logo

గోట్‌లో విజయకాంత్‌

నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌ ‘గోట్‌’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు.

Published : 19 Apr 2024 00:10 IST

విజయకాంత్‌, విజయ్‌

చెన్నై, న్యూస్‌టుడే: నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌ ‘గోట్‌’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. ఇందుకోసం విజయకాంత్‌ సతీమణి, డీఎండీకే ప్రధానకార్యదర్శి ప్రేమలతతో చిత్ర దర్శకుడు వెంకట్‌ ప్రభు పలుమార్లు మాట్లాడారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రేమలత వెల్లడించారు. ‘సెంథూరపాండి’ చిత్రం ద్వారా విజయ్‌ను నటుడిగా విజయకాంత్‌ పరిచయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దర్శకుడు ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌, ఆయన కుమారుడైన నటుడు విజయ్‌పైన విజయకాంత్‌కు ప్రత్యేక అభిమానమని తెలిపారు. కెప్టెన్‌ జీవించి ఉంటే ప్రస్తుతం ఏఐ సాంకేతికతతో తన రూపాన్ని చిత్రంలో వాడటంపై అభ్యంతరం చెప్పబోరని పేర్కొన్నారు. విజయ్‌ తనను కలిసేటప్పుడు కచ్చితంగా మంచి నిర్ణయాన్ని చెబుతానని తెలిపారు.


10 లక్షల వ్యూస్‌ దాటిని హరా టీజర్‌

 

చెన్నై, న్యూస్‌టుడే: తమిళ చిత్రసీమలో 80, 90లలో అగ్రస్థానంలో ఉన్న కథానాయకుల్లో ఒకరైన మోహన్‌ ప్రస్తుతం ‘గోట్‌’లో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌ శ్రీజి దర్శకత్వంలో ‘హరా’ అనే చిత్రం ద్వారా మళ్లీ ఆయన కథానాయకుడిగా కనిపించనున్నారు. ఖుష్బూ, యోగిబాబు, దీప, మైమ్‌ గోపి, శామ్స్‌, కౌశిక్‌ తదితరులు ఇతర నటీనటులు. కోయంబత్తూర్‌ మోహన్‌రాజ్‌, జి మీడియా జయశ్రీ విజయ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్‌ను 14న సాయంత్రం విడుదల చేసిన నేపథ్యంలో 24 గంటల్లో 10లక్షల వీక్షణలను యూట్యూబ్‌లో పొందింది. నిర్మాత మోహన్‌రాజ్‌ మాట్లాడుతూ... ఇది తాము నిర్మిస్తున్న రెండో చిత్రమన్నారు. పూర్తిగా కోయంబత్తూర్‌లో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. మోహన్‌కు మళ్లీ కీలక మలుపుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 93ఏళ్ల వయసులోనూ చారుహాసన్‌ నటన మెప్పించిందని తెలిపారు.


ఉయిర్‌ తమిళుక్కు ట్రైలర్‌ విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: దర్శకుడు అమీర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉయిర్‌ తమిళుక్కు’. చాందిని శ్రీధరన్‌, ఆనంద్‌రాజ్‌, ఇమాన్‌ అణ్ణాచ్చి, మారిముత్తు, రాజ్‌కపూర్‌, సుబ్రమణియ శివ, మహానది శంకర్‌, రాజసిమ్మన్‌, శరవణశక్తి తదితరులు ఇతర తారాగణం. మూన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై ఆదంబావా నిర్మిస్తున్నారు. విద్యాసాగర్‌ స్వరాలు సమకూర్చారు. చిత్రం విడుదల హక్కులను సురేశ్‌ కామాచ్చికి చెందిన వి హౌస్‌ ప్రొడక్షన్‌ దక్కించుకుంది. పాటలు గతవారం విడుదలైన నేపథ్యంలో ట్రైలర్‌ను చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. రాజకీయ నేపథ్య కథాంశంతో రూపొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని