logo

12 జిల్లాల సరిహద్దుల్లో సోదాలు

తమిళనాడులో 12 జిల్లాల సరిహద్దుల్లో ఫ్ల్లయింగ్‌స్క్వాడ్‌ సోదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు తెలిపారు.

Published : 23 Apr 2024 01:05 IST

సత్యప్రద సాహు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తమిళనాడులో 12 జిల్లాల సరిహద్దుల్లో ఫ్ల్లయింగ్‌స్క్వాడ్‌ సోదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు తెలిపారు. చెన్నైలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు నగదు, వస్తువులు తీసుకెళ్లడాన్ని నిషేధించడానికే సోదాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. తిరువణ్ణామలై, వేలూర్‌, కృష్ణగిరి, సేలం, ఈరోడ్‌, నీలగిరి, కోవై, తేని, నెల్లై, కన్యాకుమారి, తెంకాశీ, తిరుప్పత్తూర్‌ తదితర జిల్లాలో 57 బృందాలు మూడు షిఫ్ట్‌లుగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మిగిలిన జిల్లాలో ఇలాంటి తనిఖీలు లేవన్నారు. పోలింగ్‌రోజున శాతం గందరగోళానికి కారణం యాప్‌లో దొరికిన సమాచారం మేరకు లెక్కించడమేనన్నారు. యాప్‌లో కొందరు మాత్రమే అప్‌లోడ్‌ చేయడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. ఎన్నికలు నిర్వహించే అధికారి సంతకం చేసి ఇచ్చేందుకు సమాచారం అందడంలో ఆలస్యమవుతున్నందున యాప్‌ ద్వారా మీడియాకు అప్డేట్‌ ఇచ్చామన్నారు.

50వేలకుపైగా నగదు తీసుకెళ్లొచ్చు

ఆర్కేనగర్‌: తమిళనాడు- పుదుచ్చేరిలో 40 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. మరికొన్ని రాష్ట్రాలలో జూన్‌ 1వరకు ఆరు విడతలుగా పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయి. తమిళనాట పోలింగ్‌ పూర్తయినందున ఫ్లయింగ్‌స్క్వాడ్‌ సోదాలు తగ్గాయి. చెన్నైలో మొత్తం 53 బృందాలు వాహన తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం శాసనసభ నియోజకవర్గానికొకటి చొప్పున 18 మాత్రమే సోదాలకు ఉన్నాయి. ఎన్నికల అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలింగ్‌ పూర్తయిన నేపథ్యంలో నగదు స్వాధీనానికి సంబంధించి సదరు వ్యక్తులు ఎన్నికల కార్యాలయాలను సంప్రదించి తగిన పత్రాలు చూపి తీసుకోవచ్చని తెలిపారు. చెన్నైలో కార్పొరేషన్‌ సహాయ కమిషనర్‌ ఉమామహేశ్వరి ఇందుకు నియమితులయ్యారని చెప్పారు. జిల్లాల్లోని ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే సోదాలు కొనసాగుతాయన్నారు. వ్యాపారులు, ప్రజలు నష్టపోకూడదని ఎన్నికల కమిషన్‌ పలు సడలింపులు చేసిందన్నారు. అందులో భాగంగా ఇప్పుడు రూ.50వేలకు పైగా నగదు తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని