే సరిపోతోంది. సామాన్యులకు ఇసుక బంగారమైపోయింది. ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూలీ ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో ఇంటి నిర్మాణానికి కనీసం రూ.ఆరేడు లక్షలు ఖర్చవుతోంది. కొన్నిచోట్ల శ్లాబు వేసిన ఇళ్లలో లోపల పనులు పూర్తి చేయకుండా రంగులు వేసి ఆదరాబాదరాగా సామూహిక గృహప్రవేశాలు పూర్తి చేశారు. ఇప్పటికీ వాటిలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు పడుతున్నారు.  ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్లకు అద్దె చెల్లించక తప్పడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.

కొన్నిచోట్ల మరీ దారుణం..

జిల్లాలోని కొన్ని మండలాల్లోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పరిస్థితి దారుణంగా ఉంది. సారవకోటలో 421 గృహాలకు  కేవలం 7 మాత్రమే పూర్తయ్యాయి. హిరమండలంలో 445కి 10, కొత్తూరులో 1,050కి 19, ఎల్‌.ఎన్‌.  పేటలో 348కి 20 చొప్పున ఇళ్లు మాత్రమే కట్టారు.


అసంపూర్తిగా కుళాయిల ఏర్పాటు

నరసన్నపేట మండలం తామరాపల్లి లేఅవుట్‌లో 29 మందికి అయిదుగురే ఇళ్లు నిర్మించారు. ఇక్కడ తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇంటింటా కుళాయి ఏర్పాటు పనులను ఇలా అసంపూర్తిగా చేశారు. జమ్ము గ్రామంలోని లేవుట్‌లో 35 మందికి ఇళ్లు కేటాయించగా నాలుగు కుటుంబాలే నివాసముంటున్నాయి. బావుల నుంచి వాడుక నీరు తెచ్చుకుంటున్నారు. తాగడానికి కొనుగోలు చేస్తున్నారు. రహదారులు, కాలువలు నిర్మించలేదు.


మంజూరు 260.. నిర్మాణం 4

టెక్కలి పరిధి అంజనాపురం వద్ద జగనన్న లేఅవుట్‌లో మౌలిక వసతులు లేక లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావట్లేదు. ఇక్కడ 260 మందికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయగా.. నాలుగు గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. కాలనీ పట్టణానికి దూరంగా ఉండటంతో సగం మంది పునాదులు వేయలేదు. బోరు నుంచి నీరు రాకపోవడంతో లబ్ధిదారులు ట్యాంకర్లతో నీరు రప్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీధి దీపాలు, రహదారి సౌకర్యం లేదు.


పనికిరాని మొక్కల మధ్యనే ఆవాసం

బూర్జ మండలం చీడివలస వద్ద జగనన్న కాలనీలో 23 మందికి స్థలాలు కేటాయించారు. ఇక్కడికి చేరుకునే రహదారి ఎత్తు పల్లాలుగా మట్టి కుప్పలతో ఉంది. అరకొరగా విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేశారు. కుళాయిలు లేక లబ్ధిదారులు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. ఇళ్ల మధ్యలో పనికిరాని మొక్కలు పెరిగాయి. ఏడుగురు లబ్ధిదారులు గృహప్రవేశం చేసినప్పటికీ రెండు కుటుంబాలే నివాసముంటున్నాయి.  


చినుకు పడితే బురదే..

వజ్రపుకొత్తూరు వద్ద జగనన్న కాలనీలో 57 మందికి స్థలాలు కేటాయించగా 10 మినహా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఏడుగురు గృహప్రవేశం చేయగా రెండిళ్లలోనే నివాసముంటున్నారు. రహదారి, మురుగు కాలువలు, తాగునీటి సదుపాయం కల్పించలేదు. చిన్న వర్షం పడినా దారులన్నీ బురదమయమవుతున్నాయి.  


బోరు.. పట్టించుకోరు..

జలుమూరులో జగనన్న కాలనీకి జర్జంగి-పిండ్రువాడ రహదారి నుంచి వెళ్లడానికి సరైన మార్గం లేదు. వర్షాకాలంలో కాలినడకన వెళ్లడం కష్టమే. ఇక్కడ 56 ఇళ్లు మంజూరు కాగా ఐదుగురు గృహప్రవేశం చేశారు. బోరు మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడే లేకుండా పోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.


బిల్లులు రాక.. పునాది దశలోనే..

కవిటి మండలం భైరిపురం వద్ద చెరువు పక్కన 169 మందికి పట్టాలు ఇచ్చారు. 52 మంది పునాదులు వేశారు. ఎనిమిది ఇళ్లు శ్లాబు వరకు నిర్మించారు. రెండు బోర్లు ఏర్పాటు చేసినా నీరు సక్రమంగా అందట్లేదు. ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు.


అందుకే ప్రారంభించలేదు..

మందస మండలం హరిపురం ప్రాంతంలో ప్రభుత్వ భూములుండగా జగనన్న కాలనీ కోసం రెండు కిలోమీటర్ల దూరంలో లేఅవుట్‌ వేశారు. 52 మందికి పట్టాలిచ్చారు. సిమెంట్‌ రోడ్లు, కాలువలు లేవు. చిన్నపాటి వర్షం కురిసినా అడుగు పెట్టలేని పరిస్థితి. అందుకే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. 

కొంచాడ సురేష్‌, లబ్ధిదారుడు, హరిపురం


సౌకర్యాలుంటేనే కట్టుకుంటాం..

టెక్కలి పరిధి అంజనాపురం సమీపంలో ప్రభుత్వం స్థలం కేటాయించి ఏళ్లు గడిచినా కనీస వసతులు కల్పించలేదు. ప్రైవేటు లేఅవుట్లకు నిబంధనలు పెట్టే అధికారులు రహదారి సౌకర్యం లేకుండా ఇళ్ల నిర్మాణానికి ఎలా అనుమతించారో అర్థం కావట్లేదు. పక్కనే గ్రానైట్‌ క్వారీ, స్టోన్‌ క్రషర్‌ ఉండటంతో పెద్దఎత్తున దుమ్ము వెలువడుతోంది. అత్యంత సమీపం నుంచి విద్యుత్తు టవర్‌ లైన్లు వెళ్తున్నాయి. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తేనే ఇల్లు నిర్మించుకోగలం.

దూపాన గౌతమిరెడ్డి, టెక్కలి

జిల్లా వివరాలు ఇలా..  

మొత్తం జగనన్న లేఅవుట్లు: 794 నిర్మించాల్సిన ఇళ్లు: 49,810 పూర్తయినవి: 8,416 పనులు ప్రారంభించనివి: 976 పునాది దశ దాటనివి: 13,631  వివిధ స్థాయిల్లో ఉన్నవి: 21,229

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని