logo

అన్నొచ్చాడు.. అడ్డంగా బాదేశాడు..!

‘అన్నొస్తున్నాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పిండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తు ఛార్జీలు తగ్గించేస్తామని కూడా గట్టిగా చెప్పండి’ అని సీఎం జగన్‌ ప్రతిపక్ష నేత హోదాలో ఊరూరా ఊదరగొట్టారు.

Updated : 28 Apr 2024 04:55 IST

ఇష్టానుసారం విద్యుత్తు ఛార్జీలు పెంచేసిన వైకాపా ప్రభుత్వం
సామాన్యులపై సర్దుబాటు పేరుతో రూ.కోట్లలో  భారం

‘అన్నొస్తున్నాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పిండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తు ఛార్జీలు తగ్గించేస్తామని కూడా గట్టిగా చెప్పండి’ అని సీఎం జగన్‌ ప్రతిపక్ష నేత హోదాలో ఊరూరా ఊదరగొట్టారు. అది నమ్మి గద్దెనెక్కించిన జనాలకు దిమ్మతిరిగే షాకిచ్చారు. అయిదేళ్లలో బిల్లులు ఇష్టానుసారం పెంచేసి సామాన్యుల నడ్డి విరిచేశారు. అంతటితో ఆగకుండా ట్రూ అప్‌, సర్దుబాటు అంటూ వివిధ సాకులు చూపుతూ అదనంగా బాదేశారు.

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే గుజరాతీపేట(శ్రీకాకుళం): వైకాపా సర్కారు అన్ని వర్గాల విద్యుత్తు వినియోగదారులపైనా ఛార్జీల భారం మోపింది. కొన్ని వర్గాలకు కనెక్షన్లకు టారిఫ్‌లలో మార్పులు చేయకుండా.. స్లాబులు పెంచేసి దొడ్డిదారిలో అడ్డంగా దోచేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,55,428 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటినిపై అయిదేళ్లలో రూ.కోట్ల భారం మోపారు. ట్రూఅప్‌ (వాస్తవ విద్యుత్తు సరఫరా వ్యయం), ఇంధన కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) పేర్లతో అదనంగా వడ్డించారు. గృహ కనెక్షన్లకు సంబంధించిన బిల్లులపై వీటి ప్రభావం రూ.వందల్లో ఉంటే.. వాణిజ్య రంగాల కనెక్షన్లపై రూ.వేలల్లో కనిపించింది.

  • 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నష్టాలు వచ్చాయనే సాకు చూపించారు. ఆ సమయంలో వినియోగించిన ప్రతి యూనిట్‌కు 20 పైసల మేర లెక్క కట్టి బిల్లులో అదనంగా వసూలు చేశారు.
  • 2023 సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాల్లో విద్యుత్తు ఛార్జీలు పెంచుతూ వచ్చారు. ఇందులో మొదటి త్రైమాసికంలో రూ.4 కోట్లు భారం మోపగా.. రెండు, మూడు, నాలుగు త్రైమాసికాలకు రూ.13 కోట్ల చొప్పున బాదారు. వీటి ఫలితంగా ఒక్కసారిగా పెద్దమొత్తంలో వచ్చిన బిల్లులను చెల్లించలేక నిరుపేదలు లబోదిబోమన్నారు.
  • ఏడాదిలో విద్యుత్తు కొనుగోలు, ఇతర ఖర్చులకు ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) అనుమతించిన మొత్తానికి అదనంగా చేసిన ఖర్చును ట్రూఅప్‌ పేరుతో డిస్కంలు వసూలు చేశాయి. తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ శ్రీకాకుళం సర్కిల్‌ పరిధిలో మొత్తం 8,55,428 కనెక్షన్లు ఉండగా వాటిల్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లుపైనే ఎక్కువగా భారం మోపారు. ఒక్క ఏడాది వ్యవధిలోనే వాటిపై రూ.42 కోట్లు అదనపు భారం మోపారంటే పరిస్థితి  ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సంపాదనంతా దీనికే సరిపోతుంది

మా ఇంట్లో ఫ్యాను, రెండు బల్బులు, ఫ్రిజ్‌ ఉన్నాయి. ఇంటి ఆవరణలో చిన్న కిల్లీ బడ్డి నడుపుతున్నాను. గతంలో ప్రతి నెలా రూ.250 నుంచి రూ.300 మధ్య వరకు విద్యుతు బిల్లు వచ్చేది. కొంత కాలం నుంచి విపరీతంగా వస్తోంది.  సంపాదనంతా కరెంట్‌ బిల్లుకే సరిపోతుంటే.. ఇంకేమి తిని బతకాలి.?

టి.లక్ష్మీ, డొంకూరు గ్రామం, కవిటి మండలం

అంతా బిల్లు ఎలా చెల్లించాలి...

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా ఇస్తామన్నారు. అయిదేళ్లపాటు అదనపు యూనిట్లకు బిల్లు చెల్లించాలని అడగలేదు. ఇప్పుడేమో ఏకంగా రూ.24 వేలు బిల్లు వచ్చింది. చెల్లించకుంటే కనెక్షన్‌ తీసేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ విద్యుత్తు ఛార్జీలు పెరిగిపోయాయి. కూలీ పనులు చేసుకుంటూ బతికే మాలాంటి వాళ్లం అంత బిల్లు ఎలా చెల్లించగలం.

మజ్జి మాధవరావు, ఎస్సీ కాలనీవాసి, శ్రీముఖలింగం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని